SMART HELMET 2023
స్మార్ట్ హెల్మెట్.. ‘పది’ అమ్మాయి రూపొందించిన సాధనం ప్రయోజనం సూపర్
Smart Helmet: పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి రూపొదించిన స్మార్ట్ హెల్మెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు.. ఆ సమాచారాన్ని, లోకేషన్‌కు మన వారికి చేరవేసేలా ఇందులో ఏర్పాటు ఉంది. మనల్ని ఎవరైనా వెంబడిస్తున్న గుర్తించి అత్యవసర నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిధిమా ఠాకూర్ రూపొందించిన ఈ హెల్మెట్.. బైకర్లకు ఎంతో ప్రయోజనకరం.
ఈ స్మార్ట్ హెల్మెట్ ప్రత్యేకతలు ఏంటి? దర ఎంత?
పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని రూపొందించిన హెల్మెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిధిమా ఠాకూర్ అనే అమ్మాయి స్మార్ట్ హెల్మెట్‌ను రూపొందించింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రదర్శనకు ఉంచింది. ఈ హెల్మెట్ ప్రయోజనం గురించి తెలుసుకొని ఆ విద్యార్థినిని అభినందిస్తున్నారు. హెల్మెట్‌ను ధరించడం మర్చిపోయినా, సరిగ్గా పెట్టుకోకపోయినా.. ఇది బీప్ శబ్దంతో అప్రమత్తం చేస్తుంది. ఇక బైక్‌పై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆ సమాచారాన్ని లొకేషన్‌తో పాటు కుటుంబ సభ్యులకు చేరవేసేలా ఆ స్మార్ట్ హెల్మెట్‌లో సాంకేతికత ఉంది.
ఈ హెల్మెట్‌లో కెమెరా, లొకేషన్ ట్రాకర్, సెన్సార్లు, ట్రాన్స్‌మీటర్, రిసీవర్ వ్యవస్థలు, జీఎస్ఎం సిమ్‌ను అమర్చుకునే ఏర్పాటు ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కిందపడితే, లేదా దేన్నైనా ఢీకొంటే.. ఈ హెల్మెట్‌లోని ప్రెజర్ ప్లేట్ టెక్నిక్ వ్యవస్థ ద్వారా.. ముందే సేవ్ చేసి పెట్టిన ఫోన్ నంబర్లకు కాల్ లేదా మెసేజ్ వెళ్తుంది.
బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా అనుమానితులు మనల్ని వెంబడిస్తున్నా, మరేదైనా ప్రమాదం పొంచి ఉన్నా, ఈ హెల్మెట్‌లోని ఒక బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా అత్యవసర నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయొచ్చు. ఇందులోని కెమెరా సీసీటీవీలా పనిచేయడం విశేషం. ఇన్ని ఫీచర్లతో ఈ హెల్మెట్‌ను తయారు చేయడానికి ఎంత ఖర్చయ్యిందనేగా మీ ప్రశ్న..! రూ.8,000 ఖర్చు చేసి ఈ హెల్మెట్‌ను తయారు చేసినట్లు రిధిమా తెలిపింది.
COMMENTS