Hotel Waiter To IAS Officer: He became an IAS officer while working as a waiter in a hotel.
Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు..
Hotel Waiter To IAS Officer: ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. అది లేనిదే ఏమీ సాధించలేం.. అంతేకాదు.. కనీసం ముందడుగేసే ధైర్యం కూడా రాదు.
అందుకే మనం ఒకటి సాధించాలి అని లక్ష్యం పెట్టుకున్నాకా.. అది సాధించి తీరుతాం అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగి ఉండాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల విషయంలో ఆత్మవిశ్వాసం మరింత అవసరం. ఆత్మవిశ్వాసంతో పాటు, క్రమశిక్షణ, చేసే పనిపై నిబద్ధత, ఏకాగ్రత కూడా అంతే అవసరం. వెయిటర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన జయ గణేష్ ఇన్‌స్పిరేషనస్ జర్నీ కూడా అలాంటిదే. ఏంటి.. వెయిటర్ గా పనిచేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడా అని షాకవుతున్నారా ? అవును, మీరు చదివింది నిజమే.
తమిళనాడు ఉత్తర అంబర్ సమీపంలో ఉన్న ఒక చిన్న కుగ్రామమే జయ గణేష్ పుట్టి, పెరిగిన సొంతూరు. సొంతూరిలోనే గణేష్ తన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ని పూర్తి చేశాడు. నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు అయిన జయ గణేష్ చిన్నప్పటి నుండే అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉండేవాడు. 12వ తరగతిలో 91% మార్కులతో పాస్ అవడమే అందుకు చక్కటి ఉదాహరణ. అంతేకాదండోయ్.. థాంథై పెరియార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం జయ గణేష్ ఒక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతడి నెల జీతం కేవలం రూ. 2500. అయితే, అంత తక్కువ జీతంతో తన కుటుంబాన్ని పోషించడం కుదరదు అనే ఉద్దేశంలోంచి అతడు సివిల్స్ పై దృష్టి సారించాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో.. అప్పటి నుంటే శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు.
జయ గణేష్ మొదటిసారో లేక రెండోసారి విజయం సాధించలేదు. మొత్తం ఆరుసార్లు పరీక్షలకు హాజరయ్యాడు. కొన్నిసార్లు ప్రిలీమ్స్‌లో పోతే ఇంకొన్నిసార్లు మెయిన్స్‌లో పోయింది. ఆ సమయంలో జయ గణేష్ ఎంతో నిరుత్సాహపడ్డాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. పూట గడవడమే ఇబ్బందిగా మారిన రోజులు అవి. తనే ఇంటికి పెద్దోడు కావడంతో కుటుంబం బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన అవసరం అతడిపై ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో హోటల్ వెయిటర్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూనే తనకు దొరికిన ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుకోసాగాడు.
అదే సమయంలో, జయ గణేష్ ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్షకు హాజరయ్యాడు. అందులో విజయం సాధించాడు. అప్పుడే అతడి ముందు అసలైన సవాలు ఎదురైంది.. ఆ ఉద్యోగంలో చేరాలా లేక ఏడవసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించాలా ? ఒకవేళ ఈ ఉద్యోగం వదులుకుని సివిల్స్ లో విజయం సాధించకపోతే ఉన్న ఉద్యోగం పోతుంది అనే భయం ఒకవైపు.. ఏదేమైనా సరే తను అనుకున్నది సాధించాలి అనే కసి, పట్టుదల మరోవైపు.. అంతిమంగా తను కోరుకున్న విధంగా ఐఏఎస్ అధికారి కావాలన్న తన కలకే తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
తన ఏడో ప్రయత్నంలో, జయ గణేష్ చివరకు సివిల్స్ లో విజయం సాధించాడు. అంతేకాదు.. ఆలిండియా 156వ ర్యాంకు సాధించడం జయ గణేష్ కష్టానికి, ఆయన సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది.
COMMENTS