Telangana: Notification for 1569 posts in Telangana Health Department will be released in a week: Minister HarishRao
Telangana: వారం రోజుల్లో.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 1569 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల: మంత్రి హరీశ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1,569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నట్లు శుక్రవారం (నవంబర్ 11) మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘మునుగోడు ఉపఎన్నిక కారణంగా వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అర్హుల జాబితా విడుదలకాగా, వారం పది రోజుల్లో నియామక పత్రాలు సైతం అందజేస్తాం. దీంతో అన్ని పీహెచ్‌సీల్లోనూ వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇక ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులు, 1,165 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల నిమాయక ప్రకటనను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. మంత్రి ఇంకా ఈ విధంగా మాట్లాడారు..
రాష్ట్రంలో 331 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి. దవాఖానాల సంఖ్యను 500కు పెంచాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 4,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో 2,900 కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నామన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకూ 36.20 లక్షల మందికి 6.46 కోట్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. వచ్చే జనవరి నాటికి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కేంద్రాన్ని నెలకొల్పడం దేశంలో ఇదే మొదటిసారి. రాష్ట్రంలోని 887 పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులతో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుంది. సీసీ కెమెరాలతో భద్రత మరింత మెరుగవుతుందన్నారు. అంతేకాకుండా 1,239 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేశామని, ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున మొత్తంగా రూ.247 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 1,497 ఆరోగ్య ఉపకేంద్రాలను రూ.59 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు.
COMMENTS