Sakuntala Devi 2024
శకుంతలా దేవి జీవిత రహస్యాలు.. బర్త్ డే సందర్భంగా
శకుంతలా దేవి (Sakuntala Devi movie)సినిమా భారతీయులను బాగా ఆకట్టుకుంది. మన గణిత మేధావిని మనం మరచిపోతున్న క్రమంలో సినిమా రూపంలో వచ్చిన జీవితచరిత్ర మనకు ఆమె గొప్పతనాన్ని గుర్తు చేసింది. యువతరానికి శకుంతలా దేవి గొప్పతనాన్ని పరిచయం చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ (Amazon prime video) అవుతోంది.
సంప్రదాయ కన్నడిగ
కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో 1929 నవంబరు 4వ తేదీన శకుంతలా దేవి జన్మించారు. ముక్కుపచ్చలారని మూడేళ్ల వయసులోనే తనకు లెక్కల్లో అపరిమితమైన పట్టుందని ఆమె గ్రహించారు. అంతేకాదు బాల్యం నుంచీ ఈమెకున్న జ్ఞాపకశక్తికి ఎదురులేదంతే. పట్టుమని 6 ఏళ్లు కూడా నిండకుండానే లెక్కల్లో తన ప్రతిభను చాటుకునేలా మైసూర్ యూనివర్సిటీలో ఆమె ప్రదర్శన ఇచ్చి బాలమేధావిగా అందరినీ ఆశ్చర్యపరచారు. ఈ ప్రదర్శన ఆమె జీవితంలో ఓ మైలురాయి. ఎందుకంటే ఇక ఇక్కడినుంచీ ఆమె వెనక్కి చూడాల్సిన అవసరం అస్సలు రాలేదు. 1944లో లండన్ వెళ్లిపోయిన శకుంతలాదేవి పేరు ఆ తరువాతి కాలంలో ప్రపంచమంతా మారుమోగింది.
మాట్లాడితే చాలు
శకుంతలా దేవి ఇచ్చే ప్రసంగాలు విన్నవారు చాలా ప్రభావితం అయ్యారు. మూడేళ్ల నుంచే అందరినీ ఇంప్రెస్ చేసేలా మాట్లాడటం ఈమెకు అలవాటైంది. బహుగుణ ప్రజ్ఞాశాలి అయిన శకుంతలా మంచి మాటకారి, రచయిత్రి, జోస్యం చెబుతారు, లెక్కల్లో ఈమెకున్న ప్రావీణ్యం ఫాస్టెస్ట్ హ్యూమన్ కంప్యూటర్ కు మించినది. ఇంటర్వ్యూలు, సన్మాన కార్యక్రమాల్లో శకుంతలా చేసిన ప్రసంగాలు అత్యద్భుతం అనిపించేవి.
అంకగణితమంటే కొట్టిన పిండి
అంకగణితంలో (arithmetic) అత్యంత క్లిష్టమైన లెక్కలను చిటికెల్లో ఛేదించడంలో ఈమెకు ఎవ్వరూ సాటిరారు. 'మైండ్ డైనమిక్స్' అనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన శకుంతలా దేవి, కంప్యూటర్ కంటే మానవ మేథస్సు గొప్పని, వేగవంతమైనదని సంపూర్ణంగా విశ్వసిస్తారు. మనుషులు తయారు చేసిన కంప్యూటర్లను ఓడించడం మనుషులకు అసలు లెక్కా అని శకుంతల అంటారు. అంతేకాదు తన మాటలను నిరూపించారు కూడా. కంప్యూటర్ లెక్క తప్పినా శకుంతలా లెక్క మాత్రం ఎన్నడూ తప్పలేదంటే అతిశయోక్తి కాదు.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్
1982 నాటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన ఈమెకు హీరోయిన్ అంత పాపులారిటీ, ఇమేజ్ ఆ కాలానికే ఉండేది. వార్తా పత్రికల్లో ఈమె సాధించిన విజయాలను బ్యానర్ గా ప్రచురిస్తే, వార పత్రికల్లో ఈమెకు ప్రాధాన్యత ఇచ్చి మరీ కవర్ స్టోరీల్లో ముద్రించేవారు. అప్పట్లో ఉన్న అత్యంత వేగవంతంగా పనిచేసే కంప్యూటర్ ను ఆమె తన మేధస్సు ఓడించిన 'బ్యూటిఫుల్ మైండ్' శకుంతల సొంతం.
స్వలింగ సంపర్కం నేరం కాదు
స్వలింగ సంపర్కులను చులకన చేయడం శకుంతలకు నచ్చేది కాదు. వారిపట్ల ఆమెకు సానుకూల భావన ఉండేది. ఆ భావనతో ఆమె 'ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్' (the world of homosexuals) అనే పుస్తకం స్వయంగా రాయడం సంచలనం సృష్టించింది. హోమోసెక్సువల్స్ పై మనదేశంలో వెలువడ్డ తొలి పుస్తకం ఇదే కావడం విశేషం. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ పరితోష్ బెనర్జీ (Paritosh Banerji) హోమోసెక్సువల్ కావడంతో వీరిద్దరూ విడిపోయినట్టు ఆమె స్వయంగా చెప్పారు. అందుకే ఈ పుస్తకంలో దేశవిదేశాల్లోని హోమోసెక్సువల్స్ ను ఇంటర్వ్యూ చేసి, వారి లోకంపై లోతుగా అవగాహన కల్పించేలా పుస్తకాన్ని ప్రచురించారు. అప్పట్లో స్వలింగ సపర్కం నేరం కాదని బహిరంగంగా చెప్పిన భారతీయ మహిళలో బహుశా ఈమేనేమో. వంటలు, జ్యోతిష్య శాస్త్రంపై (Astrology for you) కూడా ఈమె పుస్తకాలు రాశారు. మ్యాథ్స్ పజిల్స్ (maths puzzles) వంటి ఎన్నో పుస్తకాలతో పాటు 'పర్ఫెక్ట్ మర్డర్' (Perfect murder) అనే క్రైం థ్రిల్లర్ నవల కూడా రాసిన శకుంతలా దేవికి ఎన్నో సబ్జెక్టులపై అపారమైనే పట్టు ఉంది. జ్యోతిష్యురాలిగా సమకాలీన ప్రపంచంలో ప్రముఖ ప్రపంచ నేతలకు, నటులకు, బిజినెస్ టైకూన్స్ కు ఆమె వ్యక్తిగత జ్యోతిష్యురాలిగా పనిచేశారు కూడా.
ఇందిరా గాంధీపై పోటీ
రాజకీయాలంటే శకుంతలకు చాలా ఇష్టం. ఎంతోమంది దేశాధినేతలను కలిసిన శకుంతలకు రాజకీయాలు కొత్తేం కాదు. స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. 1980లో మెదక్ నుంచి అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బరిలోకి దిగగా, ఇందిరను బహిరంగంగా విమర్శించే శకుంతల ఆమెతో ఎన్నికల బరిలో తలపడి ఓటమిపాలయ్యారు.
హ్యూమన్ కంప్యూటర్ అంటే కోపం!
హ్యూమన్ కంప్యూటర్ అన్న బిరుదంటే శకుంతలకు అస్సలు నచ్చేదికాదు. బీబీసీ చానెల్ లో చేసిన లెక్కల షో శకుంతలకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. కంప్యూటర్ కంటే మానవ మేధస్సుకు అపరిమితమైన శక్తి ఉందని, కంప్యూటర్ తో మానవ మెదడును ఎలా పోల్చుతారు, కంప్యూటరు అందుకు సరితూగదని గట్టిగా వాదించేవారు. ఎంత పెద్ద నంబరు అయినా గణిత సమస్యను కేవలం సెకెండ్లలో పరిష్కరించి, అదికూడా నోటితోనే సమాధానం చెప్పడం ఈమె ప్రత్యేకత. 2013, ఏప్రిల్ 21న, 83 ఏళ్ల వయసులో శకుంతలా దేవి బెంగళూరులో మరణించారు.
శకుంతలాగా ఆకట్టుకున్న విద్యాబాలన్
శకుంతలా దేవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'శకుంతలా దేవి' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి విద్యాబాలన్ శకుంతలా దేవి పాత్రను పోషించిన నటనా నైపుణ్యం అందరినీ మెప్పించింది. ఈ సినిమాలో శకుంతలా దేవి తన కుమార్తె అనుపమా బెనర్జీ దృష్టి కోణంలో ఎలా కనిపించేదో కళ్లకు కట్టినట్టు చూపించారు.
COMMENTS