MONTHLY PENSION 2022
నెలకు రూ.2 లక్షల పైనే పెన్షన్... ఇలా పొదుపు చేస్తే చాలు
వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే పొదుపు చేయడం మంచిది. పెన్షన్ రూపంలో ఆర్థికంగా అండ లభిస్తుంది కాబట్టి వృద్ధాప్యంలో ఎలాంటి చింత లేకుండా జీవితాన్ని గడిపేయొచ్చు.
అయితే ఏ పొదుపు పథకంలో (Savings Scheme) డబ్బులు దాచుకోవాలి? ఎలాంటి పెన్షన్ స్కీమ్ (Pension Scheme) ఎంచుకోవాలి? అన్న సందేహం సామాన్యుల్లో ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనేక పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమకు కావాల్సిన పెన్షన్ స్కీమ్ ఎంచుకొని డబ్బులు పొదుపు చేయొచ్చు. అలాంటి పెన్షన్ పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కూడా ఒకటి.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పెట్టుబడి పథకంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌కు పేరుంది. ఇందులో దాచుకునే డబ్బులు డెట్, ఈక్విటీలోకి వెళ్తాయి. 75 శాతం డబ్బుల్ని ఈక్విటీలోకి మళ్లించవచ్చు. మిగతా 25 శాతం డెట్‌లోకి వెళ్తుంది. ఖాతాదారులు తమ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి 40:60 నిష్పత్తి లేదా 50:50 నిష్పత్తి కూడా ఎంచుకోవచ్చు. ఈ పథకంలో నెలకు రూ.15,000 చొప్పున 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే 60 ఏళ్ల వయస్సు పూర్తైన నాటి నుంచి రూ.2 లక్షలకు పైనే పెన్షన్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి నెలకు రూ.15,000 చొప్పున 30 ఏళ్ల పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకంలో పొదుపు చేశారనుకుందాం. డెట్ 40 శాతం, ఈక్విటీ 60 నిష్పత్తి ఎంచుకుంటే 30 ఏళ్ల తర్వాత నెలకు రూ.68,380 పెన్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.2.05 కోట్లు ఒకేసారి లభిస్తాయి. అయితే ఆ డబ్బు వెనక్కి తీసుకోకుండా సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌ను 25 ఏళ్లకు ఎంచుకున్నారనుకుందాం. వార్షిక వడ్డీ 8 శాతం చొప్పున లెక్కిస్తే నెలకు రూ.1.55 లక్షలు వస్తాయి. దీనికి అదనంగా పెన్షన్ లభిస్తుంది కాబట్టి నెలకు రూ.2 లక్షలకు పైనే ప్రతీ నెలా అకౌంట్లో జమ అవుతుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయనడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పెన్షన్ పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ స్కీమ్‌లో దీర్ఘకాలం పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ నాటికి సంపద కూడబెట్టుకోవచ్చు. రిటైర్మెంట్ నుంచి బతికి ఉన్నంతకాలం భారీగా పెన్షన్ పొందొచ్చు.
COMMENTS