Success Story: Three sisters who were selected for the job of constable at the same time.. Success story of farmers' children
Success Story: ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి పోలీస్ కానిస్టేబుల్(Police Constable) ఉద్యోగానికిఎంపికయ్యారు. ఆడపిల్లలకు చదువులు ఎందుకని వెక్కిరించిన వారి నోళ్లను మూయించారు తమిళనాడుకు చెందిన ముగ్గురు సిస్టర్స్. ఈ విజయంలో తమ తండ్రి కృషి ఎంతగానో ఉందంటున్న ఈ రైతు (Farmer) బిడ్డల సక్సెస్ స్టోరీ చూద్దాం.
తమిళనాడులోని రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు వెంకటేశన్‌కు ముగ్గురు కుమార్తెలు. పిల్లల చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో వారి బాధ్యతలు చూసుకున్నారు తండ్రి వెంకటేశన్. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను బాగా చదివించాడు. ఇప్పుడు ఈ ముగ్గురూ ఒకే రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
గ్రేడ్ II కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక
ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దమ్మాయి ప్రీతికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె వయసు 28 ఏళ్లు. ఈమె ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి చెప్పింది. ఇక రెండో అమ్మాయి వైష్ణవికి 25 ఏళ్లు. ఈమె ఇంగ్లిష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. మూడో అమ్మాయి నిరంజనికి 22 ఏళ్లు. ఈమె ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఏడాది తమిళనాడు యూనిఫాండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TNUSRB) నిర్వహించిన గ్రేడ్ II కానిస్టేబుల్ పరీక్షల్లో ఈ ముగ్గురు తోబుట్టువులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో వారి తండ్రి వెంకటేశం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
సక్సెస్‌కు కారణం తండ్రి
పెద్ద అమ్మాయి ప్రీతి మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాగా, రెండో అమ్మాయి వైష్ణవి నాలుగో ప్రయత్నం, చివరి అమ్మాయి నిరంజని మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించింది. 20 ఏళ్ల క్రితమే తమ తల్లి చనిపోవడంతో, తండ్రి వెంకటేశన్ తమను ఎంతో కష్టపడి చదివించాడని ఈ సిస్టర్స్ తెలిపారు. తమ సక్సెస్‌కు తండ్రే కారణమని గర్వంగా చెబుతున్నారు.
తండ్రి లక్ష్యం కూడా..
12వ తరగతి వరకు చదివిన వెంకటేశన్, గ్రేడ్ II పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు ఎన్నిసార్లు రాసినా క్లియర్ చేయలేకపోయాడు. అయితే తాను చేయలేనిది తన కూతుర్లు చేసి చూపించారని, దీంతో ఎంతో గర్వంగా ఉందని వెంకటేశన్ చెప్పుకొచ్చారు. అమ్మ చనిపోయాక నాన్న వ్యవసాయ పనులతో పాటు ఇంటి బాధ్యతలు తీసుకున్నాడని రెండో అమ్మాయి వైష్ణవి చెప్పుకొచ్చింది. దీంతో చదువుపై పూర్తి దృష్టి సారించామని, పోలీస్ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అయ్యామని ఈ సిస్టర్స్ చెప్పారు.
తిరువళ్లూరులో ట్రైనింగ్
మొదటి అమ్మాయి ప్రీతి తిరువళ్లూరు కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో ట్రైనింగ్ తీసుకుంటుంది. రెండో అమ్మాయి వైష్ణవి తిరువళ్లూరు జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డులో, మూడో అమ్మాయి నిరంజిని తిరువళ్లూరు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో శిక్షణ పొందుతున్నారు.
COMMENTS