ATM CASH STUCK 2022
ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తున్నప్పుడు డబ్బులు మధ్యలో ఇరుక్కుపోయాయా? పరిష్కారం ఏమిటి?
డబ్బులు విత్‌డ్రా చేసేందుకు చాలా మంది ఏటీఎంలకు వెళ్తుంటారు. కొన్ని కారణాల వల్ల డబ్బులు బయటకు వచ్చి అందులోనే ఇరుక్కుపోతాయి. అకౌంట్ నుంచి మాత్రం డెబిట్ అవుతాయి. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్న కుమార్ అనే వ్యక్తి ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంలో తన డబ్బు చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యాడు. అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి కానీ విత్‌డ్రా చేసిన మొత్తం ఏటీఎంలోనే ఉండిపోయింది. అతని చేతికి రాలేదు. అప్పటికే సమయం సాయంత్రం 7 అవుతుంది. బ్యాంకులు మూతపడ్డాయి. చేసేదేమి లేక మరుసటి రోజు ఉదయం ఏటీఎం స్లిప్‌తో బ్యాంకును సందర్శించారు. ఏటీఎంలో ఇరుక్కుపోయిన డబ్బు 5-7 రోజుల తర్వాత అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసేటప్పుడు పలురకాలైన ఇబ్బందులు తలెత్తడం సహజం. ఒక్కోసారి సర్వర్ డౌన్ కావడం వల్ల మీ డబ్బు ఆన్‌లైన్‌లో ఆగిపోతుంది. ఒక్కోసారి ఏటీఎం నుంచి డబ్బులు బయటకు రాగానే షట్టర్‌లోనే ఉండిపోతాయి. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొవచ్చు.
మరి ఇలా సమస్యలకు పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం.
ఏటీఎంలో డబ్బు చిక్కుకుపోయినప్పుడు ఏమి చేయాలి?: మెషిన్ షట్టర్‌లో నగదు మధ్యలో చిక్కుకుపోయినట్లయితే వాటిని బయటకు తీయడానికి సున్నితంగా లాగడం మినహా మీరు తక్షణమే చేయగలిగేది ఏమీ లేదు. డబ్బులను బలవంతంగా లాగేందుకు ప్రయత్నిస్తే నోట్లు చిరిగిపోతాయి. ఏటీఎం మెషిన్ మళ్లీ రన్ అయ్యేలా చేయడానికి మీరు మరొక విత్‌డ్రాను ప్రయత్నించవచ్చు. అలా చేసినట్లయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. అయినా డబ్బులు రాకపోతే వెంటనే బ్యాంకు బ్రాంచ్‌కు తెలియజేయండి.
బ్యాంకులో ఫిర్యాదు చేయండి: ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు సదరు బ్యాంకు బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయాలి. మీరు ఎప్పుడు విత్‌డ్రా చేశారనే తేదీ, సమయం బ్యాంకు సిబ్బందికి తెలియజేయాలి. లావాదేవీకి సంబంధించిన మీ మొబైల్‌కు వచ్చిన సందేశం స్క్రీన్‌షాట్ తీసుకోండి. డెబిట్ అయిన మొత్తం రషీదును తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. మీ బ్యాంకు స్టేట్‌మెంట్ డిజిటల్ రికార్డులను రూపొందించండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ పరిస్థితికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. వీటిని అనుసరించి, మీరు మీ డబ్బును పొందుతారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు వారంలోపు డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. లేని పక్షంలో మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. 30 రోజుల్లో బ్యాంకు నుంచి మీకు ఎలాంటి సమాధానం రాకపోతే బ్యాంకుకు రోజుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఏటీఎంలో ఇరుక్కుని పని చేయకపోతే ఏం చేయాలి?: ఒక వేళ మీ డెబిట్ కార్డు ఏటీఎంలో ఇరుక్కుపోయి ఇబ్బందులు తలెత్తితే వెంటనే కార్డును బ్లాక్ చేసి కొత్త కార్డు కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అనేక మార్గాలున్నాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం లేదా మీ స్థానిక బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
కార్డు ఏటీఎం మెషిన్‌లో సరిగ్గా పెట్టకుంటే ఏం చేయాలి?: కొందరికి ఏటీఎం మెషీన్‌లో కార్డు ఎలా పెట్టాలో తెలియదు. కార్డు తప్పుగా చొప్పించబడితే అది ఏటీఎంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. అందుకే ముందుగా లావాదేవీ రద్దు చేయబడిందని నిర్ధారించుకోండి. చాలా ఏటీఎంలు ఇప్పుడు కార్డ్ స్లాట్ కింద బటన్‌ను కలిగి ఉన్నాయి. మీరు కార్డ్‌ని తొలగించడానికి దాన్ని నొక్కితే సరిపోతుంది. ఏటీఎంలో ఇలాంటి బటన్ లేకపోతే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. ఇరుక్కుపోయిన కార్డును తిరిగి పొందవచ్చు. ఇలాంటి ఫిర్యాదులు చేసేందుకు బ్యాంక్ 24×7 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. సమస్యను వివరించండి.
COMMENTS