Inspiration Love story - Poverty defeated by love.. On a bicycle from India to Europe for a wife
Inspiration Love story - ప్రేమ ముందు ఓడిన పేదరికం.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై
ప్రేమకు అవధులు లేవు. ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎంతో మంది ఎన్నో అవంతరాలను ఎదుర్కొని ప్రేమను దక్కించుకున్న వారు ఉన్నారు.
ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. అలాంటి కోవకే చెందినదే పీకే మహానందియా, షార్లెట్ వాన్ షెడ్విన్ ప్రేమ.. వీరి ప్రేమ దేశాలు కాదు ఏకంగా ఖండాంతరాలే దాటింది. అయితే ఇది దాదాపు 50 ఏళ్ల నాటి కథ. ఇటీవల తన ప్రేమ కోసం చేసిన సాహసాలను మహానందియా ఓ మీడియాతో పంచుకున్నారు. ఈ విశేషాలు మీకోసం..
22 రోజులు వ్యాన్‌లో ప్రయాణించి
ఢిల్లీకి చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియా పేదరిక కుటుంబంలో పుట్టిన గొప్ప కళాకారుడు. పెయింటింగ్ అంటే పిచ్చి. పెయింటింగ్‌లో తనకంటూ మంచి పేరు సంపాదించాలనే ఆశతో ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాడు.. ఈ క్రమంలో ప్రద్యుమ్న పెయింటింగ్ గురించి యూరప్‌లోని స్వీడన్‌కు చెందిన 19 ఏళ్ల షార్లెట్ వాన్ షెడ్విన్ తెలిసింది. ఎలాగైనా అతనితో తన పెయింటింగ్ వేయించుకోవాలని నిర్ణయించుకొని ఢిల్లీకి పయనమైంది. 22 రోజులు వ్యాన్‌లో ప్రయాణించి చివరికి అతన్ని చేరుకుంది. అలా 1975లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది.
ప్రేమ, పెళ్లి..
అదృష్టం కొద్దీ మహానందియాను కలిసి తన పోర్ట్రెయిట్‌ను తయారు చేస్తున్న సమయంలో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతను ఆమె అందానికి ప్రేమలో పడగా.. ఆమె అతని సింప్లిసిటీకి ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మహానందియా తన కుటుంబానికి తెలియజేయగా.. ఆమె అతని తల్లిదండ్రులను కలిసే సమయంలో మొదటిసారీ చీర కట్టుకుంది. విదేశీయురాలైన ఆమె చీరను ఎలా మేనేజ్ చేసిందో తనకిప్పటికీ ఆశ్యర్చంగానే అనిపిస్తుందని మహానందియా చెప్పాడు. చివరికి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
భర్తపై నమ్మకంతో
షెడ్విన్ స్వీడన్ వెళ్లే సమయం దగ్గరకు రాగా.. తనతో రావాలని ఆమె భర్తను కూడా కోరింది. అయితే మహానందియా మొదట తన చదువును పూర్తి చేయాల్సి ఉందని చెప్పాడు. తరువాత స్వీడిష్ టెక్స్‌టైల్ పట్టణం బోరాస్‌లోని తన ఇంటికి తప్పక వస్తానని భార్యకు మాట ఇచ్చాడు. అతనిపై నమ్మకంతో ఒక్కతే ఆమె తన స్వదేశానికి పయనమైంది. తరువాత ఇద్దరు ఉత్తరాల ద్వారా సన్నిహితంగా ఉండేవారు.
రోజూ 70 కిమీ ప్రయాణం
ఏడాది తర్వాత తన చదువు పూర్తి కావడంతో మహానందియా స్వీడన్ వెళ్లి తన భార్య షెడ్విన్‌ను కలవాలనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి అసలు విషయం గుర్తొచ్చింది. విమాన టికెట్ కొనుగోలు చేయడానికి తన వద్ద తగిన డబ్బు లేదని గుర్తొచ్చింది. దీంతో తనకున్నదంతా అమ్మేసి సైకిల్ కొన్నాడు. 1977 జనవరి 22న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోజు దాదాపు 70 కిమీ ప్రయాణించాడు. దాదాపు నాలుగు నెలలు కష్టపడి పాకిస్తాన్, అప్గనిస్తాన్, ఇరాన్, టర్కీలను దాటుకొని వెళ్లాడు. మార్గ మధ్యలో ఎన్నోసార్లు తన సైకిల్ పాడైపోయింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి తన ఒళ్లు పూనకం అయిపోయింది. అయినా అవేవి అతని సంకల్పాన్ని చెదర్చలేదు.
స్వీడన్ చేరుకొని
తన కళే అతన్ని ఆమె వద్దకు చేర్చిందని చెబుతుంటాడు. దారిలో కలిసిన వ్యక్తుల చిత్రాలను పెయింటింగ్ వేస్తే కొందరు డబ్బులు ఇచ్చేవారని.. మరికొందరు ఆహారం, ఆశ్రయం కల్పించారని చెప్పాడు. ఎట్టకేలకు మే 28న యూరప్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇస్తాంబుల్, వియన్నా మీదుగా, ఆపై రైలులో స్వీడన్‌లోని బోరస్ చేరుకొని ఆమెను కలుసుకున్నాడు. అక్కడ ఇద్దరూ అధికారికంగా స్వీడన్‌లో మళ్లీ పెళ్లిచేసుకున్నారు.
నేటికి అదే ప్రేమలో
యూరోపియన్ సంస్కృతి గురించి తనకేం తెలియదని.. కానీ తన భార్య అడుగడుగునా మద్దతు నిలచిందని తెలిపారు. ఆమె ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. 1975లో తొలిసారి తనను చూసి ప్రేమలో పడిన రోజులానే.. నేటీకి అదే ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈ కుటుంబం స్వీడన్‌లో నివసిస్తున్నారు. మహానందియా అక్కడే ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. చివరగా.. ప్రేమ గొప్పతనం అందరికీ తెలియదంటారు. కానీ మహానందియాకు దాని విలువ బాగా అర్థమైంది. అందుకే మనసిచ్చి మనువాడిన ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద మూడు నెలల ప్రయాణం చేశాడు. నచ్చిన చెలితో జీవితం గడుపుతున్నాడు. నేటి తరం యువతకు ప్రేమ అంటే కొత్త నిర్వచనాన్ని అందించాడు.
COMMENTS