Which account is preferable for investing, SSY or PPF
SSY vs PPF: పాప పేరుతో ఏ ఖాతాలో పెట్టుబడి పెట్టడం మంచిది?
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) రెండూ ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలే. పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉండడంతో పాటు.. పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం డబ్బు కూడబెట్టేందుకు ఈ రెండు పథకాలూ మంచి ఎంపికే. కానీ, SSY ఖాతాను అందరూ తెరిచేందుకు వీలులేదు. 10ఏళ్లలోపు వయసున్న ఆడపిల్ల పేరుపై.. పాప భవిష్యత్తు కోసం మాత్రమే ఇందులో పొదుపు చేసే అవకాశం ఉంది. కానీ PPF అలాకాదు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవచ్చు. మైనర్ పేరుపై కూడా. ఈ రెండు పథకాలు.. పెట్టుబడిదారులకు నిర్దిష్ట ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఖాతాదారుడు ఏ లక్ష్యం కోసం పెట్టుబడులు పెడుతున్నారు?ఎంత కాలం పెట్టుబడులు కొనసాగిస్తారు? అనే అంశాలపై ఆధారపడి పథకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సుకన్య సమృద్ధి యోజన Vs పీపీఎఫ్..
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతా నుంచి 7.60 శాతం వార్షిక వడ్డీ లభిస్తుండగా, PPF నుంచి 7.10 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకాల వడ్డీ రేట్లను పోల్చి చూసినప్పుడు SSY.. PPF కంటే అధిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వం త్రైమాసికంగా సవరిస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. SSYని ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసింది కాబట్టి PPFతో పోలిస్తే ఇది ముందు నుంచీ మెరుగైన వడ్డీ రేటునే అందిస్తోంది. అందువల్ల ఆడపిల్ల భవిష్యత్తు కోసం మదుపు చేసే వారికి SSY కచ్చితంగా మంచి ఎంపికే. దీంట్లో 21 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. 15 సంవత్సరాలు పాటు ఈ పథకంలో పెట్టబుడి పెట్టాలి. ఆ తర్వాత నుంచి పెట్టుబడులు స్వీకరించరు. అప్పటి వరకు ఖాతాలో జమ అయిన మొత్తంపై మరో ఆరు సంవత్సరాల పాటు వడ్డీ సమకూరుతుంది. 18 సంవత్సరాల వయసు వచ్చిన ఆడిపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నిబంధనలకు లోబడి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఉదాహరణకు మీ పాప వయసు 2 ఏళ్లు ఉన్నప్పుడు.. అంటే 2020-21లో SSY ఖాతాను తెరిచి వార్షికంగా రూ.1 లక్ష ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారనుకుందాం. ఇలా మీరు 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తూ పోతే.. 15 ఏళ్లలో రూ. 28,32,198 సమకూరుతుంది. దీన్ని మరో ఆరు సంవత్సరాలు అలానే వదిలిస్తే మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి అంటే 2040-41 నాటికి, అంటే పాపకు 23 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపు రూ. 44 లక్షల మొత్తం అందుతుంది. మెచ్యూరిటీ తర్వాత ఖాతాలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుని, ఖాతాను మూసివేయాలి. ఒకవేళ కొనసాగించినా ఖాతా నుంచి ఎలాంటి వడ్డీ రాదు. కాబట్టి, పెట్టుబడులు కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు పీపీఎఫ్ ఖాతాను పరిశీలిస్తే..
పీపీఎఫ్ ఖాతాలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. ఇదే రూ. 1 లక్ష, 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి రూ. 27,12,139 సమకూరుతుంది. అయితే పీపీఎఫ్‌ని మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల చొప్పున ఎన్నిసార్లైనా పెట్టుబడులను నిలిపివేసి లేదా పెట్టుబడులు పెడుతూ ఖాతాను కొనసాగించవచ్చు. 15 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఖాతాను 5 ఏళ్ల చొప్పున కొనసాగిస్తే.. 20 ఏళ్లకు రూ. 38,21,725, 25 ఏళ్లకు రూ.53,85,261 30 ఏళ్లకు రూ.75,88,469 సమకూర్చుకోవచ్చు. 15 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత కూడా పెట్టుబడులు పెడుతూ ఖాతాను కొనసాగిస్తే.. 20 ఏళ్లకు రూ.44,38,859, 25 ఏళ్లుకు.. రూ.68,72,010, 30 ఏళ్లకు.. రూ.1 కోటి పైగా సమకూర్చుకోవచ్చు. ఇక్కడ రెండు పథకాల ప్రస్తుత వడ్డీ రేట్లను తీసుకుని లెక్కించడం జరిగింది.
ఎస్ఎస్ఎస్, పీపీఎఫ్ రెండింటిలోనూ సెక్షన్ 80c కింద పరిమితికి లోబడి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందువల్ల మీరు ఎంత కాలం పెట్టుబడులు కొనసాగిస్తారనే అంశంపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ పాప ఉన్నత చదువులు, వివాహం వంటి వాటి కోసం పొదుపు చేస్తుంటే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎంచుకోవడం మేలు. అలా కాకుండా 20, 25, 30 ఏళ్ల పాటు ఖాతా కొనసాగించేవారైతే పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకుని కాంపౌండింగ్ వడ్డీ ప్రభావంతో మంచి రాబడి పొంది పాప భవిష్యత్తు లక్ష్యాలకు ఉపయోగపడేలా చూసుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన వివరాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడులు, సంబంధిత నిర్ణయాలు పూర్తిగా మీ వ్యక్తిగతం.
COMMENTS