Air India Jobs: Good news for Air India, green signal for recruitment of more than 1000 pilots.
Air India Jobs: గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా, 1000కి పైగా పైలెట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్..
విమాన పైలెట్లుగా కెరీర్ ను ప్రారంభించాలనుకుంటున్న వారికి శుభవార్త. టాటా గ్రూప్ నిర్వహిస్తున్న విమానయాన సంస్థ ఎయిరిండియా భారీగా పైలెట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఎయిరిండియా తన విమానాల సంఖ్యను, నెట్ వర్క్ ను భారీగా విస్తరించాలని భావిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో పైలెట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కెప్టెన్లు, ట్రైనర్లను కలుపుకొని మొత్తం 1000కి పైగా పైలెట్లను నియమించుకోనున్నట్లు వివరించింది. దీనికి సంబంధించిన ప్రకటనను గురువారం ఎయిరిండియా ప్రకటించింది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
విస్తరణ ప్రణాళికలో భాగంగా..
వాస్తవానికి ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీనిని గతేడాది టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. దీనిని లాభాల్లోకి తెచ్చేందుకు టాటా గ్రూప్ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా తన నెట్ వర్క్ ను విస్తరించాలని ప్రణాళిక చేసింది. ఈమేరకు ఇటీవల పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఎయిర్ బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరికొన్నేళ్లలో ఈ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పైలెట్ల నియామకానికి ఎయిరిండియా సిద్ధమైంది. భవిష్యత్తులో 500 విమానాలు అందుబాటులోకి రానున్నాయని, ఏ320, బీ777, బీ787, బీ737 విమానాల కోసం కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్లు నియమించుకోనున్నట్లు ఎయిరిండియా తన ప్రకటనలో పేర్కొంది.
పైలెట్ల నుంచి ఎదురుగాలి..
ఎయిరిండియా నుంచి భారీ ఉద్యోగ ప్రకటన వచ్చిన ఈ సమయంలోనే ప్రస్తుతం ఎయిరిండియాలో పైలెట్లుగా పనిచేస్తున్న వారి నుంచి సంస్థకు ఎదురుగాలి వీచింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 1,800 మంది పైలెట్లు పనిచేస్తున్నారు. అయితే పైలెట్లకు సంబంధించి వేతన విధానాన్ని, సర్వీస్ కండీషన్లను మారుస్తూ ఇటీవల ఎయిరిండియా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైలెట్లతో పాటు కేబిన్ సిబ్బందికి సంబంధించి వేతన విధానంలో ఏప్రిల్ 17న ఎయిరిండియా మార్పులు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్(ఐసీపీఏ), ఇండియన్ పైలెట్స్ గిల్డ్(ఐపీజీ) సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
COMMENTS