Engineer, Doctor, and Lawyer. Who will you develop into?
లాయర్.. డాక్టర్.. ఇంజినీర్.. మీరు ఏమవుతారు?
‣ కొలువులో చేరేముందు సరైన అవగాహన అవసరం
కెరియర్... రోజుకు 8 గంటలు... వారానికి 5 రోజులు... దాదాపు 30, 40 ఏళ్లపాటు కొనసాగాలి! మరి ఇంతకాలం సావాసం చేసే ఆ కొలువుతో మనకు జత కుదిరిందో లేదో తెలుసుకుంటున్నామా? ఏదైనా ఒక రంగంలోకి వెళ్లాలని అనుకున్నప్పుడు, దానికి తగిన చదువు చదవాలని నిర్ణయించుకున్నప్పుడు... ముందు ఈ పని నాకు నచ్చుతుందా లేదా అన్నది ఆలోచించుకుంటున్నామా?
చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఒక్కొక్కరినీ లేపి ‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని అడిగితే ‘లాయర్, డాక్టర్, ఇంజినీర్...’ ఇలా తోచింది, నచ్చింది చెప్పేస్తాం. కానీ పెద్దయ్యాక అలా కాదు... ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించాలి, అంచనా వేయాలి, తెలుసుకోవాలి, అప్పుడే పూర్తిగా రంగంలోకి దిగాలి.
ఇంకా ఏం చేయాలి...
‣ మనం చాలావరకూ ఇష్టాఇష్టాలను చిన్నతనంలోనే నిర్ణయించేసుకుంటాం. అందువల్ల బాల్యంలో మీకు ఏ పని బాగా నచ్చేదో తెలుసుకోవాలి. ఒక్కసారి మీరేం అవ్వాలి అనుకుంటూ పెరిగారో గుర్తు చేసుకుంటే... ఇకపై ఏం అవ్వాలనేదానిపై ఒక అవగాహనకు రావొచ్చు.
‣ ఏదైనా ఒక యూనివర్సిటీ మొత్తం ఎన్నిరకాలైన కోర్సులు అందిస్తుందో జాబితా చదవాలి. అందులో మీకు నచ్చినవి, నచ్చనివి, భయపెట్టేవి, బోర్ కొట్టించేవి, ఆసక్తి కలిగించేవి.. అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. అలా జాబితాగా చూసేటప్పుడు మీకు ఏది బాగా నచ్చుతుందో ఒక అంచనా ఏర్పడుతుంది.
‣ ఒక్కోసారి ఆలోచన ఎటూ తేలదు. అలాంటప్పుడు మీ గురించి బాగా తెలిసిన స్నేహితులను సలహా అడగొచ్చు. మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారనే విషయం తెలిసిన మిత్రులు... మిమ్మల్ని ఎప్పుడూ సరైన దిశగానే ప్రోత్సహిస్తారు.
‣ వృత్తిపరంగా మీరు ఎవర్ని స్ఫూర్తిగా తీసుకోగలరో... ‘నేనూ వారిలా అవ్వాలి’ అనిపిస్తుందో గమనించండి. అదే మీ ‘డ్రీమ్ కెరియర్’ అయ్యే అవకాశం ఉంది.
‣ మీరు ఎంచుకునే పని మీరు బాగా చేయగలిగేది, అదే సమయంలో ఇష్టంగా చేసేది అయ్యుండాలి. అలా అనిపించినవన్నీ ఒకచోట రాసుకుని.. టాప్‌లో ఏం ఉన్నాయో చూడండి.
‣ కెరియర్ కౌన్సిలర్స్‌ను కలవడం ఉపయోగపడుతుంది. మీరు నిర్ణయం తీసుకోవడంలో వారి సలహాలు పనికొస్తాయి.
‣ డబ్బు విషయం పక్కన పెట్టేయాలి. ‘ఈ పని చేయడం నాకు ఇష్టం.. కానీ మరోటి చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది’ అనుకుంటే... జీవితాంతం రాజీ పడాల్సి వస్తుంది. జీవితంలో డబ్బు ముఖ్యమే. కానీ దానికోసం మన ఇష్టాఇష్టాలను పూర్తిగా తాకట్టు పెట్టాల్సిన పని లేదు. అలా అని జీతం కోసం పని విషయంలో రాజీపడతాను అనుకున్నా తప్పేమీ కాదు. అది పూర్తిగా
వ్యక్తిగత నిర్ణయం.
‣ కొందరు తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండటం, ఎక్కడా స్థిరంగా పనిచేయలేకపోవడం చూస్తుంటాం. చదివిన చదువుకూ, చేసే పనికీ సంబంధం ఉండదు. ఎందుకలా అని అడిగినప్పుడు ఎవరి కారణాలు వారికుంటాయి. కానీ దీనికి అసలు కారణం ఏంటి? సరైన సమయంలో సరైన అవగాహన లేకపోవడం. ఏ చదువు చదివితే ఎలాంటి కెరియర్ అవకాశాలు ఉంటాయి, ఆ పని ఎలా ఉంటుంది, మనకు నచ్చుతుందా లేదా అనే అంచనా లేకపోవడం. అలా అని ఉన్న ఉద్యోగాలన్నీ ఎలా ఉంటాయో, మనకు నచ్చుతాయో లేదో తెలుసుకోవడం అంత సులభం కాదు. అందుకే మన వ్యక్తిత్వాన్ని బట్టి మనకు ఏ పని నప్పుతుంది అని తెలుసుకోవడం మెరుగైన విధానం. దీనికోసం నిపుణులు కొన్ని విషయాలు చెప్పారు. వాటి గురించి తెలుసుకుంటే మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు.
1. అప్టిట్యూడ్ - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒక మాట అన్నారు.. ‘ప్రతి ఒక్కరూ జీనియస్‌లే. కానీ నువ్వో చేపను చెట్టెక్కమంటే అది తాను చేతకానిదాన్ని అనుకుంటుంది’ అని. ప్రతి ఒక్కరికీ కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. కెరియర్‌లో విజయం సాధించిన వారంతా తాము ఎక్కడ బలంగా ఉన్నారో తెలుసుకుని ఆ సామర్థ్యాలకు పదునుపెట్టినవారే. ఒకరు అంకెలతో ఆడేసుకోవచ్చు... అదే మరో వ్యక్తికి లెక్కలంటే చుక్కలు కనపడవచ్చు. ఒకరికి క్లిష్టమైన పదాలను నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపించవచ్చు. ఇంకొకరు అది హాబీలా సరదాగా చేసేయొచ్చు. ఏ పనినైనా నేర్చుకోవడం ఈ అప్టిట్యూడ్ తేడాల వల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది. అందువల్ల కెరియర్‌ను ఎంచుకునే ముందు ‘ఆప్టిట్యూడ్ ఎనాలిసిస్’ తప్పనిసరి.
2. పర్సనాలిటీ - ఓషన్ (OCEAN) అనేది మన వ్యక్తిత్వాన్ని సైద్ధాంతికంగా తెలుసుకునే ఒక పద్ధతి. ఇందులో O-ఓపెన్‌నెస్, C-కాన్షియస్‌నెస్, E-ఎక్స్‌ట్రావర్షన్, A-అగ్రీబుల్‌నెస్, N-న్యూరాటిసిజం (భావోద్వేగ అస్థిరత) అనే వాటిని సూచిస్తాయి. దాదాపు మానవ మనస్తత్వాలన్నీ ఈ ఐదింటిలో ఏదో ఒక కోవలోకి వస్తాయి. మీరు ఎందులోకి వస్తారనేది తెలుసుకోవడం ద్వారా మీకు ఎలాంటి కెరియర్ నచ్చుతుందో అంచనా వేయొచ్చు.
3. ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషంట్) - కొన్ని రంగాల్లో తెలివితేటలకు, సమయస్ఫూర్తికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్నింటిలో అనుభవానికి, అలవాటుపడటానికే ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల మన ఐక్యూ ఉద్యోగానికి సరిపోతుందా, లేదా... తీరా ఏదోలా జాబ్ తెచ్చేసుకుని చెయ్యలేక సతమతమవుతామా అనేది గమనించాలి.
4. ఈక్యూ (ఎమోషనల్ కోషంట్) - భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, అదుపులో ఉంచుకోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఊహించుకోండి... అర్జున్‌రెడ్డిలా ‘యాంగర్ మేనేజ్‌మెంట్’ తెలియని ఒక వ్యక్తి... ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మేనేజర్ అయ్యాడు అనుకోండి.. ఎంతో ఒద్దికతో చేయాల్సిన ఆ పని ఓపిగ్గా చేయగలడా?
మెంటర్‌ను ఎంచుకోండి..
కెరియర్‌లో ఒక మెంటర్‌ను ఎంచుకోవడం ఎవరికైనా మంచిది. కాలేజీలో అధ్యాపకులో, ఇంట్లో పెద్దవాళ్లో, బంధువుల్లో మిమ్మల్ని బాగా తెలిసినవారో, ఎవరో ఒకరు మిమ్మల్ని నడిపించే సారథి ఉండాలి. మీ వ్యక్తిగత అవసరాలకు తగినట్లు వారిచ్చే సలహాలు, సూచనల వల్ల మీరు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోగలరు.
ఇంటర్న్‌షిప్
ఇంటర్న్‌షిప్ పని అనుభవం కోసం మాత్రమే కాదు, ఆ పని మీకు నచ్చుతుందో లేదో తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఏదైనా సంస్థలో వాలంటీర్‌గా, ఇంటర్న్‌గా చేరడం ద్వారా ఆ పని గురించి మీకో అవగాహన ఏర్పడుతుంది. ఇండస్ట్రీ ఈవెంట్లు, వెబినార్లకు హాజరవ్వడం వల్ల కూడా ఆ రంగంతో మీకు పరిచయం పెరుగుతుంది.
ఏం చేయాలో తెలుసుకున్నారుగా...
ఇప్పుడు ఏం చేయకూడదో కూడా చూడండి.
జీతం, హోదా -
కొందరు పని నచ్చినా నచ్చకపోయినా మంచి జీతం వస్తుంది, పెద్ద హోదా దొరుకుతుందనే ఆలోచనతో ఉద్యోగంలోకి వెళ్లిపోతారు. తర్వాత కొన్నాళ్లకు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో జీతమా, సంతోషమా అనేది నిర్ణయించుకోగలగాలి. ఒకటి కోరుకుని ఎంచుకున్నప్పుడు... రెండోది లేదని బాధపడకూడదు. అది మీ నిర్ణయమేననే విషయం గమనించాలి.
ఫ్యామిలీ కెరియర్ - ‘మా ఇంట్లో అందరూ ఇంజినీర్లే..’, ‘మా ఇంట్లో అంతా టీచర్లే...’ అనుకుంటూ మీరూ అందులోకే వెళ్లడం సరికాదు. ఒకవేళ వెళ్లాలి అనుకున్నా... అందుకు కారణం మీ ఆసక్తి కావాలి కానీ అందరూ వాళ్లే ఉన్నారనే ఆలోచన కాకూడదు. ఒక వ్యక్తిగా మీకున్న బలాలు, ఇష్టాలే మీ కెరియర్‌ను ఎంచుకునేలా ప్రోత్సహించాలి.
ఒత్తిడి - ‘మా నాన్న చిన్నప్పుడు ఐఏఎస్ కావాలనుకున్నారు, ఆయన కాలేకపోయారని కనీసం నన్నైనా ఐఏఎస్‌గా చూడాలి అనుకుంటున్నారు...’ అనేలాంటి మాటలకు కాలం చెల్లిపోయింది. కుటుంబం ఏం అనుకుంటుంది, బంధువులు ఏం అనుకుంటారు, సమాజం ఎలా చూస్తుంది.. అనే ఆలోచనలు పక్కన పెట్టి ఎలాంటి ఒత్తిడీ లేకుండా మనకు నచ్చిన కెరియర్ మనం ఎంచుకోవాలి. ‘ఫ్రెండ్స్ అంతా ఆ కోర్సులో చేరుతున్నారు, నేనూ అందులోనే చేరతా’ అనే ధోరణీ సరికాదు.
ఎప్పుడూ ఒకేలా ఉండదు..
ఏ ఉద్యోగం అయినా చేరిన కొత్తల్లో ఉన్నట్టు చివరిదాకా ఉండదు. కొత్తలో మనం నేర్చుకునే ప్రక్రియలో ఉండటం వల్ల ప్రతిదీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కొంతకాలం గడిచాక అది రొటీన్ అయిపోయి ఇంతేకదా అనిపిస్తుంది. చాలామందికి ఉద్యోగం మారడానికి కుటుంబపరమైన ఒత్తిళ్లు, కంపెనీలో ప్రమోషన్ల తీరు, పనిచేసే బృందం వంటివి కారణాలు అవుతుంటాయి. ఒకప్పుడు ఉద్యోగం మారాలంటే ఎంతో ఆలోచించేవారు. కానీ ఇప్పటి యువత ఆ నిర్ణయాన్ని చాలా వేగంగా తీసేసుకుంటున్నారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారికంటే... పెళ్లికాని వారు ఇలా తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండటం గమనించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి బాధ్యతలు మొదలయ్యాక ఇలాంటి రిస్క్ తీసుకునే ఆలోచన చాలామందిలో తగ్గిపోతుంది. ఏదేమైనా ఒక ఉద్యోగం మనకు నచ్చుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి రిసెర్చ్ చాలా ముఖ్యం. ఇప్పటికే ఆ రంగంలో ఉండి, కనీసం పదేళ్లు పనిచేసిన సీనియర్లతో మాట్లాడితేనే దాని అసలు రూపు ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది.
‣ చదువు పూర్తిచేశాక ఏ కంపెనీలో చేరాలి అనుకుంటున్నామో ముందే దాని గురించి అన్నీ తెలుసుకోవాలి. జీతాలు, ఇంక్రిమెంట్లు ఎలా ఉంటాయి, పనితీరు కు తగిన గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సంస్థల నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు ఉద్యోగులు కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూలు ఇస్తుంటారు. వాటిని చూడటం వల్ల కొంత మేరకు అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనేది అవగాహన వస్తుంది.
‣ కళాశాలలో ప్రాంగణ నియామకాల సమయంలో వచ్చిన కంపెనీలో మనకు చేరే ఆసక్తి ఉంటేనే ఇంటర్వ్యూకి హాజరుకావాలి. లేదంటే తర్వాత వచ్చే సంస్థ మనకు నచ్చినా వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు.
‣ వచ్చే ఐదు పదేళ్లలో ఏ రంగం ఎలా ఉండబోతోంది, ఏ ఉద్యోగాలు ఎక్కువ లభిస్తాయనే వివరాలతో అంతర్జాతీయ సర్వేలు వస్తుంటాయి. వాటిని చూడటం కొంతమేరకు పనిచేస్తుంది.
‣ ఏ పనైనా జీవితకాలం చేసేటప్పుడు ఎంతోకొంత అసంతృప్తి సహజం. దాన్ని పూర్తిగా జీరో చేయలేం. కానీ వీలైనంత మేరకు పనిని మనం ఎంజాయ్ చేసేలా ప్రణాళిక వేసుకోవాలి.
చివరిగా... ఏ పనైనా మనం మొదలుపెట్టేవరకూ మనకు పూర్తిగా నచ్చుతుందో లేదో చెప్పలేం. అందువల్ల అన్నీ ఆలోచించి ఒక కెరియర్ ఎంచుకుని, పూర్తిగా దానికి కట్టుబడి, వంద శాతం శ్రమతో ప్రయత్నిస్తే... అందులో విజయం సాధించవచ్చు!
COMMENTS