World Teachers' Day
నేడు "ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం".. మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొన్ని విషయాలు.
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను ప్రశంసించడం, వారి నైపుణ్యాలను అంచనా వేయడం మరియు వాటిని మెరుగుపరచడం’’. దీనితో పాటు ఉపాధ్యాయులకు మరియు బోధనలకు సంబంధించిన సమస్యలను చర్చించుకోవడానికి ఒక అవకాశంగా పరిగణించడం కూడా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ లక్ష్యమే.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు(సెప్టెంబర్ 5)ని భారతీయులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5న ‘ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం’గా జరుపుతారు. దాదాపు 100 దేశాల్లో జరిగే ఈ వేడుక గురించి తెలుసుకుందాం.
‘సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తి అందిస్తాడు’ ఈ మాటల్లో ఎంతో వాస్తవం ఉంది. గురువుల బోధనలోనే విద్యార్థులు ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తొలి గురువు అమ్మే అయినప్పటికీ ప్రతి ఒక్కరికి తమ జీవితంలో స్ఫూర్తి నింపి, దిశా నిర్దేశం చేసిన గురువంటూ ఒకరుంటారు..వారందరూ అజన్మాంతం స్మరణీయులు. అందుకే మరి గురువులను పూజిస్తూ ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని దాదాపు 100 దేశాలు జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో 1994లో ఆక్టోబర్ 5వ తేదీని ‘వరల్డ్ టీచర్స్ డే’గా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గురువులున్నారు. అన్నె సలీవాన్, నాన్సీ ఎట్‌వెల్, హెలెన్ కెల్లెర్, అల్బర్స్ ఐన్‌స్టీన్, అరిస్టాటిల్, అయాన్ ర్యాండ్, గెలీలియో, న్యూటన్, పైథాగారస్, కన్‌ఫ్యూసియస్, సర్వేపల్లి రాధాకృష్టన్ మొదలైన వారంతా ఎంతోమందిని తీర్చిదిద్ది మరెంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దక్షిణామూర్తి, విశ్వామిత్రుడు, సాందీపుడు, పరుశురాముడు, ఆదిశంకరాచార్యులు, ద్రోణాచార్య, పరమహంస మొదలైనవారి గురుకృపతో ఎంతోమంది ధన్యజీవులైనారు. భారతదేశంలోనే కాదు దేశదేశాల్లో గురువుని ఎంతో గౌరవిస్తారు.
కన్‌ఫ్యూసియస్ పుట్టినరోజైన ఆగస్టు 27న చైనీయులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతారు. తొలిసారిగా ప్రైవేటు పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తిగా కనుఫ్యూసియస్ పేరును చెబుతారు. ఈయన విద్యార్థులకు సొంతగా పాఠాలు కూడా చెప్పేవారు. అంతేకాదు తత్వవేత్తగా పేరుపొందిన కన్‌ఫ్యూసియస్ అనేక విలువైన పుస్తకాలు కూడా రాశారు.
అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా వికలాంగుల సారథిగా పేరుపొందిన హెలెన్ కిల్లర్ ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు. కెల్లర్‌కు విద్యాబుద్ధులు నేర్పిన ఘనత అన్నా సలీవాన్‌దే. ఆ తర్వాత హెలెన్ ఎంతో సాధించింది. మహా వక్తగా, విశేష మానసిక శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం తను విద్యాబుద్ధులు నేర్చుకోవడమే.
ఇతర తేదీల్లో ...
➽ మలేషియాలో ‘హరిగురు’ పేరుతో మే 16న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతారు.
➽ వియత్నాంలో నవంబర్ 20న విద్యార్థులు ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి పువ్వులిచ్చి గౌరవిస్తారు.
హాంకాంగ్‌లో సెప్టెంబర్ 10న చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జాన్ కొమినస్ ప్రపంచ ఆధునిక విద్యాపితామహునిగా పేరుపొందారు. ఆయన పుట్టిన రోజు(మార్చి28)నే అక్కడ టీచర్స్ డే జరుపుతారు.
అల్బేనియా దేశంలో 1867 మార్చి 7న మొదటి పాఠశాలను స్థాపించి తొలి పాఠాలు బోధించారు. అందువల్ల ఈ దేశంలో మార్చి 7న ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకుంటారు.
➧ ఆస్ట్రేలియాలో- అక్టోబర్ ఆఖరు శుక్రవారం
➧ ఇండోనేషియాలో -నవంబర్ 25
➧ మలేషియాలో - మే 16
➧ సింగపూర్‌లో - సెప్టెంబర్ 1
యునైటెడ్ స్టేట్స్‌లో - మే మొదటి వారం
యూఏఈ, సౌదీ ఆరేబియా, ఈజిప్ట్, సిరియా, అల్జీరియా దేశాల్లో ఫిబ్రవరి 28న ఇలా వివిధ దేశాల్లో ఆ తేదీల్లో ఉన్న ప్రాధాన్యతను బట్టి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు.
COMMENTS