కార్లలో ఏసి రీసర్క్యులేషన్ బటన్ ఉపయోగం ఏంటి? దానిని ఎప్పుడు ఉపయోగించాలి?
మీ కారు డ్యాష్‌బోర్డులో ఉండే ఏసి కంట్రోల్స్ వద్ద వంపు తిరిగిన బాణం గుర్తు (కర్వ్డ్ యారో)తో ఒక స్విచ్ ఉంటుంది గమనించారా? దానినే ఎయిర్ రీసర్క్యులేషన్ స్విచ్ అని పిలుస్తారు. అసలు ఈ ఫీచర్ ఉపయోగం ఏమిటి మరియ ఎలాంటి సందర్భాలలో ఈ స్విచ్ ని ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
వేసవి వచ్చేసింది, బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కారు లోపల ఎయిర్ కండీషనర్ ఉండటం చాలా అవసరం. వేసవిలో కారు క్యాబిన్ లోపల వాతావరణ చాలా వేడిగా ఉంటుంది. అదే బయట ఎండలో పార్క్ చేసిన కార్లలో అయితే, ఆ వేడి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. కారు లోపల ఏసి ఆన్ చేయగానే క్యాబిన్ మొత్తం వీలైనంత త్వరగా చల్లబడాలని అందరూ కోరుకుంటుంటారు.
సాధారణంగా, కారులో ఏసి ఆన్ చేయగానే క్యాబిన్ చల్లబడటానికి దాదాపు 10-15 నిమిషాల సమయం పడుతుంది (ఇది మనం ఉపయోగించే కారును బట్టి మారుతూ ఉంటుంది). అయితే, కారు లోపల క్యాబిన్ త్వరగా చల్లబడాలంటే, మీ కారులో అందించిన ఈ ఫీచర్ ను ఉపయోగిస్తే, తక్కువ సమయంలోనే క్యాబిన్ ను త్వరగా చల్లబరచుకోవచ్చు. అదే, కారు యొక్క ఎయిర్ కండీషనర్ తో అందించబడిన ఎయిర్ రీసర్క్యులేషన్ ఫీచర్. పైన తెలిపినట్లుగా ఈ ఫీచర్‌కి సంబంధించిన స్విచ్ డ్యాష్‌బోర్డులోని ఏసి కంట్రోల్స్ వద్ద ఉంటుంది మరియు ఇది వంపు తిరిగిన బాణం గుర్తుతో సూచించబడి ఉంటుంది.
ఎయిర్ రీసర్క్యులేషన్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
సాధారణంగా ఈ బటన్ విషయంలో చాలా మందికి ఓ అపోహ ఉంటుంది, ఈ బటన్ నొక్కగానే కారు బయట ఉండే వేడిగాలి లోపలకి ప్రవేశిస్తుందని అనుకుంటుంటారు. నిజానికి, ఇది బయటి నుండి గాలిని తీసుకోదు, క్యాబిన్ లోపల ఉన్న గాలినే తిరిగి ప్రసరించేలా (రీసర్క్యులేట్) చేస్తుంది. ఎయిర్ కండిషనర్లు బయటి నుండి వేడి గాలిని తీసుకొని ఆ గాలిని చల్లబరచడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా క్యాబిన్ లోపల చల్లగాలి ప్రసరించడానికి కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది.
అయితే, క్యాబిన్ లోపల ఈ రీసర్క్యులేషన్ ఫీచర్ ను ఉపయోగించినప్పుడు, ఎయిర్ కండీషనర్ సిస్టమ్ బయటి నుండి వేడి గాలిని తీసుకోదు, బదులుగా క్యాబిన్ లోపల ఉన్న గాలినే చల్లబరచేందుకు ప్రయత్నిస్తుంది. అంటే, క్యాబిన్ లోపల గాలి బయటి వేడి గాలి కంటే కాస్తంత చల్లగా ఉన్నట్లయితే, ఇది క్యాబిన్ లోపలి గాలినే త్వరగా చల్లగా చేస్తుంది. అంతేకాకుండా, ఏసి ఆన్ చేసిన కాసేపటి తర్వాత ఇది బయటి నుండి వేడి గాలిని తీసుకోవడం మానేసి, లోపల ఉన్న చల్లగాలినే మరింత చల్లగా రీసర్క్యులేట్ చేస్తూ ఉంటుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఎయిర్ కండిషనింగ్ ప్రతిసారి బయటి గాలిని సేకరించి దానిని చల్లబరచి కారు లోపలకి ప్రసరించేలా చేయడం కంటే లోపల ఉన్న చల్లగాలినే రీసర్క్యులేట్ చేసుకుంటూపోతే, క్యాబిన్ ఎప్పటికీ చల్లగా ఉంటుంది మరియు ఎయిర్ కండిషనింగ్ పనితీరుపై తక్కువ వత్తిడిని ఇస్తుంది.
ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్ ని ఎప్పుడు ఉపయోగించాలి?
సాధారణంగా వేసవి కాలంలో ఎయిర్ రీసర్క్యులేషన్ సిస్టమ్ ను ఉపయోగించడం మంచిది. ఇది క్యాబిన్ ను ఎక్కువ సమయం చల్లగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే, వర్షాకాలంలో ఎయిర్ రీసర్క్యులేషన్ వ్యవస్థ ను ఉపయోగించడం అంత మంచిది కాదు. ఎందుకంటే, వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో, రీసర్క్యులేషన్ ఉపయోగించినట్లయితే, తేమతో కూడిన గాలి కారు లోపల ప్రసరించడం కొనసాగుతుంది, దీని వలన అద్దాలపై పొగమంచు (ఫాగ్/మిస్ట్) ఏర్పడుతుంది. ఫలితంగా, రోడ్డుపై విజిబిలిటీ తగ్గుతుంది.
విండోస్ డౌన్ చేసి, బ్లోయర్ ఆన్ చేస్తే ఫలితం ఉంటుందా?
సాధారణంగా, ఎండలో పార్క్ చేసిన కారు క్యాబిన్ లోపల గాలి బయటి గాలి కన్నా చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి, కారును ఆన్ చేసిన వెంటనే ఏసి ఆన్ చేసి, రీసర్క్యులేషన్ బటన్ ఉపయోగించినా పెద్ద ఫలితం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కారును ఆన్ చేయగానే అన్ని విండోస్ పూర్తిగా డౌన్ చేసి, బ్లోయెర్ ఫుల్ స్పీడ్ లో ఆన్ చేయడం వలన కారు లోపల వేడి గాలి బ్లోయెర్ వేగానికి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత విండోస్ రోల్ చేసి, ఏసిని ఫుల్ స్పీడ్ లో ఉంచి, రీసర్క్యులేషన్ ఫీచర్ ని ఉపయోగించినట్లయితే, క్యాబిన్ చాలా తక్కువ సమయంలోనే చల్లగా మారుతుంది.
కారులో ఏసి ఆన్ చేసి డ్రైవ్ చేస్తే మైలేజ్ తగ్గుతుందా?
అవును, కారులో ఏసి ఆన్ చేసి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా మైలేజ్ తగ్గుతుంది. ఎందుకంటే, ఏసికి పవర్ అందించే కంప్రెసర్ ఇంజన్ కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంజన్ విడుదల చేసే పవర్ లో కొద్దిగా కంప్రెసర్ కూడా బదిలీ చేయబడుతుంది, ఫలితంగా ఎక్కువ ఇంధన ఖర్చు అవుతుంది. కాబట్టి, ఏసి ఆన్ చేసి కారును నడిప్పుడు మైలేజ్ కూడా తగ్గుతుంది. అలాగని, అన్ని విండోస్ రోల్ చేసి డ్రైవ్ చేసినా కూడా మైలేజ్ తగ్గుతుంది. ఎందుకంటే, కారు లోపలికి ప్రవేశించి గాలి, కారును ముందు నెట్టడానికి అడ్డుగా మారుతుంది. ఫలితంగా, కారును ముందుకు నెట్టేందుకు ఇంజన్ ఎక్కువ కష్టపడుతుంది. కాబట్టి మైలేజ్ తగ్గుతుంది.
COMMENTS