LIC News: LIC into the field on Odisha train accident. Special initiative. Full details.
LIC News: ఒడిశా రైలు ప్రమాదంపై రంగంలోకి LIC.ప్రత్యేక చొరవ.పూర్తి వివరాలు.
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దేశంలో గడచిన మూడు శతాబ్ధాల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం. ఈ క్రమంలో ఏకంగా మూడు రైళ్లు ఢీకొనటం తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది.దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, నటులు, వ్యాపారవేత్తలతో పాటు అనేక మంది ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.
ప్రధాని మోదీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ప్రమాదంలో మెుత్తం 288 మంది మరణించగా.. 1100 మంది వరకు గాయపడ్డారు.
అయితే ఈ పరిస్థితుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన బాధితుల క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ కోసం జాతీయ బీమా సంస్థ ఎల్‌ఐసీ శనివారం పలు సడలింపులను ప్రకటించింది.
బాధితుల బంధువుల కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియకు అవసరమైన సడలింపులను LIC చైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల బాధపడుతున్నట్లు తెలిపిన ఆయన.. బాధితులను ఆదుకోవటానికి ఎల్ఐసీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారికి ఆర్థిక సహాయం అందించడానికి క్లెయిమ్ సెటిల్మెంట్‌లను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు కోరమాండల్ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పినట్లు వెల్లడైంది. అయితే ఈ రైళ్లలో కవచ్ పరికరాన్ని ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ ఒక చోట రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
LIC పాలసీలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్లెయిమ్‌దారుల కష్టాలను తగ్గించడానికి LIC అనేక రాయితీలను ప్రకటించింది. నమోదిత మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా.. రైల్వేలు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర అధికారులు ప్రచురించిన మరణాల జాబితా మరణానికి రుజువుగా అంగీకరించబడుతుందని తెలిపింది. క్లెయిమ్-సంబంధిత సందేహాల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్ నంబర్ 022-68276827ను కూడా ఏర్పాటు చేసింది.
COMMENTS