AP SSC Spot Valuation 2023: Evaluation of 10th class answer sheets from April 19.. This time they have a chance to get more marks!
AP SSC Spot Valuation 2023: ఏప్రిల్ 19 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం.. ఈసారి వారికి ఎక్కువ మార్కులొచ్చే ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 జవాబు పత్రాలు మాత్రమే మూల్యాంకనం చేయాలని, చీఫ్ ఎగ్జామినర్లు 60 జవాబు పత్రాల్లో కనీసం 20 తనిఖీలు చేయాలని సూచించారు. మార్కులను స్పెషల్ అసిస్టెంట్లు లెక్కించాలి.. చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, క్యాంప్ ఆఫీసర్ వాటిని పరిశీలించాలన్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో మార్పులుంటే మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు ముగిసిన మరుసటి రోజునుంచే అటే ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
COMMENTS