When should I begin investing for retirement? - Retirement Corpus
Retirement Corpus: పదవీ విరమణ కోసం పెట్టుబడులు ఎప్పుడు ప్రారంభించాలి?
ఉద్యోగ విరమణకు చాలా సమయం ఉందని పెట్టుబడులను వాయిదా వేయడం సరికాదు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే పదవీ విరమణకు కొంత మొత్తం కేటాయించాలి.
ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ నిర్ధిష్ట వయసు తర్వాత పదవీ విరమణ తీసుకోవాల్సిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే, ఉద్యోగం నుంచి వైదొలిగిన తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి ఉద్యోగంలో ఉండగానే ఇందుకోసం నిధిని సమకూర్చుకోవాలి. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవడం వల్ల పిల్లలపై ఆధారపడనవసరం లేదు. ప్రశాతంగా జీవనం సాగించవచ్చు.
ఎప్పుడు ప్రారంభించాలి?
చాలా మంది ఉద్యోగ విరమణకు చాలా సమయం ఉందని పెట్టుబడులను వాయిదా వేస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలన్నింటిలో దీనికి చివరి స్థానం కేటాయిస్తారు. కానీ, ఇలా చేయడం సరికాదు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే పదవీ విరమణకు కొంత మొత్తం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.
ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఎందుకు?
భారతదేశంలో పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పెట్టుబడులు ప్రారంభిస్తే కంపౌండింగ్ వడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తంలో నిధి సమకూర్చుకోవచ్చు. కంపౌండింగ్, పెట్టుబడులపై వచ్చిన వడ్డీని తిరిగి పెట్టబడి పెట్టి మరింత ఆర్జించేందకు వీలు కల్పిస్తుంది. ఒక ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం.
25 ఏళ్ల వయసులో..
రమేష్ చదువు పూర్తి చేసుకుని 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు. అతడు ఉద్యోగంలో చేరిన కొత్తలోనే పదవీ విరమణ లక్ష్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ప్రారంభించాడనుకుందాం. పదవీ విరమణ చేసేందుకు ఇంకా 35 సంవత్సరాల సమయం ఉంటుంది. నెలకు రూ. 5000తో మదుపు చేయడం ప్రారంభించి వార్షిక ప్రాతిపదికన 5% పెట్టుబడులు పెంచుకుంటూ పోతే 10-12% రాబడి అంచనాతో దాదాపు రూ.3.14 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు సమకూర్చుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి మొత్తం దాదాపు రూ.55 లక్షలు.
30 ఏళ్ల వయసులో
అదే రమేష్ 30 ఏళ్ల వయసులో పదవీ విరమణ కోసం పెట్టుబడులు ప్రారంభిస్తే, పదవీ విరమణకు 30 ఏళ్ల సమయం ఉంటుంది. అప్పుడు నెలకు రూ. 10,000తో మదుపు చేయడం ప్రారంభించి వార్షిక ప్రాతిపదికన 5% పెట్టుబడులు పెంచుకుంటూ పోతే 10-12% రాబడి అంచనాతో దాదాపు రూ.3.59 కోట్లు నుంచి రూ.5.20 కోట్ల వరకు నిధి సమకూర్చుకోవచ్చు. అంటే ఐదేళ్లు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల రెట్టింపు మొత్తం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ పెట్టుబడి మొత్తం దాదాపు రూ.80 లక్షలు.
35 ఏళ్ల వయసులో..
ఇప్పుడు మరో 5 ఏళ్లు ఆలస్యంగా పెట్టుబడులు ప్రారంభించారనుకుందాం. అంటే 35 ఏళ్ల వయసులో మదుపు చేయడం ప్రారంభిస్తే పదవీ విరమణకు 25 ఏళ్ల సమయం ఉంటుంది. అప్పుడు నెలకు రూ.18,000తో మదుపు చేయడం ప్రారంభించి వార్షిక ప్రాతిపదికన 5% పెట్టుబడులు పెంచుకుంటూ పోతే 10-12% రాబడి అంచనాతో దాదాపు రూ.3.60 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నిధిని సమకూర్చుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి మొత్తం దాదాపు రూ. 1 కోటి.
40 ఏళ్ల వయసులో
40 ఏళ్ల వయసులో మదుపు చేయడం ప్రారంభిస్తే పదవీ విరమణకు 20 ఏళ్ల సమయం ఉంటుంది. అప్పుడు నెలకు రూ. 35,000తో మదుపు చేయడం ప్రారంభించి వార్షిక ప్రాతిపదికన 5% పెట్టుబడులు పెంచుకుంటూ పోతే 10-12% రాబడి అంచనాతో దాదాపు రూ.3.70 కోట్ల నుంచి రూ.4.80 కోట్ల వరకు నిధిని సమకూర్చుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి మొత్తం దాదాపు రూ.1.40 కోట్లు.
45 ఏళ్ల వయసులో..
45 ఏళ్ల వయసులో మదుపు చేయడం ప్రారంభిస్తే పదవీ విరమణకు 15 ఏళ్ల సమయం ఉంటుంది. అప్పుడు నెలకు రూ. 70,000తో మదుపు చేయడం ప్రారంభించి వార్షిక ప్రాతిపదికన 5% పెట్టుబడులు పెంచుకుంటూ పోతే 10-12% రాబడి అంచనాతో దాదాపు రూ.3.85 కోట్ల నుంచి రూ.4.57 కోట్ల వరకు నిధిని సమకూర్చుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి మొత్తం దాదాపు రూ.1.80 కోట్లు.
సమయం విలువ..
పైన తెలిపిన సందర్భాలను పరిశీలిస్తే.. మొదటి సందర్భంలో రమేష్ పెట్టిన పెట్టుబడి రూ.55 లక్షలే అయినా 12% రాబడి అంచనాతో రూ.5 కోట్లు సమకూర్చుకోగలిగాడు. అంటే రూ. 4.45 కోట్ల వరకు రాబడి వచ్చింది. కానీ, ఆలస్యం అవుతున్న కొద్దీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.. రాబడి తగ్గిపోయింది. చివరి సందర్భంలో రూ.1.80 కోట్లు పెట్టుబడి పెట్టినా రాబడి మాత్రం రూ.2.77 కోట్లు మాత్రమే వచ్చింది. ఇదే సమయానికి ఉన్న విలువ.
చివరిగా..
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే నష్టభయం తగ్గుతుంది. అలాగే, 12 నుంచి 14 శాతం వరకు కూడా రాబడి ఆశించగలం. లేకపోతే రాబడి కూడా తగ్గొచ్చు. దీంతో కావాల్సిన నిధి ఏర్పాటు చేసుకోవడం కష్టం అవుతుంది. అదీగాక 45 ఏళ్ల వయసులో పిల్లల ఉన్నత చదువులు, వివాహం వంటి బాధ్యతలు మరింత ఎక్కువ అవుతాయి. రోజువారీ ఖర్చులు, బీమా చెల్లింపులు, రుణ ఈఎంఐలు వంటి తప్పనిసరి ఖర్చులు ఉండనే ఉంటాయి.
COMMENTS