When is the best time to purchase gold? Is it possible to invest in gold and increase your profits?
Gold గోల్డ్ ఏ టైమ్లో కొంటే బెటర్ ? బంగారంపై పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధ్యమేనా ?
Gold Purchase అలంకరించుకుంటే ఆభరణం. అవసరానికి అప్పు పుట్టించే సాధనం. పెట్టుబడులకు సువర్ణావకాశం బంగారం. పెండ్లి ముచ్చట్లలో సింహభాగం బంగారం చుట్టూనే తిరుగుతాయి. బోషాణంలో ఏడువారాల నగలు ఉన్నా.. కొత్త నగ కంటపడితే, దానినీ కొనేయాలని కోరుకోవడం సహజం. నాలుగు కాసులు వెనుక వేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లయినా అవి బంగారం రూపంలో అయితే మరీ మేలు అని భావిస్తుంటారు.
ఇంతకీ పుత్తడి మీద పెట్టుబడి లాభదాయకమేనా? పసిడిని ఎప్పుడు ఒడిసి పట్టుకోవాలి?
భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే మన దేశంలో సీజన్‌తో సంబంధం లేకుండా పుత్తడి కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. ఆభరణాలుగా, కాయిన్లుగా, బిస్కెట్లుగా ఇలా రకరకాల రూపాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని పెట్టుబడి వనరుగానూ చాలామంది భావిస్తుంటారు. అయితే, ఎప్పుడు కొనాలనే విషయంలో తర్జన భర్జనలు పడుతుంటారు. రకరకాల సూత్రాలు పాటిస్తుంటారు. స్టాక్ మార్కెట్ జోరు మీదున్నప్పుడు పసిడి ధరలు తగ్గుతాయనీ, షేర్ మార్కెట్ బేర్ మంటే పుత్తడి ధరలకు రెక్కలొస్తాయని అంచనాలు వేస్తుంటారు. కానీ, బంగారం ధరలు స్టాక్‌మార్కెట్ హెచ్చుతగ్గుల మీద కాకుండా, బ్యాంక్ వడ్డీ రేట్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని నిపుణుల విశ్లేషణ. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు తగ్గినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. వడ్డీరేట్లు పెరిగినప్పుడు బంగారం కంటే.. ఎఫ్‌డీ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుంటుంది.
భారీ లాభాలు ఉత్తమాటే
బంగారాన్ని చరాస్తిగా పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో నష్టపోకుండా అమ్ముకునే అవకాశం ఉంటుంది. అవసరానికి కుదువ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది! అయితే, భారీ లాభాలు ఆకాంక్షించేవారికి బంగారంపై పెట్టుబడుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. 2012లో తులం బంగారం ధర (10 గ్రాములు) రూ. 31,000గా ఉంది. ఇప్పుడు అది రూ.54,500 వరకు పెరిగింది. అంటే బంగారం ధర పదేండ్లయినా రెండింతలు కాలేదన్నమాటే కదా! గత పదేండ్ల గణాంకాలు పరిశీలిస్తే.. బంగారంపై 6 శాతానికి మించి రాబడి రాలేదు. కాకపోతే, రిస్క్‌లేని పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తారు. అందుకే, ధరలు కాస్త తగ్గాయని వార్తలు గుప్పుమనగానే పుత్తడి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు.
మంచి పెట్టుబడే.
లాభం ఎంత శాతం అనే తర్కం పక్కనపెడితే.. బంగారంపై పెట్టుబడి మంచిదే! అయితే, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్‌తో పోలిస్తే దీర్ఘకాలంలో భారీ లాభాలైతే ఉండవు. కాకపోతే రిస్క్ చాలా తక్కువ. షేర్ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంటుంది. కాకపోతే, లాభాలూ హెచ్చుగానే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువే! బంగారం భద్రతను సమస్యగా భావించేవాళ్లు బాండ్ల రూపంలో కొంటుంటారు. ఇక ఇంట్లో పాతిక తులాల నగలు ఉన్నాయంటే.. ఏ బ్యాంకు లాకర్‌లోనో భద్రపరిచే వరకు నిద్ర పట్టదు. ఏదేమైనా పుత్తడిని కేవలం పెట్టుబడి వనరుగానే పరిగణించొద్దు. స్థితిమంతులైనా, మధ్యతరగతి వాళ్లయినా బంగారాన్ని ఇష్టంగా కొంటారు. సొంతంగా అలంకరించుకోవాలని, కూతురు పెండ్లికని అడపాదడపా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. చిన్నదో, పెద్దదో నగానట్రా చేయిస్తూ ఉంటారు. అయితే బంగారాన్ని ఖరీదైన లోహంగానే చూడాలి తప్ప, దాని మీద వచ్చే లాభాల గురించి ఆలోచించొద్దు. నిగనిగలాడే నగను వేసుకున్నప్పుడు కలిగే సంతోషం ఎంత పెట్టుబడి పెట్టినా రాదు కదా! అంటే బంగారం కొనొద్దు అనుకోకండి. ఒకేసారి లక్షలు వెచ్చించొద్దు. కూతురు ప్రతి పుట్టిన రోజుకు తులమో, అరతులమో కొనండి. ఆమె పెండ్లినాటికి పదిహేను నుంచి ఇరవై తులాల బంగారం సిద్ధంగా ఉంటుంది. పెండ్లి సమయంలో పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి రాదు. శక్తి ఉంటే, అప్పటి వరకు దాచిన బంగారానికి మరింత జోడించి పెండ్లి కూతురును 'కనక'మహాలక్ష్మిలా ముస్తాబు చేయొచ్చు. మీరూ అవునంటారు కదా!!
అమెరికాలో పెరిగింది గోరంతే!
2012 ప్రాంతంలో అమెరికాలో ఔన్స్ బంగారం (28.34 గ్రాములు) ధర సుమారు 1,664 డాలర్లు. అప్పుడు మనదేశంలో బంగారం ధర సుమారు రూ.31,000. 2022లో అదే ఔన్స్ బంగారం ధర అమెరికాలో 1752 డాలర్లు మాత్రమే! మన దగ్గరికి వచ్చేసరికి రూ. 54,500గా ఉంది. పదేండ్లలో అక్కడ పెరిగింది వంద డాలర్ల లోపే! ఇక్కడ మాత్రం 75 శాతం వరకు పెరిగింది. బంగారంపై దిగుమతి సుంకం పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగజారిపోవడం మనదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
COMMENTS