Tata Nano EV 2022
మళ్లీ అందుబాటులోకి సామాన్యుల కలల కారు..Tata Nano EV, ఈసారి సరికొత్త స్టైల్‌లో నానో ఫీచర్స్..
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా.. కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో రూ.లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. నానో మార్కెట్లోకి తీసుకువచ్చిన.. దాదాపు 14 ఏళ్ల తర్వాత టాటా కారుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. టాటా కారు నానో మళ్లీ వచ్చేస్తుందని.. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుందని, అదికూడా ఎలక్ట్రిక్ మోడల్స్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాటా కంపెనీ.. ఎలక్ట్రిక్ మోడల్ టాటా నానో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతోపాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళిక చేస్తోంది. టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయిన టాటా నానో, అప్‌డేట్ ఫీచర్లు, డిజైన్ మార్పు మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి.. మార్కెట్ లో 10 రకాల ఫీచర్లతో టాటా నానోలను విడుదల చేయడమే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. 2025 నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని.. టాటా గ్రూస్ సన్నాహాలను ప్రారంబించినట్లు తెలుస్తోంది.
టాటా నానో EV ఫీచర్లు..
72v లిథియం-అయాన్ బ్యాటరీ ఫీచర్లను టాటా నానోలో జోడిస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ద్వారా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉండనుంది. కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని పేర్కొంటున్నారు.
బుకింగ్ – ధర వివరాలు..
ప్రారంభించిన తర్వాత కొత్త టాటా నానో కార్లు బుకింగ్ కోసం అందుబాటులో ఉండనున్నాయి. సరికొత్త టాటా నానో కనీస ధర రూ.2-3 లక్షల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
టాటా నానో కారు 2008లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా నిలిచింది. అయితే, టాటా కార్పొరేషన్ మొదట ఉద్దేశించిన విధంగా సంవత్సరానికి 2,50,000 యూనిట్లను ప్రారంభించాలనుకుంది.. కానీ అనేక కారణాలతో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
COMMENTS