Mehar Baba Birthday
ఈ రోజు (ఫిబ్రవరి 25 న) -మెహర్ బాబా జయంతి- గురించి తెలుసుకుందాము
మెహర్ బాబా జయంతి,Mehar Baba birth day-- 1894 ఫిబ్రవరి 25న ...
ధర్మం అడుగంటుతున్నప్పుడల్లా ఎవరో ఒక మహానుభావుడు భూమ్మీద జన్మించి పడిపోతున్న ధర్మాన్ని లేవనెత్తుతూనే ఉన్నాడు. మహావిష్ణువు దశావతారాలను ధరించిందీ ఇందుకే. అయితే, జగతి పరిణామక్రమంలో యుగాలు మారుతున్న కొద్దీ భగవం తునికీ మనిషికీ మధ్య అంతరం పెరిగిపోతోందేమో ననిపిస్తుంది.
త్రేతాయుగంలో మనిషనేవాడు ఎలా ప్రవర్తించాలో స్వయంగా తానే ఆచరించి చూపించాడు పరమాత్మ. అదే ద్వాపరంలో దగ్గరుండి నరుని చేత చెప్పి చేయించాడు. మరీ కలియుగంలో అప్పటి మాదిరిగా చేసి చూపించేవాడూ లేడు. చెప్పి చేయించేవాడూ లేడు. దీన్నిబట్టి చూస్తే భగవంతుడు కూడా మానవలోకంపై చిన్న చూపు చూశాడేమోనని పిస్తుంది. చాలామంది ఇక్కడే పొరపడుతుంటారు. నిజంగా భగవం తునికి మానవుడంటే ఎప్పుడూ చిన్నచూపు లేదు. ఇది కేవలం మనిషి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు మాత్రమే.
అహంభావం తప్ప ఆత్మార్పణం, అనుమానం తప్ప విశ్వాసం, తప్పించుకోవడం తప్ప అంకితభావం లోపించిన మనిషికి పరమాత్మ దర్శనం లభించమంటే ఎలా లభిస్తుంది? నిలువెల్లా స్వార్థాన్ని పులుము కుని నడవడమే తప్ప నిజాయితీగా ఎదుటివాణ్ని చూడడం ఎప్పుడైతే మానేసాడో అప్పుడే దైవంకూడా మనిషికి దూరంగా జరిగిపోయాడు. మానవ సేవే మాధవ సేవ అన్న విషయాన్ని విస్మరించిన మరుక్షణమే మనిషిలోని మాధవుడు కనుమరుగై వట్టి మనిషి మాత్రమే మిగిలాడు.
అలాంటి ఈ మనిషిని మామూలు మనిషిగానైనా మిగిల్చేందుకు కలియుగంలో ఇప్పటికి ఎందరో మహానుభావులు ప్రయత్నించారు. అలాటి మహిమాన్వితుల్లో అవతార్ మెహర్ బాబా ఒకరు. 1894 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలోని పూనేలో పుట్టిన మెహర్ బాబా మనిషి లోని స్వార్థభూతాన్ని తరిమికొట్టేందుకెంతగానో ప్రయత్నించారు. అందులో భాగంగానే అన్ని బంధా లకూ, పతనానికి హేతువైన నేనూ, నాదనే స్వార్థాన్ని వీడండి. నిన్ను నేవు ప్రేమింటుకున్నట్టే తోటి మనిషినీ ప్రేమించమని, అప్పుడే పరమాత్మకు మనం చేరువవు తామని చాటిచెప్పాడు. ఆధ్యాత్మికత మనిషిని పరమోన్నతమైన మార్గానికి తీసుకువెళ్ళే ఆలంబన కావాలని దిశానిర్దేశనం చేశాడు.
పరవారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందన్నాడు. ఇతరులకు చెడు చెయ్యక పోవడమే మనం చేయగలిగే మంచి అన్నాడు. భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని ప్రకటించాడు మెహర్ బాబా. విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనకు తాను సమర్పణం చేసుకోగలిగే నిజాయతీ గుణాలున్న వారంటేనే దైవం మెచ్చుకుంటాడన్నారు.
మనమేదైతే పూర్తిగా విశ్వసిస్తామో దాన్నే ఆచరించాలని, పరులమెప్పు పొందాలనో, తన గొప్పతనం ఇతరులు గుర్తించాలనో ఆర్భాటాలకూ, అట్టహాసాలు ప్రదర్శించేవారికి పరమాత్మ ఎప్పుడూ దూరంగానే ఉంటాడని చెప్పారు బాబా.
భగవంతునికీ, మనిషికి దగ్గరితనం పెంచేందుకు మనలో ఒకనిగా నడయాడిన బాబా చివరకు 1969 జనవరి 31న దైవంలో కలిసిపోయాడు. ఇప్పటికీ ఆయన భౌతికసమాధి (మహారాష్ట్రలోని అహమ్మదనగర్ దగ్గర మెహరాబాద్‌లో ఉంది) నుండి ఎంతోమందిని దైవానికి చేరువచేసే ఆ దివ్య సందేశం వినిపిస్తూనే ఉంటుంది. మనం ధర్మంగా నడిచేందుకు మహనీయులు చెప్పింది సవ్యంగా ఆచరిస్తే చాలు. మనీషిగా కాకపోయినా కనీసం మనిషిగా నైనా మిగులుతాం.
COMMENTS