అబ్బా.. ఈ పిల్లలతో చస్తున్నాం.. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు.. అనే వారికి 10 వండర్ ఫుల్ టిప్స్
ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే సందడి సందడిగా ఉంటుంది. వస్తువులను చిందరవదరం చేయడం, కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసుకోవడం వంటివి ప్రతి ఇంట్లో సర్వసాధారణం. పిల్లలు పెరిగి పెద్ద అయ్యేవరకు ఈ వైరం కొనసాగితే ఇద్దరి మధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒకరినినొకరు శత్రువులా భావించుకోవచ్చు. ప్రధానంగా టీవీ చూసేటప్పుడు, చదువు, ఆటలు, వస్తువులు, బట్టలు వంటి విషయాల్లో తోబుట్టువుల మధ్య వైరం ఉంటుంది. దీంతో పిల్లలను అదుపులో పెట్టడానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తోబుట్టువుల మధ్య వైరం తగ్గించడానికి టిప్స్:
- పిల్లల చర్యలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తుండాలి. అయితే ప్రతి చిన్న విషయానికి మీరు స్పందించ కూడదు. ఇద్దరి మధ్య సమస్య తీవ్రంగా ఉంటేనే జోక్యం చేసుకోండి. అయితే కోపం ప్రదర్శించకండి. అది పరిష్కార మార్గం కాదు. ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి.
- ఏ విషయంలోనైనా ఒకరిని మరొకరితో అసలు పోల్చకండి. సాధారణంగా చదువు విషయంలో ఈ పరిస్థితి ఉంటుంది. బాగా చదివే వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సరిగా చదవని వాడిని పట్టించుకోకపోవడం లాంటివి అసలు చేయొద్దు. పిల్లలు పెరిగి పెద్దవారైనా ఈ వైరం అలానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరిని తల్లిదండ్రులు సమానంగా చూడండి.
- ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అసలు గొడవపడకూడదు. ఏదైనా విషయంలో పిల్లలు కూడా అలానే ప్రవర్తించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే విధానం వారి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది.
- పిల్లల మధ్య లేబుల్స్, వర్గీకరణను నివారించండి. ఒక పిల్లవాడు గ్రౌండ్‌కు వెళ్లాలని ఇష్టపడితే మీరు వారితో వెళ్లండి. మరో పిల్లవాడు బేకింగ్‌ను ఇష్టపడితే, దానికి సంబంధించిన వివిధ వంటకాలను చేయడానికి ప్రయత్నించండి. ఇలా వారి అభిరుచులకు సమాన ప్రాధాన్యత ఇవ్వండి. ఇది ఇద్దరి మధ్య పోటీని తగ్గించడంలో సహాయపడుతుంది.
- కుటుంబ సభ్యులు ఒకరికొకరు వ్యక్తిగతంగా గౌరవించుకునేందుకు ప్రోత్సహించాలి. ఇందు కోసం హోమ్ రూల్‌ను రూపొందించండి. కుటుంబ విందులు, బోర్డ్ గేమ్స్ ఆడటం, పార్క్‌లో సమయం గడపడం, క్రీడల్లో పాల్గొనడం, సినిమాలు చూడటం వంటివి పిల్లల్లో బంధాలను ఏర్పరచుకోవడానికి, మధురమైన జ్ఞాపకాలను పంచుకోవడానికి అద్భుతమైన సాధానాలు. దీంతో పిల్లలు ఒకరితో ఒకరు పోట్లాడుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. పైగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కారణంగా మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
- ఇద్దరికి ఒకే వస్తువు కావాలనప్పుడు గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఒకరికి ఆ వస్తువును ఇచ్చి, మరొకరికి తన అభిరుచికి తగ్గట్టు మరో వస్తువు ఇవ్వడానికి ప్రయత్నించండి.
- పిల్లలు పొట్లాడుకున్నప్పుడు తప్పు ఎవరూ చేశారో నిర్ధారించడం మానేయండి. ఒకరి పక్షాన నిలబడానికి ప్రయత్నించవద్దు. తప్పు ఎవరు చేశారో వేలు ఎత్తి చూపకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయండి.
- భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించండి. మరింత నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి.
- తోబుట్టువుల మధ్య వివాదానికి శిక్ష విధించాల్సిన అవసరం ఉన్నట్లయితే, అది ఇంట్లో అందరి ముందు చేయవద్దు. అలా చేస్తే మరో తోబుట్టువు ముందు అతను ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు.
- ఇంట్లో పిల్లల మధ్య వివాదాలు రాకుండా ఉండటానికి అందరికీ ఆమోదయోగ్యమైన రూల్స్ రూపొందించండి. అందరూ వీటికి తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోండి.
COMMENTS