పూల వర్ణపు కాంతులు వెదజల్లే.. పింక్ రివర్!
ప్రకృతిలోని అత్యద్భుతమైన సౌందర్యాన్ని అనుభవించే అనుభూతికి ఏదీ సాటిరాదు. అలాంటి అందమైన ప్రదేశంలో ఆకర్షించే పూల వర్ణంతో ఓ నది స్నానం చేస్తుందా? అన్నట్లు కనిపిస్తే ఆ సుందర దృశ్యం మన మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడం అతిశయోక్తి కాదు. చూపరుల కళ్లు తిప్పుకోనియ్యని అలాంటి నది కేరళలోని కోజికోడ్‌లో ఉంది. దీన్ని పింక్ రివర్‌గా పిలుస్తారు.
ఈ నదిని చూడగానే ఆ నీళ్లన్ని గులాబిరంగులోకి మారిపోయాయా? అన్న సందేహం కలుగుతుంది. నిజానికి ఆ నదిలో నీటి రంగు మారదు, అందులో పూసిన అందమైన పూల వల్ల ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
ఈ అందమైన దృశ్యంపై ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర కూడా ఇటీవల స్పందించారు. 'ఈ గ్రామానికి పర్యాటకులు తరలి రావడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఈ ఫొటో నాలో ఉత్సాహాన్ని, ఆశావాద భావాన్ని పెంచుతుంది' అని ట్వీట్ చేశారు. దీంతోపాటు ఈ ఫొటోను నా కొత్త స్క్రీన్ సేవర్పెట్టుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆయన.. ఈ ఫొటోకు 'రివర్ ఆఫ్ హూప్' అని పేరు పెట్టుకుంటున్నానని అన్నారు. ఈ పింక్ నది ఫొటోలు వైరల్ అవడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2020 నవంబర్‌లో కూడా ఈ నది ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
గులాబీ రంగు పువ్వుల తివాచి పరిచినట్లు..
ఇది కేరళలోని కోజికోడ్ జిల్లాలోని అవలపండి అనే గ్రామంలో ఉంది. ఈ ఊరి పొరిమేర్ల గుండా చిన్న నది ప్రవహిస్తూ ఉంది. ఏటా ఈ సమయంలో ఆ నదిలో పూలు పూస్తాయి. ఈ పూల వనంతో ఆ నది మొత్తం గులాబివర్ణంలా మారిపోతుంది. ఈ నదిని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, విదేశీ
పర్యాటకులు కూడా వస్తుంటారు. ఇక్కడ ఫొటో షూట్‌లు కూడా పెట్టుకుంటారు. గులాబీ రంగు పువ్వుల తివాచి పరిచినట్లు కనిపించే ఈ నదిని చూస్తుంటే ఏదో కొత్త లోకంలో ఉన్నమా? అనే అనుభూతి కలుగుతుంది. అసలు ఇక్కడి నుంచి కదిలి వెళ్లేందుకు మనసు అంగీకరించదు. ఆ దృశ్యాలు మనల్ని అంతలా కట్టిపడేస్తాయి. గులాబి వర్ణంలో కనిపించే ఈ పూల పేరు ఫోర్క్‌డ్ ఫాన్‌వోర్ట్ ఫ్లవర్స్ ఇవి ఈ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. వీటివల్లే ఈ నది గులాబివర్ణంలోకి మారుతుంది.
ఆ గ్రామం మంచి టూరిస్టు ప్లేస్‌గా..
స్థానికంగా నివసించేవారు ఈ పూలను ఉల్లప్ పాయల్ అని కూడా పిలుస్తారు. ఎక్కువగా స్థానికులు ఈ పూలను కోసి అమ్ముకుని ఆదాయం గడిస్తుంటారు. ఈ సీజన్‌లో వీరికి ఇదే జీవనోపాధి. ఇప్పుడు మళ్లీ అక్కడ పువ్వులు పూచే సీజన్ కావడంతో అంత అక్కడ ఫొటోలు దిగుతూ షేర్ చేస్తున్నారు. దీంతో పింక్ రివర్ కాస్తా సోషల్‌మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఇలా ఈ పింక్ రివర్ ఫోటోలు వరుసగా వైరల్ కావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇవి చూసినవారంతా ఆ పింక్ రివర్‌ను నేరుగా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పర్యాటకుల సందడితో అవలపండి గ్రామం మంచి టూరిస్టు ప్లేస్‌గా ప్రాచుర్యం పొందుతోంది. మరెందుకు ఆలస్యం మీరూ బ్యాగ్ సర్దుకొని గులాబీ రంగు నది అందాలను చూసేందుకు బయలుదేరండి.
COMMENTS