SSY: Do you know the withdrawal rules of Sukanya Samriddhi Yojana?
SSY: సుకన్య సమృద్ధి యోజన ఉపసంహరణ నియమాలు ఏంటో తెలుసా?
అమ్మాయిలు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, చదువు, వివాహం మొదలగు కార్యక్రమాలకు అయ్యే ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో 10 ఏళ్లలోపు బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం 2014లో సుకన్య సమృద్ధి యోజన స్కీమును ప్రారంభించింది.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి 7.60% వడ్డీ రేటును ఇస్తోంది. పోస్టాఫీసులో ఏ ఇతర స్కీమ్ కన్నా కూడా దీనిలోనే ఎక్కువ వడ్డీ ఆర్జించవచ్చు. దీనిలో ఒక ఆర్థిక సంవత్సర కనీస డిపాజిట్ రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఖాతా దీర్ఘకాలం కొనసాగుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధి కలిగి ఉంటుంది. డిపాజిట్లయితే 15 ఏళ్లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఖాతాలో డిపాజిట్లు చేయకపోయినా మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది.
అమ్మాయి, ఖాతా మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నిధిని, వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. ఈ మొత్తం ఉపసంహరణకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు.
18 ఏళ్లు నిండిన తర్వాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించి తన ఖాతాను సొంతంగా నిర్వహించుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించుకుని ఖాతాను మూసివేయొచ్చు.
లేదా ఖాతాలో ఉన్న సొమ్మును పాక్షికంగా కూడా ఉపసంహరించుకుని ఖాతాను కొనసాగించవచ్చు. ఉపసంహరణ ఫారంను పూర్తిచేసి, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖాతా నుంచి పాక్షికంగా, పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. అవేంటో చూద్దాం.
విద్య:
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినా లేదా 10వ తరగతి విద్యను పూర్తి చేసినా..విద్యా ప్రయోజనాల కోసం నగదు అవసరాలకై ఈ ఖాతా నుంచి ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం, కళాశాల/యూనివర్సిటీ విద్యా ప్రవేశానికి సంబంధించిన సరైన పత్రాలు (ధ్రువీకరించబడిన ప్రవేశ ఆఫర్, ఫీజు వివరాల కాపీలను) సమర్పించాలి. మునుపటి సంవత్సరం ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తంలో 50% మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
వివాహం:
ఖాతాదారైన అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత, పెళ్లికి సంబంధించి..వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన 3 నెలల తర్వాత ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివాహానికి సంబంధించిన రుజువు తప్పనిసరిగా సమర్పించాలి.
మరణం:
ఖాతాదారైన అమ్మాయి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఖాతాకు సంబంధించిన హక్కు ఖాతా ప్రారంభించిన వ్యక్తికి లభిస్తుంది. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత డిపాజిట్ నిల్వ మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు.
పౌరసత్వం:
ఖాతాను ప్రారంభించినప్పుడు అమ్మాయికి భారత పౌరసత్వం ఉన్నప్పటికీ..తర్వాత డిపాజిట్ కాలవ్యవధిలో పౌరసత్వం కోల్పోతే ఖాతా క్లోజ్ చేస్తారు. ఈ వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయాలి.
సంరక్షకుల మరణం:
ఖాతాను ప్రారంభించిన తల్లిదండ్రులు/సంరక్షకుడు మరణించిన సందర్భంలో ఖాతాదారైన అమ్మాయికి ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసేయొచ్చు. అయితే, ఇలాంటి ఉపసంహరణకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఆమోదం తప్పనిసరి.
అత్యవసర పరిస్థితులు:
అమ్మాయికి ప్రాణాంతక వ్యాధి లేదా ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో..వీటికి సంబంధించిన పత్రాలు సమర్పిస్తే మొత్తం డిపాజిట్, వడ్డీతో సహా ఉపసంహరించుకుని ఖాతా మూసివేయడానికి అనుమతి ఉంటుంది.
COMMENTS