SBI: SBI Tips for Safe UPI Transactions!
SBI: సురక్షితమైన యూపీఐ లావాదేవీలకు ఎస్‌బీఐ టిప్స్!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)..రియల్ టైమ్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఒకే ఒక్క యాప్‌తో..మొబైల్ నంబరు, క్యూఆర్ కోడ్ సహాయంతో క్షణాల్లో నగదు బదిలీ, చెల్లింపులు చేసేయొచ్చు.
ఇందుకోసం ఎటువంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు.
2016లో యూపీఐ ప్రారంభమైనప్పటికీ, కోవిడ్ 19 కారణంగా గత రెండేళ్లలోనే భారత్‌లో యూపీఐ చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం జులైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే అప్పటి వరకు నమోదైన అత్యధిక లావాదేవీగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పుడు ఆగస్టులో రూ. 10.70 లక్షల కోట్ల మేర యూపీఐ లావాదేవీలు పెరిగాయి. సమయం, శక్తి, పేపర్ వినియోగాన్ని తగ్గించడం కూడా లావాదేవీలు పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
రోజు రోజుకి లావాదేవీల సంఖ్య పెరగడంతో పాటు..మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు అనేక కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు కూడా లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి మోసాలను నివారిస్తూ, యూపీఐ ద్వారా సురక్షితంగా లావాదేవీలు నిర్వహించేందుకు కొన్ని చిట్కాలను తెలుపుతూ ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
యూపీఐ లావాదేవీలు సురక్షితంగా ఉండాలంటే..
- డబ్బును స్వీకరించే సమయంలో యూపీఐ పిన్ నంబరును నమోదు చేయనవసరం లేదు.
- యాదృచ్ఛిక/తెలియని సేకరణ అభ్యర్థనను అంగీకరించవద్దు.
- మీ యూపీఐ పిన్ నంబరు ఎవ్వరికి చెప్పొద్దు.
- ఫోన్ నంబరు ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు చేసేటప్పుడు..లబ్ధిదారుని వివరాలను ధృవీకరించిన తర్వాత మాత్రమే చెల్లింపులు చేయడం మంచిది.
- మీ యూపీఐ పిన్ నంబరు తరచుగా మారుస్తూ ఉండడం మంచిది.
COMMENTS