WHAT ABOUT SALT HOTEL?
ఉప్పు హోటలు సంగతేమిటి ?
అదొక హోటల్... 12 పడక గదులున్నాయి... మంచాలు, కుర్చీలు ఉన్నాయి... ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇవన్నీ ఉప్పుతో కట్టినవే!
ఆ హోటల్‌లో మీరు తింటున్న పదార్థంలో ఉప్పు తక్కువైందనుకోండి. గోడను కాస్త గీరి కలుపుకుని తినేయచ్చు. ఎందుకంటే ఆ హోటల్ మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు మరి! ప్రపంచంలో ఉప్పు దిమ్మలతో కట్టిన హోటల్ ఇదొక్కటే! అయితే ఇందాకా చెప్పినట్టు గోడలు గీకడాలు చేయకూడదు. ఈ హోటల్‌లోకి ఎవరైనా వెళ్లవచ్చు కానీ, ఒకటే షరతు! అదేంటో తెలుసా? 'ఇచ్చట గోడలు నాకరాదు!' అని ముందే చెబుతారు.
బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ 'లవణ మందిరం' ఉంది. విశాలమైన 12 గదులు, మంచాలు, కుర్చీలు, ఇతర వస్తుసామగ్రి మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు. దీని పేరు 'పాలాసియో డి సాల్'. అంటే స్పానిష్ భాషలో ఉప్పు ప్యాలెస్ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు ఘనాలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్ బయట గోల్ఫ్ కోర్స్ కూడా ఉప్పు మయమే.
అసలు దీన్నెందుకు కట్టారంటే ఆ ప్రాంతం గురించి చెప్పుకోవాలి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉండే అక్కడి ప్రదేశమంతా ఎటుచూసినా ఉప్పే. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉప్పు క్షేత్రం. దీని మొత్తం విస్తీర్ణం 10,582 చదరపు కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నగరానికి 20 రెట్లు పెద్దదన్నమాట! కనుచూపుమేర ఎటుచూసినా అంతులేని ఉప్పు మేటలతో, ఉప్పు ఎడారిలా ఉంటుంది. దీన్ని చూడ్డానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వాళ్ల వసతి కోసమే ఈ ఉప్పు హోటల్‌ను కట్టారు.
దీన్ని నిజానికి 1993లోనే కట్టినా రెండేళ్లలోనే మూసివేశారు. తిరిగి 2007లో సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు గోడల్ని నాకకుండా సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు.
COMMENTS