NPS SCHEME RULE CHANGE 2023
నేషనల్ పెన్షన్ స్కీమ్‌దారులకు అలర్ట్.. జనవరి1 నుంచి ఆ నిబంధనలో మార్పు
NPS Scheme: 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా ఎంతో మంది బలి కాగా, చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో లక్షలాది రూపాయలు ఆస్పత్రుల ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఎంతో మంది అప్పుల పాలైయ్యారు కూడా. చాలా మందికి ఆరోగ్య బీమా ప్రయోజనం ఉన్నా.. బీమా సంస్థలు పూర్తి ఆస్పత్రి బిల్లులను చెల్లించడానికి నిరాకరించాయి. కోవిడ్ సమయంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) చందాదారులు అప్పుల పాలు కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎన్పీఎస్ చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఎన్‌పీఎస్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇది ఎన్‌పీఎస్ చందాదారులకు చాలా ఉపశమనాన్ని కల్పించింది. ఎన్‌పీఎస్ చందాదారులు తమ ఖాతా నుంచి పాక్షికంగా నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి డాక్యూమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంలో ఎన్‌పీఎస్ నిబంధనలను మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి పత్రాలు లేకుండా విత్‌డ్రా చేసుకోవడం అనే నిబంధనలను తొలగించింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ.
జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలు..
2023 జనవరి 1 నుంచి ప్రభుత్వ రంగ చందాదారులకు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఎన్‌పీఎస్ నుంచి ఆన్‌లైన్‌లో కొంత విత్‌డ్రా చేసుకునే సదుపాయం నిలిచిపోతుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. కోవిడ్ సంబంధిత కేసులు తగ్గుముఖం పట్టడం, లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రభుత్వ రంగ చందాదారులందరూ వారి అనుబంధ నోడల్ కార్యాలయాల ద్వారా తమ అభ్యర్థనలను సమర్పించడాన్ని తప్పనిసరి చేయాలని డిసెంబర్ 23 నాటి సర్క్యులర్ లో పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. 2021 జనవరిలో ఆన్‌లైన్ ద్వారా పాక్షిక విత్‌డ్రా సౌకర్యాన్ని పెన్షన్ రెగ్యులేటర్ ప్రారంభించింది. చందాదారులు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవటానికి, అలాగే లాక్ డౌన్ సమయంలో నోడల్ అధికారులపై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెన్షన్ రెగ్యులేటర్ తెలిపింది. అయితే, స్వచ్ఛంద ప్రభుత్వేతర రంగ ఎన్‌పీఎస్ సభ్యులకు మాత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కొనసాగుతుందని పీఎఫ్ఆర్డీఏ స్పష్టం చేసింది. అయితే ఎన్‌పీఎస్ సభ్యులు తమ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కొన్ని నిబంధనలు విధించింది.
ఇవి నిబంధనలు..
☛ కనీసం మూడు సంవత్సరాల పాటు ఎన్‌పీఎస్ చందాదారులు అయ్యి ఉండాలి.
☛ మీరు ఉపసంహరించుకోవాలనుకునే మొత్తం మీరు ఇప్పటి వరకు చేసిన కంట్రిబ్యూషన్ లో 25 శాతానికి మించరాదు.
☛ ఎన్‌పీఎస్ సభ్యుడు కాలవ్యవధిలో కేవలం మూడు పాక్షిక ఉపసంహరణలను మాత్రమే అనుమతి
☛ పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహం, ఇంటిని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం, అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్స వంటి కారణాల కోసం మాత్రమే పాక్షిక ఉపసంహరణను అనుమతిస్తారు.
ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం వలన ఎన్‌పీఎస్ 80CCD (1B) కింద రూ. 50,000 అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. మీరు మెచ్యూరిటీలో డిపాజిట్ చేసిన కార్పస్‌లో 60% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం పెన్షన్ లేదా యాన్యుటీ కోసం ఉంచబడుతుంది. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని పీఎఫ్‌ఆర్‌డీఏPFRDA ద్వారా నిర్వహించబడుతుంది. అందుకే ఇందులో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం.
COMMENTS