ప్రపంచ ఆర్త్థ్రెటిస్ దినోత్సవం
నేడు ప్రపంచ ఆర్త్థ్రెటిస్ దినోత్సవం--12 October
మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!
ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్! అంటే కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో ఓ విపత్తు తలెత్తటమన్న మాట. ఇది కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు. దాన్ని ఆస్టియో ఆర్త్థ్రెటిస్ అంటారు. ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ఇదే. ఇక ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్ ఆర్త్థ్రెటిస్ అంటారు. సొరియాసిస్ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్ ఆర్త్థ్రెటిస్ అంటారు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్ ఆర్త్థ్రెటిస్ అంటారు. చికున్‌గన్యా వంటి వైరల్ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్ రియాక్టివ్ ఆర్త్థ్రెటిస్ అంటారు. ఇలా కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన కారణంతో వచ్చే కీళ్ల నొప్పులు! వీటికి భిన్నంగా... స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద సమస్య... రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్! కీళ్లవాతం!!
ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకూ తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే.. కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరక ప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య! దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే 'ప్రపంచ ఆర్త్థ్రెటిస్ దినం' సందర్భంగా ఈ కీళ్లవాతానికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!
మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. దీని పేరు 'రోగ నిరోధక వ్యవస్థ'. మనం వ్యాధుల బారినపడకుండా.. ఎటువంటి సూక్ష్మక్రిములూ మనపై దాడి చెయ్యకుండా నిరంతరం పహారా కాస్తుందీ వ్యవస్థ. రేయింబవళ్లు ఈ బాధ్యతలను ఇది అద్భుతంగా నిర్వర్తిస్తుంటుంది. కానీ.. ఒక్కోసారి ఇది పొరబడుతుంది! ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతూ.. ఏకంగా మన శరీర భాగాల మీదే దాడి చేసేస్తుంది. ఫలితమే రకరకాల 'ఆటో ఇమ్యూన్' సమస్యలు. కీళ్లవాతం.. రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్ కూడా ఇలా తలెత్తే సమస్యే!
ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువైన 'సైనోవియం' పొరను చూసి.. దాన్ని హానికారక శత్రువుగా పొరబడి... దానిపై దాడి చేసి దెబ్బతీయటం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పుల వంటి బాధలన్నీ ఆరంభమవుతాయి. అయితే ఇది ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఎవరిలో ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతుందో చెప్పటం కష్టం. ఇప్పుడిప్పుడే దీని వెనక ఉన్న జన్యుపరమైన, జీవనశైలీ పరమైన కారణాలను అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి దీన్ని ఎంత త్వరగా.. వీలైతే ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవటం, సాధారణ జీవితం గడపటం సాధ్యమవుతుంది.
నిర్ధారణ ఎలా?
రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్ విషయంలో రక్త పరీక్షల వంటివాటి కంటే కూడా వైద్యుల విచక్షణకే ప్రాధాన్యత ఎక్కువ. లక్షణాల తీరు, కొన్ని పరీక్షల సహాయంతో వైద్యులే కచ్చితంగా నిర్ధారిస్తారు.
* రక్తపరీక్ష: రక్తంలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ (ఆర్‌ఏ ఫ్యాక్టర్) ఎలా ఉందో చూస్తారు. ఆరంభ దశలో ఇది 75% మందిలో పాజిటివ్‌గా ఉంటుంది. నెగిటివ్‌గా వచ్చినవారికి కొన్నాళ్ల తర్వాత మళ్లీ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
* సీసీపీ యాంటీబాడీస్: వ్యాధి లక్షణాలు స్పష్టంగానే కనబడుతున్నా రక్తంలో 'ఆర్‌ఏ ఫ్యాక్టర్' నెగిటివ్ ఉన్న వారికి ఈ పరీక్ష అవసరం. ఇది పాజిటివ్ వస్తే కీళ్లవాతం ఉన్నట్టు బలంగా భావించాల్సి ఉంటుంది.
* ఈఎస్‌ఆర్, సీఆర్‌పీ: ఇవి కీళ్లవాతం బాధితుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హెమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు.
* వీటికి తోడు వాచిన కీళ్లకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటివీ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.
నాలుగంచెల మందులు
కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. కానీ దీనికి సమర్థమైన చికిత్స ఉంది. దీనికి ఇచ్చే మందులను నాలుగు రకాలుగా విభజించొచ్చు.
1. నొప్పి నివారిణి మందులు: 'నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ' రకం నొప్పి నివారణ మందుల్లో బ్రూఫెన్, నేప్రోసిన్, నిముసులైడ్, ఓవరాన్ వంటివి కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్, ట్రెమడాల్ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు.
2. కార్టికో స్టిరాయిడ్స్: ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే (అంటే కీళ్లవాతం తగ్గేందుకు ఇచ్చే దీర్ఘకాలిక మందుల ప్రభావం మొదలయ్యే వరకూ) ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో రెండు మూణ్నెల్లు మాత్రమే సిఫార్సు చేస్తారు.
3. వ్యాధి నియంత్రణ మందులు: 'డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్'గా పిలిచే ఈ మందుల్లో ముఖ్యమైనది- 'మిథోట్రెక్సేట్'. ఇది వాస్తవానికి క్యాన్సర్‌కు వాడే మందు కావటంతో దీనిపై ఎన్నో అపోహలున్నాయి. కానీ.. ఇది కీళ్లవాతం చికిత్సల్లో బాగా పనికొస్తుంది. క్యాన్సర్ బాధితులకు దీన్ని పెద్దమోతాదులో ఇస్తే వీరికి చాలా స్పల్ప మోతాదుల్లో, అదీ వారానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మెథోట్రెక్సేట్‌ను జాగ్రత్తగా వాడితే ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు.
* సల్ఫాసలజైన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, లిఫ్లునోమైడ్, ఎజెతోయాప్రిన్ వంటివి కూడా కీళ్లవాతం చికిత్సలో ఉపయోగపడతాయి.
* ఈ మందులు వాడేటప్పుడు పరిస్థితి మెరుగవుతోందా? లేదా? దుష్పరిణామాలేమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు పరీక్షిస్తుంటారు. సాధారణంగా 4-6 నెలల్లో వ్యాధి చాలావరకూ నిదానిస్తుంది.
* కీళ్లవాతం ఎలా తగ్గుముఖం పడుతోందన్నది ఎప్పటికప్పుడు 'డాస్ 28 స్కోర్' ఆధారంగానూ, ఈఎస్‌ఆర్, 'పేషెంట్ జనరల్ గ్లోబల్ స్కోర్' ఆధారంగా తరచూ అంచనా వేస్తుంటారు.
4. బయోలాజికల్స్ చికిత్స: కొత్తతరం ఖరీదైన మందులివి. ఎంబ్రెల్, రెమికేడ్, ఒరన్షియా, రిటుక్సిమబ్ వంటి ఈ బయోలాజికల్ మందులను ఇంజక్షన్ రూపంలో చర్మం కిందకు గానీ, రక్తనాళంలోకి గానీ ఇస్తారు. దీంతో సమస్య నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఫలితాలు చాలా బాగుంటాయి. గానీ వీటికి అయ్యే ఖరీదు చాలా ఎక్కువ. ఒకవేళ వీటిని వాడాక కొన్నాళ్ల తర్వాత వ్యాధి తిరిగి విజృంభిస్తే మళ్లీ 'డిసీజ్ మోడిఫికేషన్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్'తో చికిత్స చేస్తారు.
కీళ్లవాతం అంతా ప్రత్యేకమే
* సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పులైతే శరీరంలోని ఏదో ఒకవైపు కీలుకు మాత్రమే వస్తాయి. కానీ రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమచేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు.
* కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారిలోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. ప్రతి నలుగురు కీళ్లవాతం బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు.
* కీళ్లవాతం.. సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవుతుంది.అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీమోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. (అదే కీళ్లు అరిగిపోవటం వల్ల వచ్చే ఆస్టియో ఆర్త్థ్రెటిస్ సాధారణంగా మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లతో మొదలవుతుంది)
* కీళ్లవాతం కొంతకాలం ఉద్ధృతంగా ఊపేస్తుంది. బాధలు తీవ్రతరమవుతాయి. మరికొంత కాలం నెమ్మదిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. మధుమేహం, హైబీపీల్లాగా ఇదీ దీర్ఘకాలిక సమస్య, దీనికి చికిత్స కూడా దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది.
* కీళ్లవాతంలో ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఇలా కనీసం గంటకు పైగా బాధపడాల్సి ఉంటుంది. మిగతా కీళ్ల నొప్పులకూ, రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్‌కూ ఇదే ప్రధానమైన తేడా. అలాగే వీరిలో రాత్రి నొప్పులూ ఎక్కువ. కదులుతూ కాస్త అటూఇటూ తిరుగుతుంటే నొప్పి తగ్గినట్టుంటుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి, బాధ ఎక్కువ అవుతాయి.
రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్ దీర్ఘకాలిక సమస్య. కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు, చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉద్ధృతంగా ముంచుకొస్తుంది. మందులు తీసుకుంటుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు.
రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్ విషయంలో ఎటువంటి పథ్యాలూ లేవు. విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది.
* వ్యాయామం కీలకం కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బాధలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్, యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. బరువులు ఎత్తటం మాత్రం చేయకూడదు.
* రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్ బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు.
* లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు. మందులు వాడుకుంటూ పూర్తి సాధారణ జీవితం గడపొచ్చు. కాకపోతే 'మిథోట్రెక్సేట్' తరహా మందులు వాడుతున్నప్పుడు గర్భం మాత్రం ధరించకూడదు. ఆ మందు ఆపేసిన తర్వాత.. 3 నెలలు ఆగి అప్పుడు మాత్రమే గర్భధారణకు ప్రయత్నించాలి. అవసరమైతే గర్భిణీ సమయంలో తక్కువ డోసులో స్టిరాయిడ్లు వాడొచ్చు.
కీళ్లవాతం లక్షణాలేమిటి?
* జాయింట్లు ఎర్రగా వాచిపోయి నొప్పి
* ముట్టుకుని చూస్తే వేడిగా ఉండటం
* కీలు కదలికలు కష్టంగా తయారవటం
* ఉదయం లేస్తూనే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండటం
* ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు.
వీటికి తోడు...
* చాలామందిలో రక్తహీనత
* ఆకలి సరిగా లేకపోవటం
* నిస్సత్తువ, బరువు తగ్గిపోతుండటం
* బాధలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కొద్దిపాటి జ్వరం
* మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బుడిపెలు (రుమటాయిడ్ నాడ్యూల్స్) ఉండొచ్చు. ఇవి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
* ఎక్కువ కీళ్లు వాచటం, రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావటం, నొప్పి.. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువకాలం ఉంటే దాన్ని కీళ్లవాతం అని అనుమానించాలి.
వదిలేస్తే... విష వలయం!
కీళ్లవాతాన్ని అరుదైన సమస్యగా భావిస్తుంటారు గానీ ఇది చాలామందిలో కనిపిస్తుంది. మన జనాభాలో సుమారు ఒక శాతం మంది దీంతో బాధపడుతున్నారు. కానీ చాలామంది దాన్ని కీళ్లవాతంగా గుర్తించలేక.. ఏదో మామూలు కీళ్లనొప్పులేనని భావిస్తూ.. సమస్య ముదిరిపోయే వరకూ తాత్సారం చేస్తున్నారు. దీన్ని సత్వరం గుర్తించి చికిత్స చేయటం ఎంతో అవసరం. లేకపోతే పరిస్థితి ప్రాణాంతక సమస్యలకూ దారి తీస్తుంది.
* కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్నకొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.
* రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ముంచుకొచ్చే అవకాశమూ ఎక్కువే. కీళ్లవాతాన్ని సరిగా నియంత్రించుకోకపోతే- వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. కీళ్లవాతాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే ఈ దుష్ప్రభావాల బెడద ఉండదు. లాలాజల గ్రంథులు దెబ్బతింటే నోరు ఎండిపోతుంది. దీంతో పిప్పిపళ్లు వచ్చి, త్వరగా దంతాలు వూడిపోతాయి. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవటం వంటివీ మొదలవుతాయి. చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతిని న్యూరోపతీ రావొచ్చు.
* వ్యాధి ఉద్ధృతంగా ఉన్నప్పుడే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి ఉద్ధృతి తగ్గితే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే వీడకుండా చికిత్స, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం.. ఉత్తమం!
COMMENTS