Bank Over Draft 2024
బ్యాంక్ ఖాతాలో సున్నా రూపాయలు ఉన్నాయా? అయినా ఇలా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు..
Bank Over Draft: మన బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా నగదు విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. బ్యాంకులు కస్టమర్ చేసే FDలు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆస్తి తనఖా, సెక్యూరిటీలు, బంగారం మొదలైన వాటిపై ఓవర్ డ్రాఫ్ట్(OD) సౌకర్యాన్ని అందిస్తాయి. ఉదాహరణకు కస్టమర్ తన ఫిక్స్ డ్ డిపాజిట్ పై ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నట్లయితే.. బ్యాంకులు సాధారణంగా FDపై అందించే వడ్డీ కంటే దాదాపు 100 నుంచి 200 బేసిస్ పాయింట్ల వడ్డీని వసూలు చేస్తాయి. ఓడీపై ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటును ప్రతిరోజూ లెక్కించబడి, నెలవారీగా డెబిట్ చేయబడుతుంది. సమయానికి బకాయిలను డిఫాల్ట్ చేస్తే వడ్డీ పెరుగుతుంది.
ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా ఎలా పని చేస్తుంది?
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం సాధారణంగా వినియోగదారుని సేవింగ్స్/కరెంట్ ఖాతాలకు లింక్ చేయబడతాయి. ఈ సౌకర్యం వల్ల కస్టమర్లు బ్యాంక్ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ కంటే ఎక్కువ నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. బ్యాంక్ అందించిన లిమిట్ ఉపయోగపడుతుంది. తరువాత వినియోగదారులు బ్యాంక్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ ఓడీ చెల్లింపును సర్ధుబాటు చేసుకుంటుంది. మిగిలిన మెుత్తం సేవింగ్స్/కరెంట్ ఖాతాలో జమ అవుతుంది.
సౌకర్యాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి?
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం షార్ట్ టర్మ్ క్రెడిట్ లైన్ అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనుకోకుండా లిక్విడిటీ క్రంచ్ వల్ల డబ్బు కొరత ఏర్పడితే.. ఆర్థిక అత్యవసర పరిస్థితుల నుంచి ఇది రక్షణగా పని చేస్తుంది. స్వల్ప కాలానికి ఎలాంటి అప్పులు, తాకట్టులు పెట్టకుండానే దీని ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితులను అధిగమించవచ్చు.
సమయానికి చెల్లింపులు చేయండి..
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అనవసరమైన ఖర్చుల కోసం దుర్వినియోగం చేయకండి. మీరు బ్యాంక్‌లో ఫిక్స్ డ్ డిపాజిట్ కలిగి ఉన్నట్లయితే లేదా ఏదైనా ఇతర సెక్యూరిటీకి కొలేటరల్‌గా ఈ సౌకర్యాన్ని ఉచితంగా పొందవచ్చు. ఓడీ తీసుకునే ముందు బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఛార్జీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయానికే బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించాలి. డిఫాల్ట్ అయినట్లయితే.. భారీ వడ్డీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. పైగా దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
సరిగా వినియోగించుకోండి..
మీకు డబ్బు అవసరమైనప్పుడు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం సరైన రీతిలో వినియోగించుకోవచ్చు. ఇది నిజంగా అత్యవసర పరిస్థితుల్లో సహాయకారిగా నిలుస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ సౌకర్యం చాలా ఉపయోగకరం. ఎవరికైనా చెల్లింపుల కోసం చెక్కు ఇచ్చినప్పుడు పొరపాటున డబ్బు తక్కువగా ఉంటే.. అలాంటి సందర్భంలో డిఫాల్ట్ కాకుండా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం నిజంగా సహాయం చేయగలదు. అయితే మీరు దీనిని వినియోగించటానికి ముందు దాని లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి.
COMMENTS