లోనావాలా అందాలు ఈ సీజన్‌లో రెట్టింపవుతాయి!!
అదొక అద్భుతమైన.. అందమైన ప్రదేశం. ఇతర ప్రాంతాల్లో చలికాలంలో మాత్రమే కనిపించే సొగసైన మంచు దుప్పటి ఇక్కడ వర్షాకాలంలోనూ కప్పేస్తుంది. పచ్చని పర్వతావళి నుంచి జాలువారే జలపాతాల సవ్వడులు అదనపు ఆకర్షణ.
పురాతన శిల్పాలతో అలరారే ఆలయాలు.. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎటుచూసినా నయనానందకరమే. మదిని పులకరింపజేసే ఆ పర్యాటక కేంద్రం మహారాష్ట్రలోని పుణేకు దగ్గరలో ఉన్న లోనావాలా.
ఇక్కడికి ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదు. అందుకే ఏడాది పొడవునా అక్కడ పర్యాటకులు బారులు తీరుతూనే ఉంటారు. ఆ ప్రకృతి అందాలను మనసారా పలకరించేందుకు వెళ్లిన మా అనుభవాల సమ్మేళనం మీకోసం!
ఆలోచన వచ్చీ రాగానే హైదరాబాదు నుంచి ఛలో మహారాష్ట్ర అంటూ పయనమయ్యాం. అక్కడికి చేరుకోగానే, భీమశంకరుని పురాతన ఆలయ సందర్శనతోపాటు జలపాతాలు, పురాతన గుహలు, పరుచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఇక్కడ చాలా రమణీయంగా ఉంది. పురాతన ఆలయ నిర్మాణశైలి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. మా ప్రయాణంలోని ఎన్నో మధుర స్మృతులతో తిరిగొచ్చాం. ఈ సీజన్లో మేం ఎంచుకున్న ఈ ప్రదేశాలను చేరుకోవడం అంటే కాస్త సాహసమే! అయితే, వర్షాకాలంలో ఈ ప్రాంతపు అందాలు రెట్టింపవుతాయనడం అతిశయోక్తి కాదు. అందుకే మా ప్రయాణానికి ఎక్కడా బ్రేకులు పడలేదు.
అపురూప నైపుణ్యంతో మలచిన అందాలు..
హైదరాబాద్ నుంచి రైలులో కుటుంబ సభ్యులు, మరికొందరు మిత్రులతో కలిసి పుణే చేరుకున్నాం. పుణే నుంచి భీమశంకర్ దాదాపు నాలుగు గంటల ప్రయాణం. పుణే నుంచి ప్రైవేటు వాహనంలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమశంకర్ చేరుకున్నాం. అక్కడే భీమశంకర ఆలయం ఉంది. రిసార్టులో ఫ్రెషప్ అయ్యాక, ఆలయాన్ని చూసేందుకు బయలుదేరాం. వర్షాకాలం కావడంతో జోరున వర్షం మాకు స్వాగతం పలికింది. ఓ వైపు లోయలు, మరోవైపు పొగమంచు నడుమ సుమారు రెండు కిలోమీటర్లు నడిచి, అక్కడికి చేరుకున్నాం. భూ మట్టానికి దాదాపుగా కిలోమీటరు లోతులో ఈ ఆలయం ఉంది.
ప్రకృతి నడుమ అపురూప నైపుణ్యంతో మలచిన ఆ అందాలు మరచిపోలేని సంతృప్తిని ఇచ్చాయనే చెప్పాలి. ఇక్కడే సాహసయాత్రీకుల కోసం జలపాతాలు, ట్రెక్కింగ్ స్వాగతం పలుకుతాయి. ఆ ప్రదేశానికి వెళ్లగానే మేమంతా ఒక్కసారిగా చిన్నపిల్లలమైపోయాం. మా నాలుగేళ్ల పాప అయితే ముసిముసి నవ్వులతో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మా బృందంలో వృద్ధులు ఉన్నప్పటికీ మేమంతా ఉరకలు వేసే ఉత్సాహంతో ట్రెక్కింగ్‌లో పాల్గొన్నాం.
హాయిగొలిపే వాతావరణం..
సరిగ్గా అక్కడి నుంచి మరో 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి లోనావాలా చేరుకున్నాం. రద్దీగా ఉండే ముంబై నగర జీవితం నుంచి చక్కటి ఆటవిడుపుని అందించింది లోనావాలా. మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధ పర్వత ప్రాంతం ఇది. 'గుహలు' అని అర్థం వచ్చే లోనాలి అనే సంస్కృత పదం నుంచి లోనావాలాకు ఆ పేరు వచ్చిందని స్థానికులు చెప్పుకొచ్చారు. నిజంగా, లోనావాలా పర్వతారోహకులకు ఓ మంచి ఉల్లాసాన్ని కలిగించే ప్రదేశం. అదీకాకుండా చాలా చారిత్రాత్మక కోటలు, పురాతన గుహలు, కనువిందు చేసే నిర్మలమైన సరస్సులు ఉన్నాయి.
హాయిగొలిపే ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా యాత్రికులకు వినోదాన్ని పంచుతూనే ఉంటుందనడంలో సందేహమే లేదు. ఓ వైపు దక్కన్ పీఠభూమిని, మరోవైపు కొంకణ్ తీరాన్ని అందంగా చూపించేదే లోనావాలా. ప్రకృతిని ప్రేమించే బృందాలు అక్కడ చాలానే మాకు తారసపడ్డాయి.
COMMENTS