INCOME TAX RULES 2022
స్నేహితులు లేదా బంధువులకు డబ్బులు అప్పు ఇస్తే ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాలా? తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
సాధారణంగా మనం చిన్న చిన్న అవసరాలకు స్నేహితులు లేదా బంధువుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాం. లేకపోతే వారి అవసరాలకు మన దగ్గర ఉన్న డబ్బును అప్పుగా ఇస్తాం. అయితే చాలా మందికి అప్పుపై వచ్చే వడ్డీకి మనం ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాలా? వద్దా? అనే డౌట్ ఉంటుంది. ఈ విషయంలో ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉన్నాయో? ఇప్పుడు తెలుసుకుందాం.
మన అవసరాలకు బ్యాంక్ ను లేదా థర్డ్ పార్టీ లెండర్ ను ద్వారా వడ్డీకి అప్పు తెచ్చుకోవడం కంటే తెలిసిన వారి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడం ఉత్తమమని మనం అనుకుంటూ ఉంటాం. అది సహజం. ఎందుకంటే బ్యాంక్ వాళ్లు మళ్లీ ప్రాసెస్ ఫీజులంటూ అధిక వసూళ్లకు పాల్పడతారని మనకు భయం.. ఇలాంటి భయాలు లేకుండా మనం తెలిసిన వారి దగ్గర నుంచి కొంచెం వడ్డీ ఎక్కువైనా డబ్బు అప్పుగా తెచ్చుకుంటాం. ఈ సమయంలో మనం ఎలాంటి రాతపూర్వక అగ్రిమెంట్లు ఇవ్వం. కేవలం నమ్మకం మీదే అప్పు తెచ్చుకోవడం లేదా ఇస్తుంటాం. ఇది చట్ట వ్యతిరేకమైనది కానప్పటికీ దానికి ఓ పరిమితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా అప్పు తీసుకున్నప్పుడు లేదా ఇచ్చినప్పుడు రాతపూర్వక అగ్రిమెంట్లు చేసుకుంటే మేలని సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు రాబడికి సంబంధించిన వివరాలను మిమ్మల్ని అడిగినప్పుడు అగ్రిమెంట్లు రాబడి ఆధారాలుగా ఉంటాయి. అలాగే అప్పునకు సంబధించి వివాదాలు ఏర్పడినప్పడు వాటిని పరిష్కరించడానికి కూడా ఉపయోగపడతాయి.
ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని 269 ఎస్ ఎస్ రూల్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఎలాంటి రూపంలోనైనా రాతపూర్వక అగ్రిమెంట్లు లేకుండా 20,000 కు మించి డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరమని పేర్కొంటుంది. అయితే ఆ సొమ్ము ఏదైనా ఆస్తి కొనుగోలు కోసం అడ్వాన్స్ గా ఇచ్చే సమయంలో అయితే సంబంధించిన రాతపూర్వక అగ్రిమెంట్లతో ఎంతైనా తీసుకోవచ్చు లేదా ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అప్పు ఇచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
అప్పు ఇచ్చినప్పుడు కచ్చితంగా ఇచ్చే వ్యక్తి సరైన డాక్యుమెంటేషన్ ప్రకారం ఇవ్వాలి. తప్పనిసరిగా లోన్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ అగ్రిమెంట్ ను స్టాంప్ పేపర్లపై కానీ, నోటరీ కానీ చేయించాలి. మన దేశంలో చాలా మంది ప్రామిశరీ నోట్ ఆధారంగా అప్పు ఇస్తారని అది చాలా మంచి పద్ధతని నిపుణులు చెబుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే అప్పు తిరిగి చెల్లించే సమయంలో వడ్డీ 5000 దాటితే చెల్లించే వడ్డీలో 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. అయితే అతని వ్యాపారం ఇన్ కమ్ కోటి రూపాయలు.వృత్తి ఆదాయం 50 లక్షలకు మించి ఉన్నప్పుడే ఈ రూల్ వర్తిస్తుంది.
వడ్డీ మినహాయింపుల క్లెయిమ్
గృహ ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణం తీసుకున్నప్పుడు 1961లోని యు/ఎస్ 24(బి) ప్రకారం ఇంటి ఆస్తి నుంచి ఆదాయం ప్రకారం వడ్డీ చెల్లింపుపై మినహాయింపు పొందే అవకాశం ఉంది. అయితే పలు నిబంధనలు అనుసరించి మనం తీసుకున్న రుణంపై వడ్డీ మినహాయింపులు పొందే అవకాశం ఉంది.
COMMENTS