Loan for a home: Interest rates are rising... to lessen the burden of a mortgage?
వడ్డీరేట్లు పెరుగుతున్నాయ్... గృహ రుణ భారం తగ్గించుకోవాలంటే..?
HomeLoan:వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో గృహరుణాన్ని (Homeloan) తొందరగా తీర్చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కొత్తగా రుణం తీసుకున్న వారు దీర్ఘకాలంపాటు ఈ అప్పు భారాన్ని మోయాల్సి ఉంటుంది. కాబట్టి, వీరు కొన్ని అంశాలపై దృష్టి పెడితే.. తొందరగా రుణ విముక్తులయ్యే అవకాశం ఉంది.
తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు అందరం సంతోషించాం. కానీ, పెరుగుతున్నప్పుడు ఆందోళన చెందుతున్నాం. వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కదులుతూ ఉంటాయి. గృహరుణం 15, 20 ఏళ్ల దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం చూస్తుంటాం. కాబట్టి, ఈ విషయాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దు. వడ్డీ రేటు పెరిగినా.. ఈఎంఐపై దాని ప్రభావం ఉండదు. కాబట్టి, మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం ఉండదు. కేవలం వ్యవధి మాత్రమే పెరుగుతుంది. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.. వ్యవధీ సర్దుబాటవుతుంది.
సమయానికి చెల్లించండి: రుణానికి చెల్లించే ఈఎంఐలు ఎప్పుడూ సకాలంలో చెల్లించేయండి. లేకపోతే ఆలస్యపు రుసుములు వసూలు చేస్తాయి బ్యాంకులు. దీనివల్ల అనవసర భారం పడుతుంది. క్రెడిట్ స్కోరు దెబ్బతినడం వల్ల కొత్త అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు వడ్డీ రేటు మనకు అనుకూలంగా ఉండదు. మూడు నెలలకు సరిపడా ఈఎంఐ ఎప్పుడూ సేవింగ్ బ్యాంకు ఖాతాలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
తక్కువ వడ్డీకి: అధిక వడ్డీ వసూలు చేసే బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే సంస్థకు మారేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కనీసం రేటులో 50 బేసిస్ పాయింట్లయినా తక్కువగా ఉండాలి. అప్పుడే దీర్ఘకాలంలో భారం తక్కువ పడుతుంది. అప్పు తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ఆదాయం పెరగడం, క్రెడిట్ స్కోరు అధికం కావడం తదితర కారణాలతో మీకు మంచి వడ్డీకే రుణం వచ్చే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకుతో ఈ విషయాన్ని చర్చించండి. ఇతర బ్యాంకుకు మారుతున్నట్లు చెప్పండి. అప్పుడు బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది.
ముందుగా చెల్లించండి: వ్యవధి పెరగకుండా చూసుకునేందుకు ఉన్న మార్గం.. వీలైనప్పుడల్లా అసలును చెల్లిస్తూ వెళ్లడం. ఏడాదికోసారి అదనంగా ఒక ఈఎంఐని చెల్లించే ప్రయత్నం చేయొచ్చు. బోనస్‌లు, లేదా అనుకోకుండా వచ్చిన డబ్బును రుణం చెల్లించేందుకు వినియోగించుకోవచ్చు. ఏడాదికి అసలులో కనీసం 5 శాతం చెల్లించినా ఎంతో వడ్డీని ఆదా చేసుకున్నట్లు అవుతుంది. తొందరగా అప్పు నుంచి బయటపడొచ్చు.
ఈఎంఐ పెంచుకుంటే: మీ ఆదాయంలో 30-40 శాతానికి మించి ఈఎంఐ ఉండకూడదు. మీ ఆదాయం పెరిగితే.. దాన్ని బట్టి, ఈఎంఐని పెంచుకునే వీలుందా చూసుకోండి. మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడకుండా చూసుకోవడం ఇక్కడ ప్రథమ సూత్రం. ఈఎంఐ పెంచుకోవడం వల్ల వడ్డీ రేటు పెరిగినప్పుడు తొందరగా అప్పు తీరేందుకు అవకాశం ఉంటుంది.
COMMENTS