LIC SARAL PENSION YOJANA - pension plan: Pension for 40 years with one investment.. Full details of LIC plan
LIC SARAL PENSION YOJANA - pension plan: ఒకసారి పెట్టుబడితో 40 ఏళ్లకే పెన్షన్.. ఎల్‌ఐసీ ప్లాన్ పూర్తి వివరాలివే.
ఒకసారి పెట్టుబడితో జీవితాంతం పింఛను పొందే వీలు కల్పిస్తోంది భారతీయ జీవిత బీమా సంస్థ (LIC). సరళ్ పెన్షన్ యోజన పేరిట పథకాన్ని అందిస్తోంది.
ఇందులో పెట్టుబడి పెట్టిన వారు 40 ఏళ్లకే పెన్షన్ పొందే వీలుంది. కనీస పింఛన్ నెలకు రూ.1000 చొప్పున పొందే అవకాశం ఉంది. గరిష్ఠ పరిమితంటూ ఏదీ లేదు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇవీ..
ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ పథకం అనేది ఇమ్మీడియట్ యాన్యుటీ విభాగంలోకి వస్తుంది. ఈ పథకాన్ని కొనుగోలు చేసినప్పుడే ఎంత పింఛను వస్తుందనేది తెలిసిపోతుంది. ఈ పాలసీ కింద రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆప్షన్-1లో భాగంగా జీవితాంతం పాలసీదారుడు పింఛన్ పొందొచ్చు. అతడి తదనంతరం పూర్తి మొత్తం నామినీలకు అందుతుంది. ఆప్షన్-2లో ఉమ్మడిగా తీసుకునే జాయింట్ లైఫ్ ఆప్షన్‌లో పాలసీదారుడి తర్వాత.. జీవిత భాగస్వామికి పింఛను అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత వారి వారసులకు ఆ పెట్టుబడి మొత్తం అందుతుంది. ఒకసారి ఈ పథకాన్ని తీసుకున్న తర్వాత ఆప్షన్లను మార్చడం కుదరదు.
40 ఏళ్లు దాటితే చాలు..
40 ఏళ్లు పూర్తయిన వారు ఈ పెన్షన్ పథకాన్ని ఎంచుకోవచ్చు. అలాగే 80 ఏళ్లలోపు వారు ఈ పాలసీలో చేరేందుకు అర్హులు. నెలకు కనీసం రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12,000 వరకూ కనీస పింఛను వచ్చేలా యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు దీనికి ఎలాంటి పరిమితీ లేదు. ఉదాహరణకు గోపీనాథ్‌కు 60 ఏళ్లు అనుకుందాం. పెన్షన్ పథకంలో భాగంగా ఆప్షన్-1 ఎంపిక చేసుకుని రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.58,950 పెన్షన్ అందుతుంది. అదే 55 ఏళ్ల భార్య మంజులతో కలిసి ఆప్షన్-2 ఎంచుకుంటే ఏడాదికి రూ.58,250 చొప్పున పెన్షన్ అందుతుంది. మొదటి ఆప్షన్‌లో జీవితాంతం పింఛను పొందిన పాలసీదారుడి తదనంతరం పూర్తి మొత్తం నామినీలకు అందుతుంది. అదే ఆప్షన్-2లో పాలసీదారుడు మరణిస్తే అతడి భార్యకు.. ఆమె తదనంతరం వారసులకు పెట్టుబడి మొత్తం చేరుతుంది.
మధ్యలో వైదొలగొచ్చా..?
ఈ పథకంలో చేరిన వారు మధ్యలో వైదొలిగే వీలూ ఉంది. యాన్యుటీ తీసుకున్న ఆరు నెలల నుంచి పాలసీదారుడు లేదా అతడిపై ఆధారపడిన వారు తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు.. దీన్ని స్వాధీనం చేయొచ్చు. దీనికి కొన్ని నిబంధనల మేరకు అంగీకరిస్తారు. అలాగే, ఈ పథకంలో ఆరు నెలల తర్వాత కొంత రుణం తీసుకునే వీలుంది. ఆన్‌లైన్‌లో ఈ యాన్యుటీని కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాన్నీ ఎల్‌ఐసీ ప్రకటించింది.
COMMENTS