Customers of SBI have good news. Deposit rates have increased by the bank.
SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిపాజిట్ రేట్లు పెంచిన బ్యాంకు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. ఆర్‌బీఐ తన రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ వడ్డీ రేట్లను సవరించింది.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు నేటి (డిసెంబరు 13) నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కాలపరిమితులను బట్టి వడ్డీరేట్లను 15-100 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త డిపాజిట్లతో పాటు పాత వాటిని పునరుద్ధరించినా తాజా రేట్లు వర్తిస్తాయి. ఎస్‌బీఐ సిబ్బంది, ఎస్‌బీఐ పింఛనుదారులకు అదనంగా 1 శాతం వడ్డీరేటు లభిస్తుంది.
☛ రూ.రెండు కోట్లు అంతకంటే ఎక్కువ (పెద్ద డిపాజిట్లు) విలువ చేసే, 180-210 రోజుల కాలపరిమితితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ (SBI) అత్యధికంగా 100 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో డిపాజిట్ రేటు 4.5 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. ఇదే కాలపరిమితిలో రూ.రెండు కోట్ల కంటే తక్కువ (రిటైల్ డిపాజిట్లు) డిపాజిట్లపై మాత్రం వడ్డీరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్ద కొనసాగించింది.
☛ 07-45 రోజుల కాలపరిమితో కూడిన పెద్ద డిపాజిట్ల రేటును 3.5 శాతం నుంచి 4.25 శాతానికి పెంచింది. ఏడాది కంటే ఎక్కువ- రెండేళ్ల కంటే తక్కువ గడువుతో కూడిన డిపాజిట్ రేటును 6 శాతం నుంచి 6.5 శాతానికి చేర్చింది. అలాగే రెండేళ్ల కంటే ఎక్కువ- మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితితో కూడిన డిపాజిట్లపై రేటును 5.25 శాతం నుంచి 5.75 శాతానికి చేర్చింది. మూడేళ్ల కంటే ఎక్కువ ఐదేళ్ల కంటే తక్కువ కాలపరిమితి డిపాజిట్లపైనా 5.75 శాతం వడ్డీ లభించనుంది.
☛ వార్షిక ప్రాతిపదికన చూస్తే రుణాలు, డిపాజిట్ల వృద్ధి మధ్య ప్రస్తుతం అంతరం బాగా పెరిగినట్లు పలువురు బ్యాంకింగ్ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2022 నవంబరు 18 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు రూ.172.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 9.6 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో రుణ బకాయిలు 17.2 శాతం పెరిగి రూ.129.47 లక్షల కోట్లకు చేరాయి.
COMMENTS