Money to Friends
money to friends: మీ ఫ్రెండ్ అప్పు తీసుకొని తిరిగివ్వట్లేదా?.. ఏం చెయ్యాలో మీకు తోచడం లేదా?.. మీ ముందున్న మార్గాలివే.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులను చేతనైనంత సాయం చేసి ఆదుకోవడం అభినందించదగ్గ విషయమే. ఫ్రెండ్‌కి తోడుగా నిలిచామన్న ఆత్మసంతృప్తినిస్తుంది. ఇక అప్పు తీసుకున్న వ్యక్తి అంతే గౌరవంతో తిరిగి డబ్బు చెల్లిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ డబ్బు ఇవ్వకుండా పేచీలు పెడితే అది నిజంగా బాధపెడుతుంది. ఇలాంటోళ్లకు ఎందుకు సాయం చేశామా అనిపిస్తుంది. ఇచ్చిన డబ్బు చేతికందక.. ఏం చెయ్యాలో తోచక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటివారు తమ ముందున్న అన్ని అవకాశాలను పరిశీలించుకోవాలి. సామరస్యంగా మాట్లాడడం లేదా తెలిసినవారితో చెప్పించడం వంటి మార్గాలున్నాయి. అయినా పనవ్వకపోతే చట్టబద్ధ చర్యలు కూడా ఉపక్రమించవచ్చు. ఆ మార్గాలేంటి, ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలు మీరూ తెలుసుకోండి.
సామరస్య మార్గాలివీ..
మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వ్యక్తులు ఇంకెవరైనా అప్పు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందిపెడుతుంటే సామరస్యంగా మాట్లాడి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం చేయండి. డబ్బు తీసుకున్న వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఒకేసారి చెల్లించలేని స్థితిలో ఉంటే ఈఎంఐల రూపంలో చెల్లించమని అడిగి చూడండి. ఒకవేళ మీరు కూడా తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే మీ అవసరాన్ని తెలియజేసి డబ్బులు అడిగి చూడండి. అలా చేయడం వల్ల అతడి ఉద్దేశ్యం ఏంటో అర్థమైపోతుంది. ఇక మరోమార్గం ఏంటంటే ఇద్దరికీ తెలిసిన వ్యక్తుల ద్వారా డబ్బులు అడిగించాలి. వేరే వ్యక్తులతో అడిగించడంతో అప్పు తీసుకున్న వ్యక్తిపై ఒకింత ఒత్తిడి పెరుగుతుంది. మీకు డబ్బు తిరిగి చెల్లించడంపై ఆలోచించే అవకాశాలు ఉంటాయి.
లీగల్ ఆప్షన్స్ ఇవే..
ఫ్రెండ్ లేదా బంధువు లేదా తెలిసిన వ్యక్తి అప్పు తీసుకుని ఏడాది గడుస్తున్నా ఇంకా తిరిగిచ్చే ఉద్దేశ్యం కనిపించకపోతే మీరు చట్టబద్ధ చర్యలు తీసుకోవచ్చు.లీగల్ నోటీసు పంపించండి: లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపించడం ద్వారా చట్టబద్ధ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నోటీసుల్లో పేర్కొన్న గడువులోగా అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నోటిస్ పిరియడ్‌లోగా చెల్లించకుంటే చట్టబద్ధ చర్యలు తీసుకోవచ్చు.ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యొచ్చు: విశ్వాసఘాతుక నేరంగా పేర్కొంటూ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ఐపీసీలోని 406, 420 సెక్షన్ల కింద కేసులు పెట్టొచ్చు. పోలీసులు జోక్యం చేసుకుంటే డబ్బు చేతికొచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
డబ్బు రికవరీ కోసం సివిల్ సూట్:
లీగల్ నోటీసులకు అప్పు తీసుకున్న వ్యక్తి స్పందించకపోతే.. డబ్బు రికవరీ కోసం మీ లాయర్ ‘సివిల్ సూట్’ దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. అన్ని మార్గాలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ లీగల్ నోటీసు అంశాన్ని పరిశీలించడం మంచిది.
ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే..
మీ ఫ్రెండ్ అప్పు ఇచ్చిన విషయాన్ని చట్టబద్ధంగా నిరూపించడం ఒకింత సంక్లిష్టంగా మారొచ్చు. ఎందుకంటే మాట మీద ఇస్తారు కాబట్టి ఆధారాలేవీ కనిపించవు. కానీ కేసులో ఆధారాలు చాలా ముఖ్యమవుతాయి. అలాంటప్పుడు మీ ఫ్రెండ్‌తో ఫోన్ సంభాషణ రికార్డింగ్స్‌ని కోర్టులో సమర్పించొచ్చు. మీ ఫ్రెండ్‌కి చెక్కు లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ రూపంలో డబ్బు ఇచ్చుంటే ఆ రికార్డులను కూడా ఆధారాలుగా చూపించవచ్చు. తద్వారా కేసులో మీరు పైచేయి సాధించవచ్చు
COMMENTS