WHERE IS THE BIGGEST GANESH STATUE?
ప్రపంచంలోనే అతి పెద్ద వినాయక విగ్రహం ఎక్కడ?
ఇళ్లల్లో, వీధుల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి కదా! మరి ఆ విగ్రహాలన్నింటిలో ప్రపంచంలోనే అతి పెద్దది ఎక్కడుందో తెలుసా! ముంబయిలోని కొల్హాపూర్‌లో. దాని పేరు 'చిన్మయా గణాధిష్ విగ్రహం' 66 అడుగుల ఎత్తున్న ఈ వినాయకుణ్ని 24 అడుగుల ఎత్తున్న గద్దెపై కూర్చోపెట్టారు. కాంక్రీటుతో కట్టిన దీని బరువు 800 మెట్రిక్ టన్నులు. దీనిని కట్టడానికి 50 మంది పనివాళ్లకి 18 నెలలు పట్టింది. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎవరు కట్టించారో తెలుసా? చిన్మయా మిషన్‌వాళ్లు. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని 2001లో కట్టించారు.
* మన రాష్ట్రానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి వినాయకుని 11,000 విగ్రహాల్ని, 14,000 చిత్రపటాల్ని, 1094 పోస్టర్లని, 157 కీచైన్‌లని, వంద ఆడియో, వీడియో కేసేట్లని సేకరించి లిమ్కాబుక్‌లోకి ఎక్కారు.
* మారిషస్ దేశ ప్రభుత్వం ఈ పండుగను జాతీయ సెలవుదినంగా ప్రకటించింది. అక్కడ ఎక్కువశాతం ఉండేది హిందువులే.
* పారిస్‌లో వినాయక చవితి రోజు వినాయకుని గుడి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కడుగుతారు. వినాయకుడు నడిచేందుకన్న మాట.
కొల్హాపూర్‌లోనే మరో ప్రసిద్దమైన వినాయక ఆలయం ఉంది. దాని పేరు బికాంబి గణేశ్ మందిర్. ఆ ఆలయాన్ని స్తంభాల్లేకుండా 1882లో నిర్మించారు. ఓసారి ఆ ప్రాంతంలో నుయ్యిని పూడిక తీస్తుంటే చిన్న రాతి వినాయక విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం చుట్టే ఈ గుడిని కట్టారు. ఈ ఆలయం కట్టిన తీరు ఎంతో అద్బుతంగా ఉంటుంది. అందుకే దీనిపై పరిశోధనలు చేయడానికి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి పురాతత్వ శాస్త్ర విద్యార్థులు ఇక్కడికి వస్తారు.
వీధుల్లో వినాయకుణ్ని పెట్టి పూజలు చేసే విధానం ఎవరి వల్ల మొదలైందో తెలుసా? బాలగంగాధర తిలక్. ఆయనే మొదట 1893లో వినాయక పటాల్ని వీధుల్లో పెట్టి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది.
ముంబయిలోని లాల్‌బాగ్ ప్రాంతంలో ఉన్న వినాయకుడి గుడికి, విగ్రహానికి బీమా చేయించారు. ఎంతో తెలుసా? సుమారు రెండుకోట్ల 65 లక్షలకి ఒకటి, కోటి రూపాయలకి మరోటి. ఈ గుడికి ఏటా కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.
వినాయక విగ్రహాల్ని మట్టితో తయారుచేసినవి వాడితేనే మంచిది. కాని మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసినవి వాడుతున్నాం. ఈ కృత్రిమ పదార్థం ఎంత ప్రమాదకరమైందో తెలుసా?. దీనిని జిప్సమ్ నుంచి ఉత్పత్తి చేసిన కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్‌తో తయారు చేస్తారు. విగ్రహాల్ని చెరువులో కలిపేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంత తొందరగా నీటిలో కరగదు. అంతేకాదు మెల్లగా కరిగేటప్పుడు విషపూరితమైన పదార్థాల్ని కూడా విడుదల చేస్తుంది. రంగుల్లో ఉండే రసాయనాలు పాదరసం, కాడ్మియం వంటివి నీటిలో కలిసి చేపలు, ఇతర జీవులు చనిపోతాయి. దీని వలన జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది.
COMMENTS