Science lessons with games 2023
ఆటపాటలతో సైన్సు పాఠాలు
పిల్లలకు కష్టమైన సబ్జెకులు ఏవీ? అంటే ముందు చెప్పేది లెక్కలు. ఆ తర్వాత సైన్సు అంటారు. టీచర్లు ఓర్పు వహించి అర్థమయ్యే రీతిలో చెబితే పిల్లలకు గుర్తుండిపోతాయి. సైన్సు టీచర్ మైథిలి అదే చేస్తున్నారు. తాను చెబుతున్న సైన్సు పాఠాలను ప్రయోగాత్మకంగానే కాదు, కథలుగా, సినిమా పాటలు, సంగీతం జోడించి రకరకాల వినూత్న రీతిలో బోధిస్తారు. తన విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారుచేయాలన్న పట్టుదలే ఆమెను సృజనాత్మకంగా ఆలోచింపజేస్తోంది.
తమిళనాడులో పుదుక్కోట్టైకు చెందిన మైథిలి ఎమ్మెస్సీ, ఎంఇడి, ఎంఫిల్ చేశారు. ఆమెకు సైన్సు, విజ్ఞానంతో కూడిన అంశాలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్సీ కెమిస్ట్రీ కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. తొలుత తొమ్మిదేళ్ల క్రితం కమ్మంగాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఆమె పాఠశాలకు వెళ్లడం మొదలు పెట్టిన తర్వాత నుంచి ఆ గదుల రూపురేఖలు మారాయి. సైన్సు ప్రయోగ బొమ్మలు, పరికరాలతో ఆ గది ఆకర్షణీయంగా మారింది. సంక్లిష్టమైన పాఠాలను సినిమా పాటలను, సంగీతాన్ని జోడించి చెప్పటం మొదలు పెట్టారు. ఘన పదార్థాలు, వాయువులు, ద్రవాలు, సంక్లిష్టమైన శాస్త్రీయ సిద్ధాంతాలు వాటికి తగిన విధంగా సంగీతం వినిపిస్తున్నారు. లయబద్ధమైన పాటలను పాడే సంగీత తరగతిలాగా ఆమె క్లాస్ ధ్వనిస్తుంది. పిల్లల్లో ఈ మార్పుకు ఆమె రెండేళ్లు కష్టపడ్డారు. ఎంతో సహనంతో పాఠాలను బోధించారు. తక్కువ సమయంలోనే ఆమెకు పిల్లలు దగ్గరయ్యారు. సైన్సు విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు.
తరగతిలో వెనకబడిన పిల్లల పట్ల మైథిలి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అర్థంకాని అంశాలను వారికి వివరంగా అర్థం అయ్యేంత వరకూ చెబుతారు. పరికరాలను తీసుకొచ్చి అందరి చేత చేయించేవారు. వారిని పాఠ్యాంశంలో నిమగం చేయడానికి ముందు రోజే తాను బోధించే పాఠాన్ని చదువుకొని రమ్మని చెప్పేవారు. దాంతో విద్యార్థులకు ఆ పాఠం పట్ల కొంత అవగాహన వస్తుంది. ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడింది. ఇచ్చిన హోంవర్క్ చేసుకురావడం, టైంకు స్కూలుకు రావడం చేసేవారు.
సృజనాత్మకంగా పిల్లలు
ప్రపంచం మొత్తం సైన్సుతో నడుస్తుందని నమ్మిన మైథిలీ పాఠాలు బోధించడంలోనూ వినూత్న పద్ధతులు అనుసరిస్తారు. పిల్లలూ సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తారు. ఆమె ఆధ్వర్యంలో పిల్లలు ఎన్నో ప్రాజెక్టులు చేశారు. పరికరాలూ తయారుచేశారు. అది చూసి ఆమె విద్యార్థులను సైన్సు పోటీలకు సన్నద్ధం చేశారు. కదిలే సోలార్ ప్యానెల్, ప్లాస్టిక్‌లను ఉపయోగించే బ్లూటూత్ స్పీకర్, హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్, సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి, పేపర్ రీసైక్లింగ్ మెషీన్‌తో సహా అనేక ప్రాజెక్టులను చేశారు. 2018లో ఇలాంటి ప్రాజెక్టులు రూపొందించి, ఎనిమిది మంది విద్యార్థులు బహుమతులు పొందారు. అప్పటి నుంచి మైథిలికీ ఇన్స్పైర్ అవార్డులు ప్రతి సంవత్సరమూ వస్తున్నాయి.
పిల్లలు ఉత్సాహపడేలా తానూ కొత్త ప్రాజెక్టులు చేశారు. ఇయర్‌బడ్స్‌తో అస్థిపంజరం మోడల్, అయస్కాంతం, ఇనుముతో జీర్ణక్రియ వ్యవస్థ, సౌర వ్యవస్థను ఒకచోట చేర్చే మెర్జ్ క్యూబ్ వంటి అనేక ప్రాజెక్టులను రూపొందించారు. దాంతో ఇన్నోవేటివ్ టీచర్ అవార్డును తమిళనాడు ప్రభుత్వం అందించి అభినందించింది. ఆ తర్వాత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం అవార్డు (డ్రీమ్ టీచర్), ఇన్నోవేటివ్ ఉమెన్ అచీవర్, బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డులను 2021లో అందుకుంది
లాక్డౌన్ సమయంలోనూ ...
కరోనా వైరస్ వచ్చి ప్రతిఒక్కరూ ఇళ్లకు పరిమితి అయిన రోజుల్లోనూ మైథిలి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలను బోధించారు. పిల్లలు నిరుత్సాహపడకుండా సైన్సు ప్రయోగాల వైపు మళ్లించారు ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి, దుకాణాలకు వెళ్లి తన సొంత ఖర్చుతో గుడ్డ సంచులను అందించారు. ఆమె ఇచ్చిన శిక్షణతో విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష రాసి, స్కాలర్షిప్ను పొందుతున్నారు. 2020 డిసెంబర్లో ఆన్లైన్లో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో ఈ అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు, తోటి టీచర్లు మైథిలీని అభినందిస్తున్నారు. 'రామన్ ఎఫెక్ట్‌ని కనుగొన్నందుకు గుర్తుగా ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. నా విద్యార్థులు ఆ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నా' అంటారు మైథిలీ టీచర్.
'నేను చేసిన ప్రాజెక్టు వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యాను. దానికి కారణం మా మైథిలీ టీచర్. పి. బాలమురుగన్, 8వ తరగతి, కమ్మంగాడు పాఠశాల.
మైథిలీ టీచర్ మొదట పాఠానికి సంబంధించిన ఓ కథను చెబుతుంది. ఆ తర్వాత అసలు విషయానికి వెళుతుంది. ఆమె పాటలూ పాడుతుంది. ఆ పాటల వల్ల ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. అలా మా ఆసక్తిని సైన్స్ వైపు మళ్లించింది. అదే మా అందరినీ సైన్స్ పోటీల్లో పాల్గొనే చేస్తోంది. అభినయ, విద్యార్థి
COMMENTS