Medico Preethi: మెడికో ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ విచారం.. మృతురాలి కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వోద్యోగం
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ‘ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఃఖంలో ఆ కుటుంబం ఉంది. మెడికో స్టూడెంట్ మృతి పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ప్రీతి ఆత్మశాంతించాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా’ అని ఎర్రబెల్లి తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ‘ మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని సంతాపం తెలియజేశారు.
మంత్రుల సంతాపం..
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని .. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని, వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాద కలిగిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రీతి మరణం పట్ల నివాళులు అర్పించిన మంత్రి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
COMMENTS