STRONG PASSPORT 2023
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఇదే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..
పాస్ పోర్ట్.. ఒక ఐడెంటిటీ.. మీరు ఏ దేశానికి చెందిన వారో తెలియజెప్పే గుర్తింపు. దీని ఆధారంగానే మీరు ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లడానికి అనుమతులు పొందుతారు. ప్రతి దేశంలోని పౌరులకు వారి దేశాల్లో పాస్ పోర్టు ఉంటుంది. దేశం సరిహద్దు దాటి వేరే దేశానికి వెళ్లాలి అంటే తప్పనిసరిగా పాస్ పోర్టు చూపించాల్సిందే. దీనిని చూపితే ఆ దేశం వీసాను మంజూరు చేస్తుంది. అంటే పాస్ పోర్టు మన దేశం నుంచి వచ్చే గుర్తింపు అయితే.. దీని ద్వారా వచ్చే వీసా మీరు వెళ్లాలనుకుంటున్న దేశం వారు మీకు ఇచ్చే అనుమతి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఈ రెండింటిపై కొంత అవగాహన అవసరం. అయితే కొన్ని దేశాల పాస్ పోర్టులు చాలా శక్తివంతంగా ఉంటాయి. అంటే వారి పాస్ పోర్టుతోనే వేరే దేశంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. వారికి ఎటువంటి వీసాతో పని ఉండదు. అటువంటి శక్తివంతమైన పాస్ పోర్టు కలిగిన దేశాలు ఏవి? ఆ జాబితాలో మన భారతదేశం ఎక్కడ ఉందో ఓ సారి చూద్దాం..
హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్..
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా లండన్‌కు చెందిన గ్లోబల్ పౌరసత్వం, నివాస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ 2023 సంవత్సరానికి గానూ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. దీనిలో ప్రపంచంలోని అన్ని దేశాల పాస్ పోర్టులు పరిధులను బట్టి స్కోర్ ఇచ్చింది. ఆ పాస్ పోర్టుతో వేరే దేశాల్లో వీసా రహిత ప్రయాణాలను బట్టి ర్యాంకింగ్ కూడా ఇచ్చింది.
టాప్ ప్లేస్ లో జపాన్..
ఈ హెన్లీ పాస్‌పోర్ట్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ పౌరులు ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ ద్వారా గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు. ఈ జాబితాలో రెండో స్థానాన్ని సింగపూర్ , దక్షిణ కొరియా పంచుకున్నాయి. ఈ రెండింటికీ 192 దేశాల్లో వీసా-రహిత యాక్సెస్ అమలవుతోంది. ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు వీసా రహిత జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాయి.
మన దేశం ఎక్కడ..
ఈ నివేదికలో మన దేశం పరిస్థతి గురించి వెతికితే.. భారతీయ పాస్‌పోర్ట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో 85వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 59 గమ్యస్థానాలకు వీసా-రహిత ప్రవేశాన్ని మన పాస్ పోర్టు పొందుతుంది. అంతకుముందు 2019, 2020, 2021, 2022లో మన దేశం వరుసగా 82వ స్థానంలో, 84వ, 85వ, 83వ స్థానాల్లో నిలిచింది.
మనం ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు..
భారత పాస్‌పోర్ట్ హోల్డర్‌లు భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, మకావో, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్, కెన్యా, మారిషస్, సీషెల్స్, జింబాబ్వే, ఉగాండా, ఇరాన్, ఖతార్ వంటి 59 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీటిల్లో కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ అందిస్తాయి.
అట్టడుగున ఆఫ్ఘనిస్తాన్..
శక్తివంతమైన పాస్ పోర్టు గురించి చూశాం కాదా మరీ ఈ జాబితాలో అట్టడుగున నిలిచిన దేశం ఏదో తెలుసా? అంటే అత్యంత బలహీనమైన పాస్ పోర్టు కలిగి ఉన్న దేశం ఆప్ఘనిస్తాన్ ఇది 109వ స్థానంలో ఉంది. దానికన్నా ముందు స్థానంలో 108లో ఇరాక్ పాస్ పోర్టు ఉంది. అలాగే సిరియా 107, పాకిస్తాన్ 106, యెమెన్ 105 స్థానాల్లో ఉన్నాయి.
COMMENTS