The son of an auto driver holds the title of youngest IAS. selected at a young age for the civil service.
Youngest IAS: ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్.. చిన్న వయసులోనే సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక..
Youngest IAS : మన దేశంలో పేద, ధనిక అనే తేడా లేకుండా ఎంతోమంది సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకొని ఆదర్శంగా నిలిచారు. ఇండియాలో టాలెంట్ ఉన్న యువతకు ముందు నుంచి లోటు లేదు.
కానీ పరిస్థితుల ప్రభావంతో చాలామంది ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అయితే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా లక్ష్యం కోసం కృషి చేస్తే విజయం సొంతమవుతుందని నిరూపించాడు ఒక ఆటో డ్రైవర్ కొడుకు.
సివిల్స్ టార్గెట్‌గా పెట్టుకున్న ఆ యువకుడు, ఇప్పుడు భారతదేశంలో అతి చిన్న వయసులోనే ఐఏఎస్‌గా ఎంపికయ్యి రికార్డు సృష్టించాడు. అతడే మహారాష్ట్రకు చెందిన షేక్ అన్సార్. ఆయన సక్సెస్ స్టోరీ ఇదే..
అన్సార్ షేక్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల మధ్య పెరిగాడు. చదువు పూర్తి చేసి చివరికి యూపీఎస్‌సీ పరీక్షల్లో తన సత్తా చాటాడు. కొత్త కలల ప్రపంచంలోకి సగర్వంగా అడుగుపెట్టాడు.
మహారాష్ట్రలోని జాల్నా గ్రామానికి చెందిన ఈయన దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు.
ఇది జరిగి దాదాపుగా ఏడేళ్లు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడి రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
బడి మాన్పించాలనే ఆలోచన
అన్సార్ చిన్ననాటి రోజుల్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండేది కాదు. దీంతో అతడిని బడి మానిపించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. కానీ ఆ స్కూల్ టీచర్ ఆయనకు నచ్చజెప్పారు.
అన్సార్ చాలా బాగా చదువుకుంటాడని, అతడికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఆమె మాటలు విన్న తండ్రి ఏం చేయలేక అతడి చదువును కొనసాగించేందుకు ఒప్పుకున్నారు.
అయితే కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా అన్సార్ సోదరుడు 7వ తరగతిలోనే చదువు ఆపేశాడు. గ్యారేజీలో పని చేయడం ప్రారంభించాడు.
అన్సార్ 12వ తరగతి బోర్డు పరీక్షలలో 91 శాతం మార్కులు సాధించాడు. తర్వాత పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో 73 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
తన ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి కష్టమైన ఉద్యోగాలు చేశాడు. తర్వాత UPSCని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు.
టార్గెట్ సివిల్స్
సివిల్స్‌కు సిద్ధమవుతున్నప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు ప్రతిరోజూ సుమారు 12 గంటలు కష్టపడ్డానని చెప్పారు అన్సార్. కాలేజీ తర్వాత ఒక సంవత్సరం పాటు యూపీఎస్‌సీ(UPSC) కోచింగ్‌లో చేరాడు.
పేద కుటుంబం నుంచి వచ్చిన వాడని తెలిసి ఆ కోచింగ్ సెంటర్ కూడా ఫీజులో కొంత భాగాన్ని మాఫీ చేసింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఈ టాలెంట్ పర్సన్.. 2015 యూపీఎస్‌సీ(UPSC) పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే 361వ ర్యాంక్ సాధించాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే.
ఇలా దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు అన్సార్. ఇప్పటి వరకు ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారంటే అదెంత కష్టమైన రికార్డో అర్థం చేసుకోవచ్చు.
కష్టాలు, సమస్యల గురించి ఆలోచించకుండా లక్ష్యంపై గురిపెడితే, ఎవరైనా సక్సెస్ అవుతారని చెబుతున్నారు అన్సార్.
COMMENTS