Ex CM Grandson As Security Guard: The grandson of the former CM of AP who is working as a security guard!
Ex CM Grandson As Security Guard:సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఏపీ మాజీ సీఎం మనవడు!
రాజకీయమంటే వ్యాపారమైపోయింది. ప్రజా సేవ చేసినందుకు లక్షలు జీతమిస్తున్నా గానీ సరిపోక కోట్లు దోచుకుతినే రాజకీయ నాయకులు ఉన్నారు. చిన్న చిన్న పదవుల్లో ఉన్న వారే కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఏమీ లేని స్థితి నుంచి వచ్చి కోట్ల సంపాదనలో మునిగితేలుతున్నారు. తరతరాలకు ఎంత తిన్నా తరగని ఆస్తులను పోగేసుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూస్తున్నాం. ఒక సాదా సీదా రాజకీయ నాయకుడే కోట్లు వెనకేసుకుంటుంటే.. ఇక సీఎం హోదాలో ఉన్న వారు ఇంకెంత డబ్బు వెనకేసుకుంటారు. దోచుకునే స్వభావం లేకపోయినా.. ఏదో వ్యాపారం చేసి తమ తర్వాత తరాలకు ఆస్తులు పోగేయాలి కదా. కానీ రాజకీయం అంటే ప్రజా సేవ అని నమ్మారు కాబట్టే కొంతమంది హంగూ, ఆర్భాటాలకు పోకుండా జీవించారు.
ప్రజల డబ్బుని వృధా చేయకూడదని చెప్పి కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ద్విచక్ర వాహనాల మీదే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారు. హోదా పెద్దదైనా గానీ ఇంకా సాధారణ జీవితం గడిపే నాయకులు ఉన్నారు. ఈరోజుల్లో పదవి వస్తే రాజకీయ నాయకుల బంధువులకు కూడా కోట్లు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అలాంటిది ఒకప్పటి సీఎం మనవడు అయి ఉండి ఎటువంటి ఆస్తి లేకపోగా.. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా పని చేసిన దామోదరం సంజీవయ్య మనవడే ఈయన. ఈయన పేరు శ్రీధర్ గాంధీ. ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. దామోదరం సంజీవయ్య ఏపీ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి ఈయనే. అప్పటి నాయకులు ఎంత నిజాయితీగా ఉండేవారో అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా పని చేయకుండా.. ఆప్తులను పోగేసుకోవడమే లక్ష్యంగా పని చేసిన మహానుభావుల్లో దామోదరం సంజీవయ్య ఒకరు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆయన మనవడిని ఇంటర్వ్యూ చేయగా.. ఆయన ఎల్ అండ్ టీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని వెల్లడించారు. సీనియారిటీని బట్టి సూపర్వైజర్ క్యాడర్ వస్తుందని.. కాంట్రాక్ట్ ఉద్యోగం అని అన్నారు. నిజాయితీగా ఒక పూట తిన్నా చాలని.. ఈ ఉద్యోగం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నారు. తన తండ్రి రిటైర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో పని చేశారని.. అయితే తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తమ ఇంటి పెద్దలకు చెడ్డ పేరు తెస్తానేమో అన్న భయంగా ఉందని అన్నారు.
ఎన్నికల సమయంలో అందరూ వస్తారని.. కానీ ఎవరూ సహాయం చేయరని అన్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా వచ్చారని అన్నారు. ఎన్నికల సమయంలో కొందరు ఓటుకు డబ్బులు ఇచ్చారని.. కానీ ఆ డబ్బులను వెనక్కి ఇచ్చేశారని శ్రీధర్ గాంధీ సతీమణి వెల్లడించారు. ఈమె గతంలో కాంట్రాక్ట్ నర్సుగా పని చేశారు. శ్రీధర్ గాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇంకా ఒక ఏడాది మాత్రమే సర్వీస్ ఉందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన వీడియో వైరల్ అవుతోంది. మరి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఏపీ మాజీ సీఎం మనవడు శ్రీధర్ గాంధీ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేమిటి? అవకాశం ఉండి కూడా రాజకీయాల్లోకి రాకుండా.. దామోదరం సంజీవయ్య పేరు వాడుకోకుండా పేదరికమే ఆస్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతున్న శ్రీధర్ గాంధీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
COMMENTS