Credit Card: Want to take an add-on credit card? Do you know these things?
Credit Card: యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా?
క్రెడిట్ కార్డుకు (Credit card) అనుబంధంగా మరో క్రెడిట్ కార్డు తీసుకుంటే దాన్ని యాడ్ -ఆన్ క్రెడిట్ కార్డు (Add-on credit card) అంటారు. ఈ కార్డుల విషయంలో చెల్లింపు బాధ్యత ప్రాథమిక కార్డు హోల్డర్‌పైనే ఉంటుంది. ఈ విషయాన్ని కార్డు హోల్డర్‌కు తెలియజేయాలని, స్పష్టమైన అవగాహనతోనే కార్డులు జారీ చేయాలని ఆర్‌బీఐ కార్డు జారీ సంస్థలకు గతంలోనే సూచించింది. ఇంతకీ ఈ కార్డులు దేనికోసం? ఎవరు తీసుకోవచ్చు? ఎన్నికార్డులు తీసుకోవచ్చు? వంటి వివరాలు తెలుసుకుందాం..
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ అంటే..?
ఇప్పటికే ప్రైమరీ/స్టాండర్డ్ క్రెడిట్ కార్డు తీసుకున్న వారు అదనంగా మరో కార్డును తీసుకోవడాన్ని యాడ్-ఆన్ లేదా సప్లిమెంటరీ క్రెడిట్ కార్డ్ అంటారు. వ్యక్తిగత క్రెడిట్ కార్డులను అందిస్తున్న చాలా వరకు సంస్థలు యాడ్-ఆన్ క్రెడిట్‌కార్డు సదుపాయాన్ని అందిస్తున్నాయి.
ఎవరు తీసుకోవచ్చు?
సాధారణంగా తగిన ఆదాయ మార్గం ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. అయితే, ఆదాయ మార్గం లేని వారికి ఈ కార్డులు ఉపయోగపడతాయి. ఇంటిలో ఆదాయం లేని కుటుంబ సభ్యులు (భార్య, పిల్లలు, రిటైరైన తల్లిదండ్రులు, సోదరి, సోదరుల) కోసం యాడ్-ఆన్ కార్డ్ తీసుకోవచ్చు.
ఎన్ని కార్డులు తీసుకోవచ్చు?
కార్డు జారీసంస్థలు ప్రాథమిక కార్డుపై 2 లేదా 3 పరిమిత సంఖ్యలో యాడ్ ఆన్ కార్డులను జారీ చేస్తాయి. ఇది మీ కార్డు జారీ చేసిన సంస్థపై ఆధారపడి ఉంటుంది.
వార్షిక రుసుములు..
చాలా వరకు సంస్థలు వార్షిక రుసుము, జాయినింగ్ రుసుములు లేకుండా ఉచితంగానే కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే, కొన్ని కార్డులు మాత్రం వార్షిక రుసుముతో వస్తాయి. ఈ ఫీజు ప్రాథమిక కార్డుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఎస్‌బీఐ రెండు, హెచ్‌డీఎఫ్‌సీ మూడు, యాక్సిస్ బ్యాంక్ నాలుగు వరకు కూడా ఉచితంగానే యాడ్-ఆన్ కార్డులను అందిస్తున్నాయి.
క్రెడిట్ పరిమితి.
ప్రాథమిక, యాడ్-ఆన్ కార్డులకు వేరు వేరుగా క్రెడిట్ లిమిట్ ఉండదు. ప్రాథమిక కార్డు హోల్డర్ మరొక కార్డు తీసుకున్నప్పటికీ క్రెడిట్ పరిమితి అలాగే ఉంటుంది. అంటే, యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, క్రెడిట్ లిమిట్‌ని ప్రాథమిక కార్డ్ హోల్డర్‌తో పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రైమరీ కార్డు హోల్డర్లు.. ప్రతి యాడ్-ఆన్ కార్డుకు లిమిట్ పెట్టొచ్చు. ప్రైమరీ కార్డుతో సమానంగా గానీ, అంతకంటే తక్కువగానీ లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఇస్తారు.
రివార్డ్ పాయింట్లు..
ప్రైమరీ కార్డు హోల్డర్ల మాదిరిగానే యాడ్-ఆన్ కార్డు హోల్డర్లు రివార్డు పాయింట్లను పొందొచ్చు. అంటే, కనీస లావాదేవీల మొత్తం, వచ్చే రివార్డు పాయింట్లు, రిడెంప్షన్ ఆప్షన్ అన్ని ఒకేలా ఉంటాయి. అయితే, వచ్చిన రివార్డు పాయింట్లు మాత్రం ప్రైమరీ కార్డు హోల్డర్ ఖాతాకు క్రెడిట్ అవుతాయి. పాయింట్లను రిడీమ్ చేస్తున్నప్పుడు, ఏకీకృత పాయింట్లను ఉపయోగించవచ్చు. అంటే ప్రాథమిక కార్డు, యాడ్ ఆన్ కార్డులపై చేసిన ఖర్చుకు గానూ వచ్చిన రివార్డు పాయింట్లను కలిపి రిడీమ్ చేసుకోవచ్చు.
ఇతర ఫీచర్లు.
ప్రైమరీ కార్డుకు వర్తించే ఫీచర్లే యాడ్-ఆన్ కార్డుకి వర్తిస్తాయి. ప్రైమరీ కార్డుపై వచ్చే అన్ని ప్రయోజనాలు సప్లిమెంటరీ కార్డుపైనా పొందొచ్చు. అయితే, కొన్ని మాత్రం ప్రాథమిక కార్డు హోల్డర్‌కే వర్తిస్తాయి. ఉదాహరణకు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్. సాధారణంగా క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు కొన్ని సంస్థలు ప్రైమరీ కార్డు హోల్డర్‌కి ఉచిత కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అందిస్తాయి. యాడ్-ఆన్ కార్డులకు ఈ యాక్సెస్ అనుమతించరు. ప్రత్యేకించి, ఎయిర్‌పోర్ట్ ప్రయారిటీ పాస్ ప్రోగ్రామ్‌లో అందించే ఉచిత సభ్యత్వం, ఇతరాలు ప్రైమరీ కార్డ్ హోల్డర్లకు మాత్రమే లభిస్తాయి. ఇందుకు భిన్నంగా కొన్ని కార్డులు మాత్రం కాంప్లిమెంటరీగా ఇచ్చే ఉచిత యాక్సెస్‌ను ప్రైమరీ, యాడ్-ఆన్ కార్డు హోల్డర్లు పంచుకునేందుకు అనుమతిస్తున్నాయి.
ఆఫర్లు.
ఆఫర్ల విషయంలో చాలా వరకు కార్డు జారీ సంస్థలు.. యాడ్ - ఆన్ కార్డుని మరొక కార్డుగా పరిగణిస్తున్నాయి. మీ కార్డు విషయంలోనూ ఇదే వర్తిస్తుంటే ప్రాథమిక, యాడ్- ఆన్ కార్డు హోల్డర్లు విడివిడిగా ఆఫర్లు పొందొవచ్చు. సాధారణ క్రెడిట్ కార్డు ఆఫర్లలో తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత బహుమతులు, వోచర్లు మొదలైనవి లభిస్తాయి.
స్టేట్‌మెంట్.
ప్రాథమిక కార్డు, దానికి అనుసంధానమై ఉన్న అన్ని యాడ్-ఆన్ కార్డులకు కలిపి బ్యాంకులు క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను జారీ చేస్తాయి. ఇందులో ప్రాథమిక కార్డు హోల్డర్‌తో పాటు, యాడ్-ఆన్ కార్డు హోల్డర్లు చేసిన మొత్తం లావాదేవీలు ప్రతిబింబిస్తాయి. దీంతో ప్రాథమిక కార్డు హోల్డర్ యాడ్-ఆన్ కార్డు వినియోగదారులు చేసిన ఖర్చులు, విత్‌డ్రాలను ట్రాక్ చేయవచ్చు.
బిల్లు చెల్లింపు.
ఇక బిల్లు చెల్లింపు విషయానికి వస్తే.. యాడ్-ఆన్ కార్డు బకాయిల బాధ్యత ప్రాథమిక కార్డు హోల్డర్ పైనే ఉంటుంది. యాడ్-ఆన్ కార్డుదారుడు బిల్లును సకాలంలో చెల్లించకపోతే.. అది ప్రాథమిక కార్డు హోల్డర్ స్టేట్‌మెంట్‌లో ప్రతిబింబిస్తుంది. దాని కోసం అయ్యే ఛార్జీలు కూడా స్టేట్మెంట్‌లో కనిపిస్తాయి. దీని ప్రభావం క్రెడిట్ స్కోరుపైనా ఉంటుంది.
కనీస చెల్లింపు/ఫైనాన్స్ ఛార్జీలు.
కార్డు హోల్డర్ ప్రాథమిక కార్డు బిల్లును పూర్తిగా చెల్లించి, యాడ్-ఆన్ కార్డు కోసం కనీస బిల్లును చెల్లించి, బ్యాలెన్సును తదుపరి నెలకు బదిలీ చేయవచ్చు. అయితే, అవుట్ స్టాండింగ్ మొత్తంపై ఫైనాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. అంతేకాకుండా సాధారణ క్రెడిట్ కార్డు మాదిరిగానే కొత్త కొనుగోళ్లకు వడ్డీ రహిత కాలవ్యవధి ఉండదు. మొదటి రోజు నుంచే ఫైనాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి.
క్రెడిట్ స్కోరుపై ప్రభావం.
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డు ప్రాథమిక క్రెడిట్ కార్డుకి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఈ కార్డులకు సంబంధించిన అన్ని లావాదేవీలు, బిల్లు చెల్లింపులు సాధారణ క్రెడిట్ కార్డు మాదిరిగానే రికార్డు చేస్తారు. కార్డుదారులు పూర్తి బిల్లు చెల్లించకుండా కనీస బిల్లును చెల్లిస్తూ తదుపరి నెలకు వాయిదా వేయడం వంటివి పదే పదే చేస్తుంటే అప్పు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ బిల్లు చెల్లించడంలో విఫలమయితే ఇవి క్రెడిట్ నివేదికలో ప్రతిబింబిస్తాయి. దీంతో క్రెడిట్ స్కోరు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఇతర ఛార్జీలు.
సాధారణ క్రెడిట్ కార్డు మాదిరిగానే ఫైనాన్స్ ఛార్జీలు, క్యాష్ అడ్వాన్స్ ఫీజు, ఆలస్య చెల్లింపు రుసుములు, ఓవర్ లిమిట్ ఛార్జీలు వంటివి యాడ్-ఆన్ కార్డులకు వర్తిస్తాయి.
చివరిగా.
కుటుంబంలోని వ్యక్తుల కోసం యాడ్-ఆన్ కార్డు తీసుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లల కోసం కార్డును తీసుకుంటే ఎప్పటికప్పుడు ఖర్చులను ట్రాక్ చేస్తూ ఉండండి. ఛార్జీల బారిన పడకుండా, క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఉండేందుకు ప్రాథమిక కార్డుతో పాటు యాడ్-ఆన్ కార్డుల బిల్లును కూడా సకాలంలో పూర్తిగా చెల్లించాలని గుర్తుంచుకోండి. కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు వర్తించే ఛార్జీలు, వార్షిక రుసుముల గురించి వివరంగా తెలుసుకోవడం మంచిది.
COMMENTS