విటమిన్ B12 ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!
మనం తినే ఆహార పదార్థాల్లో అన్ని పోషక విలువలు ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే ఒక్కోసారి పోషక విలువలు అతిగా తీసుకున్నా ప్రమాదమే.
చాలా మంది ప్రజల్లో విటమిన్ బి-12 (Vitamin B12) లోపిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రజలు విటమిన్ బి-12 పుష్కలంగా దొరికే మాంసం, సీ ఫుడ్ (Sea Food)తో పాటు సప్లిమెంట్లు తరచూ తీసుకుంటారు.
అయితే శరీరానికి విటమిన్ బి12 ఎక్కువైనా హానికరమే. మరి అధిక మోతాదులో విటమిన్ బి-12 తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి? విటమిన్ బి-12 తీసుకోవడం ఎప్పుడూ ఆపేయాలి? వంటి ముఖ్య వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ బి12 సప్లిమెంట్లను ఎప్పుడు వాడాలంటే
ఎర్ర రక్తకణాల పుట్టుకకు, నాడుల మధ్య సమాచారం చేరవేసేందుకు, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో విటమిన్ బి12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ బి12 జంతు సంబంధ ఆహారం ద్వారా మాత్రమే లభిస్తుంది. అందుకే శాకాహారులు బి12 మాత్రాలను లేదా సప్లిమెంట్లను వాడుతుంటారు. ఆహారం ద్వారా తగినంత బి12 అందని వారు కూడా సప్లిమెంట్లపై ఆధారపడతారు.
ఎందుకంటే శరీరం సహజంగా దీనిని ఉత్పత్తి చేయదు. అయితే, సప్లిమెంట్లకు బదులుగా విటమిన్ బి12ని ఆహారం నుంచే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం, డెయిరీ ప్రొడక్ట్స్, బలవర్థకమైన తృణధాన్యాలను తినని వారు మాత్రమే సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ B12 ఉదయం తీసుకుంటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఎందుకంటే రాత్రిపూట తీసుకుంటే నిద్రకు భంగం వాటిల్లుతుంది. B12 సప్లిమెంట్లను తీసుకునేవారు ఒక గ్లాసు నిండా నీటిని తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
విటమిన్ బి-12ని అధిక మోతాదులో తీసుకోవచ్చా?
విటమిన్ బి-12తో ఓవర్‌డోస్ కావడం సాధ్యం కాదు కానీ B12 స్థాయిలు శరీరంలో పెరిగే అవకాశం ఉంది. B12 ఇంజెక్షన్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్ల వల్ల శరీరంలో విటమిన్ B12 స్థాయిలు పెరగవు. అయితే, ఇంజెక్షన్లు డాక్టర్ సూచనల మేరకే తీసుకోవాలి.
కండరాల్లో ఈ ఇంజక్షన్లు చేస్తారు. వీటిలో సాధారణంగా హైడ్రాక్సోకోబాలమిన్ లేదా సైనోకోబాలమిన్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్ల త్వరగా, మరింత ఎక్కువగా శరీరంలో బి-12 కలిసేలా చేస్తాయి. అందుకే వీటి అతి వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విటమిన్ బి-12 అధికమైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్
విటమిన్ బి-12 అధికమైతే తలనొప్పి, మైకము, అతిసారం/డయేరియా, చర్మంపై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, వాపు, జలదరింపు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. విటమిన్ B12 మరింత ఎక్కువైతే అనాఫిలాక్సిస్ అనే అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. దీనివల్ల ముఖం, నాలుక, గొంతు వాపు సమస్యలు వస్తాయి.
ఏ స్థాయిలో తీసుకుంటే మంచిది
నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్ ప్రకారం, 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 2.4 మైక్రోగ్రాములు (mcg) విటమిన్ బి-12 తీసుకోవాలి. గర్భిణీలు 2.6 మైక్రోగ్రాములు, పాలిచ్చే స్త్రీలు 2.8 మైక్రోగ్రాములు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు 25-100 మైక్రోగ్రాములు బి-12 తీసుకోవాల్సి ఉంటుంది.
COMMENTS