Top-Up Loan: When to take a top-up loan?
Top - Up Loan : టాప్ - అప్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి ?
ఆర్థిక అత్యవసర సమయాల్లో మన ముందున్న కొన్ని మార్గాల్లో టాప్-అప్ లోన్ ఒకటి. ఇప్పటికే ఉన్న గృహ రుణంపై మరికొంత మొత్తాన్ని తీసుకుంటే దాన్నే 'టాప్-అప్ రుణం' అంటారు.
ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు ఇటువంటి రుణాన్ని అందిస్తుంటాయి. అయితే, ఇది ఎప్పుడు తీసుకోవాలి? అర్హతలేంటి వంటి విషయాల్ని పరిశీలిద్దాం!
ఎప్పుడు తీసుకోవాలి?
అత్యవసర సమయాల్లో చాలా మంది వ్యక్తిగత రుణం తీసుకుంటారు. లేదంటే బంగారం వంటి ఇతర ఆస్తుల్ని విక్రయిస్తుంటారు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు టాప్-అప్ లోన్ తీసుకుంటే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. తాత్కాలిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఆస్తుల్ని అమ్మేస్తే మళ్లీ కొనడం అంత తేలిక కాదు! ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ఈ తరుణంలో తక్కువ సమయంలోనే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఒకసారి పోగొట్టుకున్న ఆస్తుల్ని తిరిగి సంపాదించుకోవడం కష్టతరంగా మారుతుంది. కాబట్టి, టాప్-అప్ లోన్ తీసుకోవడం అన్ని రకాలుగా మేలు చేస్తుంది. పైగా లోన్ ఉండడం వల్ల బాధ్యతగా వ్యవహరించి సకాలంలో తీర్చేందుకు ప్రయత్నిస్తాం!
టాప్-అప్‌లోనే ఎందుకు?
వ్యక్తిగత రుణంపై వడ్డీ అధికంగా ఉంటుంది. ఇప్పుడు గృహరుణంపై వడ్డీ రేట్లు చాలా వరకూ తగ్గాయి. తొలుత తీసుకున్న గృహరుణంతో పోలిస్తే దానిపై తీసుకున్న టాప్-అప్‌పై వడ్డీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ, వ్యక్తిగత, మోర్టగేజ్, బంగారం రుణంతో పోలిస్తే తక్కువే. క్రెడిట్-కార్డు రుణంతో పోల్చినా వడ్డీరేటు తక్కువగానే ఉంటుంది. హోంలోన్‌ని కచ్చితంగా ఇంటి నిర్మాణానికి లేదా కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి. అయితే, టాప్-అప్‌ని మాత్రం ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు.
అర్హతలేంటి?
ఇప్పటికే ఒక రుణం మీ పేరు మీద ఉన్నందున.. మరోసారి ప్రత్యేకంగా అర్హత కోసం బ్యాంకులు అడగవు. అయితే, తీసుకున్న మొదటి లోన్‌ను సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. ఈ సమయంలో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకూడదు. అప్పుడే టాప్-అప్ రుణాన్ని మంజూరు చేస్తారు.
టాప్-అప్ లోన్ ఫీచర్లు..
టాప్-అప్ లోన్ కాలపరిమితి సాధారణంగా 20 ఏళ్లు ఉంటుంది. లేదా ఒరిజినల్ లోన్ కాలపరిమితే దీనికీ వర్తిస్తుంది. ఇది బ్యాంకు, రుణగ్రహీతలను బట్టి మారుతుంటుంది. సాధారణంగా వడ్డీరేటు ఒరిజినల్ లోన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని బ్యాంకులు పాత వడ్డీరేటుకే టాప్-అప్ రుణాలను కూడా అందిస్తున్నాయి. ఇచ్చే మొత్తం కూడా బ్యాంకుని బట్టి మారుతుంటుంది. కానీ, ఒరిజినల్ లోన్, టాప్-అప్ లోన్ కలుపుకొని.. ప్రాపర్టీ విలువలో 70-80 శాతం మించకూడదన్న నియమం ఉంటుంది. డాక్యుమెంటేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒరిజినల్ లోన్‌కి ఇచ్చిన పత్రాలు ఎలాగూ బ్యాంకుల దగ్గర ఉంటాయి గనక కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మరోసారి అప్లికేషన్‌ను పూర్తి చేసి.. పాన్ కార్డు, ఆధార్ కార్డు నకలు ఇస్తే సరిపోతుంది. బ్యాంకులను బట్టి ఈ నియమం మారొచ్చు. సెక్షన్ 80సీ, 24బీ కింద పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉంది.
హోంలోన్‌పైనే కాకుండా ఇతర రుణాలపై కూడా టాప్-అప్ లోన్ ఇస్తుంటారు. కానీ, అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది! ఎందుకంటే హోంలోన్ కాకుండా ఇతర రుణాలపై వడ్డీ అధికంగా ఉంటుంది. మళ్లీ దానిపై టాప్-అప్ తీసుకుంటే వడ్డీ భారం మరీ ఎక్కువవుతుంది!
COMMENTS