FLYING SNAKES SECRET WHAT?
ఎగిరే పాముల రహస్యమేమిటి ?
పాములు పాకుతాయని తెలుసు... కానీ ఎగురుతాయా? అలాంటివి ఉన్నాయి! వాటిపై పరిశోధన జరిగింది... రహస్యమేంటో బయటపడింది!!
మీకు గ్త్లెడింగ్ అంటే తెలుసుగా? పెద్ద పెద్ద రెక్కల్లాంటి అమరిక ఉండే గ్త్లెడర్‌ని తీసుకుని ఏ కొండ మీదకో వెళ్లి దాంతో సహా దూకేసి చాలా దూరం ఎగురుతూ వెళ్లే సాహసక్రీడ అది. అచ్చం అలాగే గాలిలో ఎగిరే పాములు ఉన్నాయని మీకు తెలుసా? వాటినే ఫ్లయింగ్ స్నేక్స్ అంటారు. వీటిలో అయిదు జాతులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపించే ఇవి ఎలా ఎగరగలుగుతున్నాయనేది ఇంతవరకూ ఓ వింతే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, వాటి రహస్యమేంటో కనిపెట్టారు.
గ్త్లెడింగ్ చేసే క్రీడాకారుల్లాగే ఎగిరే పాములు కూడా ఎత్తయిన ఏ చెట్టు మీదకో ఎక్కి, అక్కడి నుంచి చటుక్కున దూకేసి గాలిలో బ్యాలన్స్ చేసుకుంటూ కిందికి సురక్షితంగా చేరుకోగలవు. వేటాడ్డానికి, శత్రువు నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తాయి. ఇవి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసి దాదాపు 100 మీటర్ల దూరాన్ని కూడా గాలిలో ప్రయాణించగలవు. ఇంత ఎత్తు నుంచి మామూలు పాముని పడేస్తే అది తలకిందులుగా కింద పడి ఎముకలు విరిగిపోవడం ఖాయం. మరైతే ఇది ఎలా ఎగరగలుగుతోంది? గాలిలోకి దూకగానే ఇవి తమ పక్కటెముకలు సాగదీసి గుండ్రని శరీరాన్ని సమతలంగా చేయగలుగుతాయని ఇంతకు ముందే తెలుసు. అయితే మరి కొన్ని పాములకు కూడా ఇలా శరీరాన్ని మార్చుకునే విద్య తెలుసు. అంటే ఎగిరే పాములు దీంతో పాటు మరో రకమైన విన్యాసం కూడా చేస్తున్నాయన్నమాట. మరి అదేంటి? అది తెలుసుకోడానికే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.
అయిదు పాముల్ని తీసుకుని వాటిపై తెల్లటి మెరిసే చుక్కల్ని అమర్చారు. ఆపై వాటిని ఎత్తయిన టవర్‌పై వదిలి అవి అక్కడి నుంచి దూకి కిందకి రావడాన్ని ఒకేసారి నాలుగు కోణాల్లో అత్యాధునిక త్రీడీ వీడియో కెమేరాలతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లోకి ఎక్కించి, మెరిసే చుక్కల్ని బట్టి యానిమేషన్ మోడల్ పాములను సృష్టించి వాటి శరీరం ఎలాటి కదలికలకు లోనైందో గమనించారు.
ఇంతకీ ఏం తెలుసుకున్నారు? ఈ పాములు ఎత్తు నుంచి దూకుతూనే గాలి వీచే దిశని అంచనా వేస్తూ శరీరాన్ని 25 డిగ్రీల కోణంలో తిప్పడం ద్వారా బ్యాలన్స్ చేసుకుంటున్నాయని గమనించారు. గాలిపటాలు, విమానాలు ఎగరడంలో కింద నుంచి పైకి వీచే గాలి శక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్నే 'లిఫ్ట్' అంటారు. ఈ పాములు కూడా ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాయని తేలింది. తలని, తోకను వ్యతిరేక దిశల్లో చకచకా కదిలిస్తూ గాలిలోనే ఈదుతున్నట్టుగా ఎగురుతూ మార్గాన్ని కూడా మార్చుకుంటున్నాయని తేల్చారు.
COMMENTS