DO OZONE LAYER EXISTS ON OTHER PLANETS?
భూమికి ఓజోన్ పొర ఉన్నట్లే ఇతర గ్రహాలకూ పొరలు ఉంటాయా?
సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం మనం తినే ఇడ్లీ రూపంలో మొత్తం తేజోవంతంగా ఉండే సౌరపళ్లెం నుంచి గ్రహాలు, సూర్యుడు రూపాంతరం చెందాయి. మధ్యలో భాగం సూర్యుడిగా ప్రకాశవంతమైన కాంతిని ఇస్తుండగా అంచుల్లోంచి విడివడ్డ గ్రహాలు కాలక్రమేణా ప్రకాశాన్ని కోల్పోయి గట్టి గోళాలయ్యాయి. సూర్యుడి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాన్ని బట్టి ఆయా గ్రహాల మీద వాతావరణం ఏర్పడింది. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న బుధ గ్రహం మీద వాతావరణం దాదాపు లేదనే చెప్పాలి. మిగిలిన గ్రహాల మీద వివిధ వాయు ధాతువుల చేత ఆయా గ్రహాల వాతావరణాలు ఉన్నాయి.
భూమ్మీద ఉన్న వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ ప్రధాన పదార్థాలు. ఇందులో నైట్రోజన్ జడ పదార్థం. కానీ ఆక్సిజన్ సౌరకాంతి సమక్షంలో ఓజోన్‌గా మారుతుంది. వాతావరణం పైభాగంలో మాత్రమే ఓజోన్ ఏర్పడుతుంది. ఓజోన్ పొర భూమిని, భూమ్మీద ఉన్న జీవరాశుల్ని అతినీల లోహిత కిరణాల బారి నుంచి రక్షించే గొడుగులా ఉపయోగపడుతుంది. అయితే మిగిలిన గ్రహాలలో దేనిమీద చర్యాశీలత గల వాయువులు లేవు. శుక్రగ్రహం, కుజగ్రహం మీదున్న కార్బన్‌డయాక్సైడు, నైట్రోజన్‌లు కొత్తగా ఏ విధమైన పొరల్ని ఏర్పర్చలేవు.
గురుగ్రహం మీద ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువులున్నాయి. పైగా అక్కడ సౌరకాంతి తీవ్రత తక్కువ కాబట్టి హైడ్రోజన్ వాయువు ఏ విధమైన నూతన రక్షణ పొరను నిర్మించలేదు. ఆ తర్వాత గ్రహాల మీద కూడా హైడ్రోజన్‌తోపాటు జడ వాయువు అయినా హీలియం ఉన్నా పరిస్థితులు నూతన పొరలకు అనువుగా లేవు. యురేనస్, నెప్ట్యూన్ల మీద కొంత మోతాదులో మీథేన్ వాయువు ఉన్నా అక్కడకు చేరే అతి తక్కువ సౌరకాంతి సమక్షంలో ఆ వాయువు ఏవిధమైన రసాయనిక చర్యలో పాల్గొనలేదు. కాబట్టి భూమి మీదున్నట్లుగా ఇతర గ్రహాల మీద ఓజోన్ పొరలు లేవు.
COMMENTS