Telangana: Waiting for Teacher Vacancies? But good news for you
Telangana: టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తిచేయనున్నట్లు మంత్రి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం (నవంబరు 20న) నిర్వహించిన పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్‌రావు ఈ మేరకు మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..
‘రాష్ట్ర బడ్జెట్‌లో 10 శాతం విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. 2014లో విద్యపై రూ.9,518 కోట్లు ఖర్చుపెట్టగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25,250 కోట్లకు పెంచాం. మన ఊరు, మన బడి కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. మాది ఉపాధ్యాయ, ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 295 ఉంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 920కి చేరింది. వైద్య సీట్లు 850 నుంచి 2,950కి పెరిగాయి. అయినా మేధావులు కొందరు తెలంగాణలో అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వివిధ పద్దుల కింద తెలంగాణకు రావాల్సిన రూ.21 వేల కోట్లను కేంద్రం ఆపేసింది. అయినా ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తున్నాం. గుజరాత్‌లో లేని వేతనాలు మన రాష్ట్ర సర్కార్ అందిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాం. టీచర్ పోస్టులకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం. ఆరోగ్యకార్డులు, పీఎఫ్ సొమ్ము జమ విషయంలో తగు చర్యలు తీసుకుంటాం. పాత పింఛను విధానంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని’ మంత్రి హరీశ్‌రావు ఈ సదర్భంగా తెలిపారు.
COMMENTS