Guarantor of a loan: Do you intend to sign the guarantee. But take a look at these!
Loan guarantor : హామీ సంతకం చేస్తున్నారా .. అయితే , ఇవి చూశాకే !
గృహ, వాహన రుణాలు, వ్యాపారానికి పెద్ద మొత్తంలో అప్పు తీసుకునే వారి విషయంలో బ్యాంకులు, రుణ సంస్థలు ఎవరినైనా హామీగా చూపించాలని కోరుతుంటాయి.
దీంతో 'కాస్త హామీ సంతకం చేస్తారా?'.. అంటూ ప్రశ్న మీ మిత్రుడో, దగ్గరి బంధువో అడిగితే మీరు కాదనలేకపోవచ్చు. మీ మధ్య ఉన్న స్నేహమో, బంధుత్వమో లేదా మొహమాటం కొద్దో అంగీకరించాల్సిన పరిస్థితి. నమ్మకమైన స్నేహితుడు, బంధువుల కోసం హామీగా ఉండటంలో ఇబ్బంది లేదు. అయితే, హామీ ఇస్తున్నామంటే మనకూ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే, 'సరే' అనే ముందు మీపై దాని ప్రభావం ఎలా?ఎంత వరకు ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం.
ఏ విషయంలోనైనా మధ్యవర్తిగా ఉన్నామంటే అర్థం.. ఇరువైపులా ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తామని. రుణగ్రహీత సమయానికి బాకీ చెల్లించేలా చూసే బాధ్యత హామీదారుడిదే. ఒకవేళ అతడు రుణాన్ని చెల్లించని పక్షంలో హామీగా ఉన్న వ్యక్తి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు రుణ గ్రహీత తీసుకుంటున్న అప్పుని తిరిగి తీర్చగల సామర్థ్యం ఉన్న వ్యక్తులనే హామీదారునిగా అంగీకరిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. హామీదారుడు కూడా ఒకరకంగా రుణ గ్రహీతే. అప్పు తీసుకోకపోయినా, ఈఎమ్ఐలు చెల్లించకపోయినా రుణ గ్రహీత రుణం చెల్లించలేని పక్షంలో ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత హామీదారుపై ఉంటుంది. అందువల్ల బ్యాంకులు, రుణం ఇచ్చే సంస్థలు.. హామీదారుడి ఆస్తులు, క్రెడిట్ స్కోరును కూడా పరిశీలిస్తాయి. ఇందుకోసం హామీదారు కూడా బ్యాంకుకు కేవైసీ, ఆదాయం డాక్యుమెంట్లు వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
రుణగ్రహీతకు అనుకోనిదేదైనా జరిగిన సందర్భంలో బ్యాంకులు హామీగా ఉన్న వ్యక్తినే సంప్రదిస్తాయి. అప్పుడు కూడా బాకీ తీర్చే ఏర్పాటు చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత హామీదారుడిదే. ఇది రుణ ఒప్పంద పత్రం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, హామీ ఇచ్చేటప్పుడు నిబంధనలు క్షుణ్ణంగా చదివి.. అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలి. ఇతర వ్యక్తుల రుణాలకు మీరు హామీ ఇచ్చినట్లయితే ఆ వివరాలు 'సిబిల్' నివేదికలో నమోదు అవుతాయి. రుణం తీసుకున్న వ్యక్తి ఆ రుణాన్ని ఎలా చెల్లిస్తున్నాడనే అంశం ఆధారంగా మీ రుణ చరిత్ర కూడా ప్రభావితం అవుతుంది. ఒకవేళ రుణగ్రహీత వాయిదాల చెల్లింపులు సరిగ్గా చేయకపోయినా, మొత్తంగా ఆపేసినా మీ క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల రుణ పత్రంపై హామీదారుగా సంతకం చేస్తే సరిపోదు. రుణం తీసుకున్న వ్యక్తి సరైన సమయానికి వాయిదాలు చెల్లిస్తున్నాడా? లేదా? అనేదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
★ముందుగా రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్య ఎంత ? ఆర్థిక విషయాలలో అతడు / ఆమె ఎంత వరకు క్రమశిక్షణగా ఉంటారు ? ఇందులో మీ రిస్క్ ఎంత ? అనే విషయాల్లో మీకు కచ్చితమైన అవగాహన ఉండాలి .
★రుణ చెల్లింపులపై నిఘా ఉంచాలి . ప్రతి నెలా రుణ గ్రహీత సమయానికి చెల్లింపులు చేస్తున్నారా ? లేదా ? అని మీ క్రెడిట్ నివేదికలు చూస్తే తెలుస్తుంది . ఎందుకంటే హామీ ఇచ్చిన మొత్తం కూడా క్రెడిట్ రిపోర్ట్లో కనిపిస్తుంది .
★హామీ సంతకం చేసే కంటే ముందే బ్యాంకు , రుణ సంస్థ విధించే నిబంధనలు తెలుసుకోండి .
★ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ లేదా సగం నింపిన పత్రాల మీద సంతకం చేయకండి . అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోండి .
★ ఏదైనా నిబంధన విషయంలో మీకు భవిష్యత్లో ఇబ్బంది కావచ్చని అనిపించినా , దానిపై మీకు అభ్యంతరాలు ఉన్నా సంతకం చేయొద్దు .
★మీ ఫొటో , గుర్తింపు వివరాలను నేరుగా రుణ సంస్థకు , అధీకృత వ్యక్తికి మాత్రమే అందించండి . రుణం తీసుకోబోయే వ్యక్తికి ఇవ్వడం అంత క్షేమం కాదు .
★హామీ ఇవ్వడం అంటే అదనపు బాధ్యతలను తీసుకోవడమే . అందుకే , ముందుగా మీ రుణ చరిత్ర , క్రెడిట్ స్కోరు తెలుసుకోవడం ఉత్తమం .
COMMENTS