Jobs Retention: These jobs are of great interest to Indians.
Jobs Retention: ఈ జాబ్స్ అంటే ఇండియన్స్ కి తెగ ఇంట్రెస్ట్.. ఎన్ని కష్టాలు వచ్చినా వదులుకోరు..
పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఉద్యోగులు తమ వృత్తిగత జీవితంలో మార్పులు కోరుకోవడం సహజం. మెరుగైన అవకాశాల కోసం ఒక రంగం నుంచి మరొక రంగంలోకి ప్రవేశించే వారు ఎంతో మంది ఉంటారు. అయితే, దేశంలో కొన్ని రంగాల్లో మాత్రం ఇలాంటి మార్పు జరగట్లేదు. 2022 ఏడాదికి సంబంధించి ప్రముఖ జాబ్ సైట్ ఇండీడ్ నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. నిజాయితీగా ఉద్యోగం చేస్తూ కలకాలం ఒకే రంగంలోనే కొనసాగాలని వివిధ రంగాల ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో టెక్నాలజీ, ఆహార రంగం, ఆరోగ్య రంగానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి గల కారణాలను సైతం పేర్కొంది.
* టెక్నాలజీ రంగం
ఉద్యోగులకు ఈ రంగం స్వర్గధామంగా మారింది. ఈ సెక్టార్‌ని విడిచి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు ఉద్యోగులకు కల్పించడమే ఇందుకు ప్రధాన కారణమని ఇండీడ్ వెల్లడించింది. ప్రొఫెషనల్స్‌కి ఈ కోటా మరింత ఎక్కువగా ఉండటంతో ఉద్యోగం మారుదామనే ఆలోచన రావట్లేదు. ఇక్కడే ఉంటూ కెరీర్‌లో వృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు.
ప్రధానంగా కొన్ని పొజిషన్లలో ఉన్నవారు ఈ రంగానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రూబీ ఆన్ రైల్స్ డెవలపర్ ఉద్యోగులు అతి తక్కువగా 11.04 శాతం మంది బయటకు వెళ్లాలని చూస్తున్నారట. ఐవోఎస్ డెవలపర్(12.08), రిలీజ్ ఇంజినీర్(12.18), జావా స్క్రిప్ట్ డెవలపర్(12.23) వంటి ప్రత్యేక నైపుణ్యాలు, ప్రావీణ్యం కలిగిన జాబ్ రోల్స్‌లలో అతి తక్కువ మార్పులు ఉన్నట్లు తెలిపింది.
* ఆహార రంగం
ఫుడ్ ఇండస్ట్రీని వదిలి వెళ్లేందుకు చాలా మంది ఉద్యోగులు నిరాసక్తత చూపిస్తున్నారు. కొద్ది మంది మాత్రమే వేరే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారట. ముఖ్యంగా, సోస్ చెఫ్(Sous Chef)(11.18శాతం), ఎగ్జిక్యూటివ్ చెఫ్(16.16), హెడ్ చెఫ్(17.19) వంటి ఉద్యోగులు ఇందులోనే కెరీర్‌ని కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారు. పాక శాస్త్రంపై అభిరుచి ఉండటం, కొత్తగా తయారు చేయాలన్న కుతూహలం, ఆకట్టుకునేలా ఫుడ్‌ని డెకరేట్ చేయాలన్న ఆసక్తి ఈ ఉద్యోగులను ఫుడ్ రంగంలో కొనసాగేలా చేస్తోంది.
* ఆరోగ్యం, ఇతర రంగాలు
ఆరోగ్య రంగంలోని నర్సింగ్‌లో ఎక్కువ మంది కెరీర్‌ని బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారట. దీని తర్వాత మానవ వనరులు(హ్యూమన్ రిసోర్సెస్), ఆర్కిటెక్చర్, మీడియా రంగాల్లో ఉద్యోగాలకు అతుక్కుపోతున్నట్లు ఇండీడ్ వెల్లడించింది. వీరంతా తమ తమ ఉద్యోగాల్లో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. అందుకే, ఎంచుకున్న రోల్స్‌లో అంకిత భావంతో పనిచేస్తున్నట్లు తెలిపింది.
* వీటిలో మార్పులు ఎక్కువ
కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా మార్పులు కోరుకుంటున్నట్లు తెలిపింది. తక్కువ జీతంతో పాటు పనిచేయడానికి అసౌకర్యంగా ఉన్న రంగాలను విడిచి పెట్టేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా, కాల్ సెంటర్ ఉద్యోగాలు , ఎయిర్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్, అప్లికేటర్, ఫ్యునెరల్ డైరెక్టర్ వంటి ఉద్యోగాలను వదులుకుంటున్నారని ఇండీడ్ పేర్కొంది. మరోవైపు, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఫుడ్ ఇండస్ట్రీ రంగాల్లోకి వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది.
COMMENTS