Price history : ఆఫర్లో నిజంగా ఎంత తగ్గింది ? ప్రైస్ హిస్టరీ తెలుసుకునే విధానం.
దసరా, దీపావళి వచ్చిందంటే ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆఫర్లే ఆఫర్లు. ఫలానా ఉత్పత్తులపై 40 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్లు వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి.
సాధారణంగా ఈ సేల్స్‌లో చాలా వరకు ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందిస్తుంటాయి ఇ-కామర్స్ సంస్థలు. కొన్ని వస్తువులపై మాత్రం పెద్దగా తగ్గింపు ఉండదు. కానీ వాటినీ తక్కువకే ఇస్తున్నామని ప్రకటించడంతో సేల్స్‌లో తక్కువ ధరకే కొన్నామని సంబరపడుతుంటారు కొందరు. ఉదాహరణకు గతేడాది విడుదలైన ఓ మొబైల్ అప్పట్లో రూ.40 వేలు ఉందనుకుందాం. అయితే, దాన్ని తాజా సేల్స్‌లో రూ.30వేలకే విక్రయిస్తామని చెబుతుంటారు. వాస్తవానికి ఆ ఫోన్ ధర ఓ మూడు నెలల క్రితమే తగ్గించి విక్రయించి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ సేల్‌లో ఆ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. తక్కువకు ధరకు కొనుగోలు చేశామన్న సంతోషమే తప్ప వాస్తవంలో మీరు డిస్కౌంట్‌లో కొన్నట్లు కాదు. ఒకవేళ మీరు ఏదైనా వస్తువును సేల్‌లో కొనుగోలు చేయాలంటే దాని ప్రైస్ హిస్టరీ తెలుసుకోవడం మంచిది.
మరి దాన్ని తెలుసుకోవడం ఎలా?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఈ నెల 23 నుంచి సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ సేల్స్‌లో పాల్గొనే ఉద్దేశం ఉంటే.. మీరు కొనాలనుకుంటున్న వస్తువు ప్రైస్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎక్స్‌టెన్షన్‌ను వాడాల్సి ఉంటుంది. ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు వేర్వేరుగా ఉంటాయి. ఒకసారి ఈ ఎక్స్‌టెన్షన్‌ను మీ బ్రౌజర్‌కు యాడ్ చేశాక.. సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ కింద ఆ వస్తువు ప్రైస్ హిస్టరీ తెలుసుకోవచ్చు. అయితే, డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో మాత్రమే తెలుసుకునే వీలుంది. యాప్‌లో తెలుసుకునే వసతిలేదు.
అమెజాన్ వెబ్‌సైట్‌లో ఏదైనా వస్తువు ప్రైస్‌హిస్టరీ తెలుసుకోవాలంటే కీపా (keepa) అనే ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లకు ఈ ఎక్స్‌టెన్షన్ అందుబాటులో ఉంది. వీటిని ఒకసారి మీ బ్రౌజర్‌కు యాడ్ చేసిన తర్వాత ప్రొడక్ట్‌ను ఓపెన్ చేసినప్పుడు కాస్త దిగువ భాగంలో ఓ ఛార్ట్ దర్శనమిస్తుంది. అందులో ఏ రోజు ఎంతెంత ధర ఉందో తెలుసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లోనూ మీరు ఏదైనా వస్తువు ప్రైస్ హిస్టరీ తెలుసుకోవాలంటే అందుకు ప్రైస్ ట్రాకర్ (Price tracker) అనే ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. గూగుల్ క్రోమ్ యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. ఒకసారి యాడ్ చేశాక.. ఫ్లిప్‌కార్ట్‌లో సైన్-ఇన్ అయ్యి మీకు కావాల్సిన ఉత్పత్తి ప్రైస్ హిస్టరీని తెలుసుకోవచ్చు. అమెజాన్ తరహాలో ఇక్కడ కూడా గ్రాఫ్ కనిపిస్తుంది. ఇందులో ఇంకో సదుపాయం కూడా ఉంది. మీరు ఫలానా స్థాయికి వస్తువు ధర దిగి వచ్చినప్పుడే కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే. అందుకు అనుగుణంగా మీరు నోటిఫికేషన్ వచ్చేలా ఏర్పాటు కూడా చేసుకునే వీలుంది.
ఈ రెండూ కాకుండా ప్రైస్ హిస్టరీ.కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా కూడా ప్రైస్ హిస్టరీ తెలుసుకునే వీలుంది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వస్తువు లింక్‌ను అక్కడి సెర్చ్ బాక్స్‌లో వేస్తే మీకు అక్కడ గతంలోని ధరల వివరాలు దర్శనమిస్తాయి.
COMMENTS