Govt Schemes : Rs.4000 per month for students through this scheme.. and free coaching for job and entrance exams..!
Govt Schemes : ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు నెలకు రూ.4000.. అలాగే ఉద్యోగ, ఎంట్రెన్స్ పరీక్షలకు ఉచితంగా కోచింగ్..!
Free Coaching Scheme : దేశవ్యాప్తంగా ప్రతియేటా ఎంతో మంది ఉద్యోగ, ఎంట్రెన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. వీరిలో చాలా మంది నిరుద్యోగ కుటుంబాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. ఇలాంటి వారు ఈ స్కీమ్‌కు ఎలా అప్లయ్ చేసుకోవాలి.. అర్హతలేమిటి.. తదితర విషయాలను చూద్దాం..
Govt Schemes : పలు ప్రభుత్వ ఉద్యోగ, ఎంట్రెన్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. యూపీఎస్సీ, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నీట్, క్యాట్, టోఫెల్, సీఏ, బ్యాంకింగ్ వంటి ఉద్యోగ పరీక్షలకు ఇంటర్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. వీళ్లంతా ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. అయితే అక్కడ కోచింగ్ తీసుకోవడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. చాలా మంది విద్యార్థులు ఖర్చు భరించే స్తోమత లేక మధ్యలోనే విరమించుకుంటుంటారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విద్యార్థులకు ప్రతి నెలా రూ.4000 ఉపకార వేతనం కూడా ఇచ్చి ఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుంది. అయితే.. ఈ పథకాన్ని కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC), ఇతర వెనుకబడిన కులాలు (OBC) సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అమలు చేస్తోంది. ఏటా వేల మందికి లబ్ధి చేకూర్చుతున్న ఈ పథకం పేరు ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ (Free Coaching Scheme for SC and OBC Students) పథకం. వివరాల్లోకెళ్తే..
అసలు ఏంటీ పథకం..?
పేద వర్గాల సాధికారత కోసం ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావాల్సిన కోచింగ్‌ను ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. దీని కోసం 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తొలుత 'Coaching and Allied Assistance for Weaker Sections' పేరిట 2001 సెప్టెంబరులో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. అనంతరం మైనార్టీలకు చెందిన వ్యవహారాలన్నీ చూడటం కోసం కేంద్ర ప్రభుత్వం మైనార్టీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అప్పుడే ఈ పథకంలో మార్పులు చేశారు. కేవలం ఎస్సీలు, ఓబీసీ కేటగిరీలను మాత్రమే చేర్చుతూ 2016 ఏప్రిల్‌లో దీనికి ‘Free Coaching Scheme for SC and OBC Students’గా పేరుగా మార్చారు.
ఈ పోటీ పరీక్షలకు ఈ కోచింగ్ ఇస్తారు.:
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ ఏ, బీ పరీక్షలు
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
- రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు
- స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లు నిర్వహించే పరీక్షలు
- బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండర్ టేకింగ్స్ నిర్వహించే ఆఫీసర్స్ గ్రేడ్ ఎగ్జామ్స్
- ఐఐటీ, జేఈఈ, మెడికల్ (నీట్ ), ప్రొఫెషనల్ కోర్సులు ( క్యాట్ ), లా (క్లాట్).. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిర్ణయించే మరికొన్ని పరీక్షలు
- ఎస్ఏటీ, జీఆర్ఈ, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్
- సీపీఎల్ కోర్సుల కోసం ఎంట్రెన్స్‌లు, నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసులు తదితర పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.
ఏయే పరీక్షలకు ఎంత శాతం కేటాయిస్తారంటే..?
మొత్తం పథకంలో 60 శాతం స్లాట్స్ డిగ్రీ అర్హతతో రాయబోయే పోటీ పరీక్షలకు కేటాయిస్తారు. మిగిలిన 40 శాతం ఇంటర్మీడియెట్ లేదా +2 లేదా 12వ తరగతి అర్హతతో రాయబోయే పోటీ పరీక్షలకు కేటాయిస్తారు.
ఈ పథకానికి ఎవరు అర్హులంటే..?
- షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
- విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించి ఉండకూడదు.
- మండల రెవెన్యూ అధికారి (MRO) జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందుపరచాలి.
- ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతతో రాసే పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలనుకునే విద్యార్థులు ఈ పథకానికి ఎంపికయ్యే నాటికి వాటికి సంబంధించిన విద్యార్హత ధ్రువ పత్రాలు పొందుపరచాలి.
- ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తయిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పథకానికి అర్హులే.
- విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతరత్రా ఏవైనా పోటీ పరీక్షల కోచింగ్ తీసుకుంటుంటే ఆ వివరాలను కూడా తెలియజేయాలి.
ఇంటర్, డిగ్రీలో ఎన్ని మార్కులు రావాలంటే..?
ఈ పథకం ద్వారా అర్హత పొందడానికి ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు పరీక్షల్లో విద్యార్థి 50 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి. 50 శాతం కంటే మార్కులు తక్కువ ఉంటే అర్హులు కాదు.
అయితే.. కేవలం రెండు పర్యాయాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇలా పోటీ పరీక్షలకు శిక్షణ పొందడానికి ఉపకార వేతనాలు ఇస్తుంది. అంతకు మించి ఈ పథకం పొందడానికి వీలుండదు. ప్రతి యేటా 3500 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలు 70 శాతం, ఓబీసీ విద్యార్థులకు 30 శాతం కేటాయిస్తారు. ఒక వేళ ఇంతకంటే తక్కువ శాతంలో ఆయా కేటగిరీల నుంచి విద్యార్థులు ఉంటే అప్పుడు నిబంధనలను కొంత సడలిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమొచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలగించిన కొన్ని సంస్థలున్నాయి. వాటిలో మాత్రం చేరకూడదు.
ఈ పథకం నుంచి నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే డబ్బులు చెల్లిస్తారు. ఆయా కోర్సుకు కోచింగ్ సెంటర్ ఎంత ఫీజు నిర్ణయించిందో అంత ఫీజూ పూర్తిగా చెల్లిస్తారు. అయితే గరిష్ఠంగా మాత్రం ఒక్కో కోర్సుకు ఇంత ఫీజు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ఫీజు పరిమితికి మించి చెల్లించరు. ఒకవేళ అంతకు మించి చెల్లించాల్సి వచ్చినా ఆ మిగిలిన అదనపు ఫీజును విద్యార్థి సొంతంగా భరించాల్సి ఉంటుంది.
ఫీజు ఎప్పుడు చెల్లిస్తారంటే..?
విద్యార్థి ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఫీజు చెల్లించిన రసీదును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన రెండు వారాల్లోపు ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే విద్యార్థికి కేవలం ఫీజు చెల్లించడమే కాకుండా ఆ విద్యార్థికి ఆ పోటీ పరీక్ష రాసే వరకు ప్రతి నెలా రూ.4000 స్కాలర్‌షిప్ కూడా ఇస్తుంది.
కోచింగ్ పూర్తయిన తరువాత ఈ ఉపకారవేతనాన్ని ఒకేసారి విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. కోచింగ్ పూర్తయినట్లు, తాను రాయబోయే పోటీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌ను విద్యార్థి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. పోటీ పరీక్ష రాసిన తర్వాత ఉపకార వేతనం ఇవ్వరు. ఒకవేళ పోటీ పరీక్ష నిర్వహణ ఏదైనా కారణాల వల్ల ఏడాదికి మించి సమయం తీసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే విద్యార్థి తెలియజేయాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువు తరువాత ఉపకార వేతనం ఆపేస్తారు.
ఈ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారంటే..?
ఈ పథకం కింద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ మే నెలలో జారీ చేస్తారు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు అనుమతిస్తారు. మే నెల 31వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు పక్రియను పుర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మే 31వ తేదీ తరువాత ఈ వెబ్‌సైటు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ పూర్తీగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఎంపిక కూడా పూర్తీగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తారు. అభ్యర్థుల జాబితా కూడా ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు.
COMMENTS