Generic Aadhaar: Rs.110 medicine available for Rs.5.. 90% discount on this medical!
Generic Aadhaar: రూ.110 మెడిసిన్ రూ.5కే లభ్యం.. ఈ మెడికల్‌లో ఏకంగా 90% డిస్కౌంట్!
దేశంలో ఫార్మా రంగం విస్తృతంగా వ్యాపిస్తోంది. మెడికల్ దుకాణాల్లో లభ్యమయ్యే ఔషధాలకు భారీ డిమాండ్ నెలకొంది. కానీ, చాలా మంది ఈ మందులను కొనలేరు.
ఔషధాల ధరలు భారీగా ఉండటమే ఇందుకు కారణం. ఇలా సరైన సమయంలో మందులు వాడలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలను ప్రజలకు చేరవేస్తే ఎలా ఉంటుంది? రూ.100 లకు దొరికే మెడిసిన్ రూ.5 కే వస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా? అనే ఆలోచన వచ్చిందో 16 ఏళ్ల అబ్బాయికి. ఈ ఆలోచన కార్యరూపం దాల్చి నేడు రూ.500 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది. భారత సంప్రదాయ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో సరికొత్త వ్యవస్థ ఏర్పడింది.
జనరిక్ ఆధార్
మహారాష్ట్రలోని థానేకు చెందిన అర్జున్ దేశ్‌పాండే(21) 2018లో జనరిక్ ఆధార్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మెడిసిన్‌ని ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కంపెనీని స్థాపించాడు. మధ్యలో దళారీ వ్యవస్థను నిర్మూలించి కంపెనీ నుంచి నేరుగా కస్టమర్‌కు చేరే విధంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దాడు.
దీంతో దాదాపు 80 నుంచి 90 శాతం మేర ఔషధాల ధర తగ్గిపోయింది. ఉదాహరణకు డయాబెటిస్ పేషంట్లు ఉపయోగించే గ్లిమిపిరైడ్ స్ట్రిప్ ధర సాధారణంగా మెడికల్ దుకాణాల్లో రూ.110 ఉంటుంది. యాంటీ అలర్జెన్ లెవోసిట్రజిన్ ధర రూ.55 ఉంటుంది. కానీ, జనరిక్ ఆధార్‌లో గ్లిమిపిరైడ్ ధర కేవలం రూ.5 మాత్రమే. అదే లివోసిట్రజిన్ రూ.6కే లభిస్తోంది. ఇంత తేడా ఉండటంతో తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. స్థాపించిన రెండేళ్లలోనే దేశంలోని నగరాలకు వ్యాపించింది.
టాటా కంపెనీతో భాగస్వామ్యం
జనరిక్ ఆధార్ కంపెనీ టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా దృష్టిని ఆకర్షించింది. సీఈవో దేశ్‌పాండే టెడ్ టాక్‌లో పాల్గొనగా ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఆవిష్కరణ రతన్ టాటాకు ఎంతో నచ్చడంతో కంపెనీలో పెట్టుబడికి ముందుకొచ్చారు. అలా, జనరిక్ ఆధార్‌తో టాటా కంపెనీ భాగస్వామ్యం కుదిరింది. దేశం నలుమూలలా ఈ ప్రయోజనం అందేలా టాటా గ్రూప్ జనరిక్ ఆధార్‌కు సహాయం చేస్తోంది. ఢిల్లీ , ముంబై, బెంగళూరు నగరాలకు 40 కిలోమీటర్ల దూరంలో అసలైన భారతదేశం ఉంటుందని కంపెనీ సీఈవో అర్జున్ దేశ్‌పాండే వెల్లడించాడు. ప్రముఖ నగరాలకే కాకుండా పల్లెపల్లెకూ జనరిక్ ఆధార్ ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపాడు.
విదేశాలకు సైతం
దేశీయ మార్కెట్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, యూఏఈ, మయన్మార్‌లలో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే దుబాయ్, ఒమన్, కంబోడియా, వియత్నాంలో స్టోర్లను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. జనరిక్ ఆధార్ వెటర్నరీ విభాగంలోనూ అడుగు పెట్టింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో తొలి వెటర్నరీ స్టోర్‌ని ఓపెన్ చేసింది.
COMMENTS